Site icon NTV Telugu

Balka Suman: బూర నర్సయ్యకు ఆ హక్కు లేదు.. ఇది బీజేపీ చిల్లర రాజకీయం

Balka Suman Boora

Balka Suman Boora

Balka Suman Fires On Boora Narsaiah Goud: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామాపై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. చండూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. రాజీనామా లేఖలో బూర నర్సయ్య పేర్కొన్న అంశాలను టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బూర నర్సయ్యకు టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించిందని.. పూర్తి స్థాయిలో సహకరించిందని అన్నారు. టీఆర్ఎస్‌లో తనకు తగిన గౌరవం దక్కలేదని చెప్తున్న బూర నర్సయ్యకు తరుణ్ చుగ్ అప్పాయింట్‌మెంట్ కూడా దక్కలేదని.. అలాంటి వ్యక్తి ఆత్మాభిమానం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

2014, 2018 ఎన్నికల్లో నర్సయ్యకు టీఆర్ఎస్ పార్టీ అవకాశాలు కల్పించిందన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా.. వాటిని నర్సయ్య వినియోగించుకోలేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. పద్మశాలి, గౌడ్, ఇతర కుల వృత్తులకు ప్రాధాన్యతతో పాటు గౌరవం దక్కింది ఒక్క టీఆర్ఎస్ పాలనలోనేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత బూర నర్సయ్యకు లేదని, రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాల్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందని.. ప్రజా క్షేత్రంలోకి వెళ్ళలేకే ఆ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని బాల్క సుమన్ ఆరోపించారు.

అంతకుముందు.. మునుగోడుకు పట్టిన దరిద్రం పోయి అభివృద్ధి జరగాలంటే, ముందుగా రాజగోపాల్‌రెడ్డి శని వదిలిపోవాలని బాల్క సుమన్‌ విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి.. నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ, కేడీలు ఎంత మంది వచ్చినా మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపును అడ్డుకోలేరని.. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేటీఆర్‌ రోడ్ షో తర్వాత పార్టీ క్యాడర్‌లో జోష్ మరింత పెరిగిందన్నారు. బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించిన బాల్క సుమన్.. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version