హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మైత్రివనం సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న మెట్రో రైలు వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
మెట్రో రైలు సర్వీసులు ఎప్పటిలాగే పూర్తి సురక్షితంగా, సాధారణంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మెట్రో సిబ్బంది అప్రమత్తమై ప్రభావితమైన ఆస్తులపై లోతైన అంచనా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమేనని, అయితే దీనివల్ల మెట్రో రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయని ఎండీ వివరించారు.
కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న పుకార్లపై ఆయన స్పందిస్తూ.. మెట్రో స్తంభాలపై (పిల్లర్లపై) అమర్చిన ప్రకటనల బోర్డుల వినైల్ షీట్లు మాత్రమే మంటల తీవ్రతకు కాలిపోయాయని, అంతకుమించి మెట్రో వ్యవస్థ యొక్క ప్రధాన నిర్మాణాలు, కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. అందువల్ల మెట్రో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెట్రో ప్రయాణం పూర్తిగా సురక్షితమని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ భరోసా ఇచ్చారు.
