Site icon NTV Telugu

Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.24వేల కోట్ల పెట్టుబడులు

Amoled Company

Amoled Company

తెలంగాణకు వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని.. ఇందుకోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ మేరకు అమెలెడ్ డిస్‌ప్లే యూనిట్ విషయాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు జపాన్‌, కొరియా, తైవాన్‌ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్‌ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్‌ తెలంగాణలో తయారవుతుందన్నారు. తెలంగాణకు ఈరోజు హిస్టారిక్ డే అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణకు వస్తున్న ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3వేల మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఛైర్మన్ రాజేష్ మేహత అన్నారు. దీంతో పాటు డిస్‌ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, ఈ రంగ అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలేస్ట్ కంపెనీ, ఆరో తరం అమోలెడ్‌ డిస్‌ప్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలేస్ట్ సీఈవో శ్యామ్ రఘుపతి పాల్గొన్నారు.

Exit mobile version