Telangana Results: బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించింది. తెలంగాణలో అధికారం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలవబోతోంది. 40 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో పలువురు మంత్రులు కూడా ఘోరంగా ఓటమి చవిచూశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మినహాయిస్తే ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీపై సింపతి వర్కవుట్ అయింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకులుగా ఉన్న ముగ్గురు పరాజయం చవిచూశారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా గుర్తింపు పొందిన బాల్క సుమన్, గాదరి కిషోర్, గువ్వల బాలరాజు ఓడిపోయారు.
చెన్నూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. తుంగతుర్తి నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాదరి కిషోర్‌పై కాంగ్రెస్ నేత మందుల సామ్యేల్ విజయం సాధించారు. ఇక అచ్చంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో గువ్వల బాలరాజు పరాజయం పాలయ్యారు. కాగా, ఈ బీఆర్ఎస్ నాయకులపై ఆయా నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. దీంతోనే వారు ఓటమి పాలయ్యారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.