Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించింది. గతంలో జరిగిన పరీక్షల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పరీక్షకు ఒకరికి బదులు మరొకరు హాజరు కాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే వారికి ఓఎంఆర్ పత్రాల్ని అందజేస్తారు. జులై 1న గ్రూప్-4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1ను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు .. పేపర్-2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read also: Cheetah: చిరుత చిక్కింది.. మరో చిరుత ఉన్నట్లు సమాచారం
ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు జులై 1న రాతపరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ సమయంలో 100 శాతం అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీచేసిన ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. హాజరుపట్టీలో ఫొటోను.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్షకు భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కమిషన్ ఆదేశించింది. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థులు హాల్‌టికెట్ నంబరు, ప్రశ్నపత్రం కోడ్, పేరు, సంతకం తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రూప్-4 పరీక్ష హాల్‌టికెట్లు ఈ రోజు నుంచే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జులై 1న పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.