Site icon NTV Telugu

Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్‌మహలే కారణం

Asaduddin On Pm Modi

Asaduddin On Pm Modi

తమ ప్రసంగంలో ప్రతీసారి ముస్లిములు, మొగలుల ప్రస్తావన తీసుకురావడంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లిములనే బీజేపీ నిందిస్తోందని ఆరోపించిన ఆయన.. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే.. ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 40 మాత్రమే ఉండేదని వ్యంగాస్త్రాలు చేశారు. అంతేకాదు.. యువత నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడంటూ సెటైర్ల మీద సెటైర్ల వేశారు.

‘‘ఈరోజు దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడానికి, ధరలు ఆకాశాన్నంటడానికి, లీటర్ – డీజెల్ ధరలు అమాంతం పెరగడానికి కారణం ప్రధాని మోదీ కాదు.. ఔరంగజేబు. నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104-115కి చేరడానికి కారణం.. తాజ్‌మహల్ కట్టిన షాజహాన్! ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే, ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేది. ప్రధాని మోదీ చెప్పినట్టు.. తాజ్‌మహల్‌, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పు చేశారని నేను అంగీకరిస్తాను. వాటిని కట్టడానికి బదులు, ఆ డబ్బుల్ని దాచి, 2014 ఎన్నికల్లో మోదీ గెలుస్తారని తెలుసుకొని ఆ డబ్బంతా ఆయనకు ఇవ్వాల్సింది’’ అంటూ ఒవైసీ సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని ప్రతీ సమస్యకు ముస్లిములు, మొగలులే కారణమని బీజేపీ ప్రచారం చేయడం ఏమాత్రం సబబు కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్‌ను కేవలం మొగలులే పరిపాలించలేదని.. అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడుతో పాటు ఇంకా చాలామంది పాలించారన్నారు. కానీ.. బీజేపీకి మాత్రం మొగలులే కనిపిస్తారని.. ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్తాన్‌ను చూస్తుందని మండిపడ్డారు. భారత ముస్లిములకు మొగలులు, పాకిస్థాన్‌‌తో ఎలాంటి సంబంధం లేదని.. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామని తేల్చి చెప్పారు. తమను వెళ్లగొట్టాలని ఎన్ని నినాదాలు చేసినా, తాము పట్టించుకోమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Exit mobile version