తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరిలో ఏర్పాటు చేయనున్నారు.
Read Also: రూ.50వేలు పరిహారం పొందడానికి ఇలా దరఖాస్తు చేసుకోండి
తొలుత నాలుగేళ్ల కిందట హైదరాబాద్ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్ (ఐపీఎం) ఆవరణలో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో పూర్తిస్థాయిలో వాటంతట అవే పరీక్షలు చేసి ఫలితాలను వెల్లడించే రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ప్రతిరోజూ బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఈ ప్రయోగశాలకు చేరుస్తారు. రోగుల నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారి ఈ-మెయిల్, ఐడీ, మొబైల్ నంబరును తీసుకుంటారు. ల్యాబ్‌లో టెస్టుల అనంతరం ఆటోమేటిక్‌గా ఫలితాలను రోగి ఇచ్చిన మొబైల్ నంబరు లేదా ఈమెయిల్‌కు పంపుతారు.
