Another Big Twist In Panjagutta Nisha Case: హైదరాబాద్ పంజాగుట్ట నిషా కేసులో విస్తుగొలిపే ట్విస్టులు ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఆ మహిళ విజయసింహా అనే ఓ ఎమ్మెల్యే అనుచరుడు తనపై కత్తితో దాడి చేశాడని ‘మహానటి’ లెవెల్‌లో డ్రామాలు ఆడింది. పోలీసులు నిజమేననుకొని ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీరా చూస్తే.. ఆమె గొంతుపై ఎలాంటి గాయాలు లేవని తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. అప్పుడు అధికారులు తమదైన రీతిలో విచారిస్తే.. విజయసింహా ఈమధ్య తనని దూరం పెడుతున్నాడని, కలవడానికి రావడం లేదన్న అక్కసుతో ఈ కుట్రకు తెరతీసినట్టు నిషా పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
అయితే.. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కుట్రలో మరో ఇద్దరి హస్తం ఉన్నట్టు.. నిషా ఫోన్‌ని పరిశీలించాక పోలీసులకు తెలిసింది. అంతేకాదు.. గతంలోనూ నిషా ఇతర కేసుల్లో పోలీసులకు పట్టుబడినట్టు తేలింది. సంఘటన జరిగిన రోజు, అదే తనపై విజయసింహా దాడి చేశాడని నిషా డ్రామా ఆడిన రోజు.. తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు సూరజ్ కుమార్, నందకుమార్ అలియాస్ నందులతో నిషా దాదాపు 30 సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరిలో నందు అనే వ్యక్తి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ వద్ద పీఏగా పని చేస్తున్నాడు. సంఘటనకి ముందు ఆ ఇద్దరి వ్యక్తులు వాట్సాప్ కాల్స్‌లో చాలాసేపు మాట్లాడుకున్నారు. విజయసింహాను కేసులో ఇరికించేందుకు నెల రోజుల క్రితమే పక్కా స్కెచ్ వేసుకున్నారట! సూరజ్, నందుల మధ్య వందల ఫోన్ కాల్స్ నడిచినట్టు పోలీసుల విచారణలో తేలింది.
మరో ట్విస్ట్ ఏమిటంటే.. నిషా ఆసుపత్రి బిల్లు చెల్లించిన అబ్రార్ అనే వ్యక్తి, దాడి జరిగినట్టు చెప్తున్న సమయంలో నిషాతోనే ఉన్నాడట! దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇది ఎంత పెద్ద కుట్రనో! చికిత్స అనంతరం గాయాలు లేవని తేలిన తర్వాత.. నిషాతో పాటు సూరజ్ అనే వ్యక్తి కూడా పరారయ్యాడు. తన అవసరానికి అనుగుణంగా నిషా బాడుగు, నిహారిక, కమల అంటూ నిషా తన పేర్లను మార్చుకుందని పోలీసులు గుర్తించారు. ఈ కుట్ర వెనుక ఎవరో పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో విచారణను కొనసాగిస్తున్నారు.
