Site icon NTV Telugu

KTR Davos Tour: మరో 20 ఏళ్లలో కేటీఆరే దేశ ప్రధాని

Ktr Next Pm

Ktr Next Pm

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ టీమ్ దూసుకుపోతోంది. కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కి ఉన్న విజన్‌ను కొనియాడుతూ.. ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.

‘‘20 ఏళ్ల త‌ర్వాత కేటీఆర్ భారత్‌కు ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాల‌పై స్పష్టమైన అవ‌గాహ‌న‌, భావ వ్యక్తీక‌ర‌ణ ఉన్న ఇలాంటి యువ నాయ‌కుడ్ని నేను నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు. దావోస్‌లో తెలంగాణ టీమ్ దూసుకుపోతోంది. చూస్తుంటే.. కేటీఆర్ తెలంగాణ‌ రాష్ట్రానికి బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు తీసుకెళ్లే విధంగా ఉన్నార‌ు. తెలంగాణ టీమ్ నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు తెచ్చాయి’’ అంటూ ఆశా జడేజా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా జత చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం కేటీఆర్ పనితీరుని, ఆయన విజన్‌ను మెచ్చుకుంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలావుండగా.. దావోస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ఆశీర్వాద్ పైప్స్ (Aliaxis) గ్రూప్ తెలంగాణలో రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ పైల్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. అంతేకాదు.. యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అటు, ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ పెట్టేందుకు అంగీకరించింది.

Exit mobile version