Asaduddin Owaisi Requests To Change Name Telangana Liberation Day As Telangana National Integration Day: సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన తరుణంలో.. అదే రోజున పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టేందుకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ అంశంపై ఆయన ఆయన ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు లేఖలు రాసినట్టు తెలిపారు. సెప్టెంబరు 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అని.. ఆ రోజుని తెలంగాణ విమోచన దినోత్సవంగా కాకుండా జాతీయ సమగ్రత దినోత్సవంగా జరిపించాలని కోరారు. నాడు తెలంగాణ విమోచన కోసం హిందువులతో పాటు ముస్లిములు కూడా పోరాడారని, తురేభాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశామని గుర్తు చేశారు. తాము సెప్టెంబర్ 17వ తేదీన పాతబస్తీలో తిరంగా యాత్ర చేపడతామని, బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో తమ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేసి, ఈ స్వాతంత్రాన్ని పొందారు. ఆ సందర్భానికి 75 సంవత్సరాలు పూర్తవ్వడంతో, తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు అవుతున్నారు. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు.. అంటే సంవత్సరం కాలం పాటు నిర్వహించాలని నిర్ణయించారు.