Agnipath Scheme Protest LIVE Updates:
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
-
ఈ నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర.. విజయశాంతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. సికింద్రాబాద్ లోనూ, దేశవ్యాప్తంగానూ జరిగిన రైళ్ల విధ్వంసం ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా ఇది ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థుల పనికాదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ వ్యతిరేక నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు. మోదీ సర్కారును, బీజేపీని వ్యతిరేకిస్తున్న అసాంఘిక శక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసాకాండ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఏళ్ల తరబడి తీవ్రస్థాయిలో కొనసాగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీయువకులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని, రైల్ రోకోలు, వంటావార్పులు, బంద్ లు, శాంతియుత నిరసనలు చేపట్టారని వివరించారు. ఈ తరహాలో హింస, ఆస్తుల విధ్వంసం జరగలేదన్నారు.
-
ఐదు ట్రైన్ల పునరుద్ధరణ
అగ్నిపథ్ విధ్వంసం నుంచి బయటపడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మరికొన్ని రైళ్ళు రద్దు. ఐదు ట్రైన్ల పునురుద్ధరణ జరిగింది.
హైదరాబాద్- విశాఖపట్నం
హైదరాబాద్- చెన్నై సెంట్రల్
హైదరాబాద్-తాంబరం
విశాఖపట్నం- హైదరాబాద్
తాంబరం- హైదరాబాద్
-
యథావిధిగా ప్రారంభమైన రైళ్ళు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి యథావిధిగా ప్రారంభమయ్యాయి రైళ్ళు. సికింద్రాబాద్ కి బదులుగా మౌలాలి, కాచిగూడ నుంచి ప్రారంభం అయ్యాయి మరికొన్ని రైళ్ళు. లింగంపల్లి-కాకినాడ ట్రైన్ ప్రారంభం. తిరిగి రైళ్ళు పునరుద్ధరణ కావడంతో ప్రయాణికుల ఆనందం. ప్లాట్ ఫాం1 పై వున్న లింగంపల్లి-కాకినాడ రైలు.
-
కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు రీస్టార్ట్
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరణ కొనసాగుతోంది. కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్, మైసూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి, విశాఖ వెళ్లాల్సిన రైళ్లు బయలుదేరాయని వెల్లడించారు. సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు చెప్పారు. తిరుపతి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా బయలుదేరనుంది
-
సికింద్రాబాద్ ఘటనపై కేసు నమోదు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన పై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదయ్యాయని రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు.
రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు. ఇంకా కేసు దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇంత మంది దాడిలో పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదు. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదన్నారు అనూరాధ. పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నాం. రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఎస్పీ అనూరాధ.
-
కాసేపట్లో రైలు సర్వీసులు ప్రారంభం
కాసేపట్లో సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7.40కి లింగంపల్లి-కాకినాడ ట్రైన్ బయల్దేరనుంది. అలాగే రాత్రి 8.20 గంటలకు విశాఖ-గరీబ్ రథ్ రైలు బయలుదేరనుంది.
-
రైల్వే ఆస్తుల విధ్వంసం వద్దు.. మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యువత హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బీహార్, తెలంగాణలో రైళ్లను ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. బీహార్ లో ఆందోళనకారులు ఇస్లామ్ పూర్, దానాపూర్ రైల్వేస్టేషన్లలో రైళ్లను దగ్ధం చేశారు. సికింద్రాబాద్ లోనూ రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు. నాలుగైదు రైళ్ల ఇంజిన్లను, రెండు మూడు బోగీలను అగ్నికి ఆహుతి చేశారు.
-
రాత్రి నుంచి యథాతథంగా సికింద్రాబాద్ నుంచి రైళ్లు..
సికింద్రాబాద్‌లో నెలకొన్న పరిస్థితులకు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. అయితే రాత్రి నుంచి యథాతథంగా రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తప టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరంలేదని, కాకపోతే రైళ్ల రాకపోకల్లో కొంత ఆలస్యం ఉంటుందని పేర్కొన్నారు.
-
రేపు భారత్ బంద్. ఆర్జేడీ మద్దతు
రేపు భారత్ బంద్. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకులు జూన్ 18వ తేదీన భారత్ బంద్‌కు పిలుపు నిచ్చారు.RJD ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి.
-
పోలీసు బందోబస్తు మధ్య రాకేష్ డెడ్ బాడీ తరలింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన రాకేష్ డెడ్ బాడీకి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. రాకేష్ డెడ్ బాడీని అతడి బంధువులకు పోలీసులు అప్పగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రాకేష్ డెడ్ బాడీ తరలిస్తున్నారు.
-
సాయంత్రం నుంచి మెట్రో సేవలు ప్రారంభం..
సికింద్రాబాద్‌లో నెలకొన్ని ఉద్రక్తత పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసిని మెట్రో సేవలను యథాతథంగా సాయంత్రి నుంచి పునః ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ వద్ద మళ్లీ ఉద్రిక్తత..
రైల్వే స్టేషన్‌ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో.. కొంతమంది ఆర్మీ అభ్యర్థులు బిక్కుబిక్కుమంటూ రైళ్లలో దాక్కుంటుండగా.. మరికొంతమంది రైల్వే స్టేషన్ నుంచి పరుగులు పెడుతున్నారు. ఆందోళన కారులను తరలించేందుకు రైల్వే స్టేషన్ బయట వాహనాలను సిద్ధం చేశారు.
-
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటనలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా చేపట్టింది. ఆందోళనకారులపై వాట్సాప్ చాటింగ్‌పై నిఘా పెట్టింది. రెండు రోజుల క్రితమే స్టేషన్‌పై అటాక్‌కు ప్లాన్ జరిగిందని అధికారులకు సమాచారం అందింది.
-
అగ్నిపథ్ స్కీం యువతకు సువర్ణావకాశం-రాజ్‌నాథ్
అగ్నిపథ్ స్కీమ్ భారతదేశ యువత దేశ రక్షణ రంగంలో చేరి సేవలు అందించేందుకు సుమర్ణావకాశం అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో యువత ఆర్మీలో చేరలేకపోయిందని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సూచనల మేరకు అగ్నివీరుల రిక్రూట్మెంట్ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామని తెలిపారు.
-
అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గేది లేదు-ఆర్మీ చీఫ్
అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గేది లేదని.. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ షెడ్యూల్ ప్రకటిస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత వయోపరిమితిని పెంచుతున్నామని, రిక్రూట్ మెంట్ వయసును 23 ఏళ్లకు పెంచామని ఆర్మీ చీఫ్ చెప్పారు.
-
ఆందోళనకారులతో అధికారుల చర్చలు విఫలం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులతో పోలీసు ఉన్నతాధికారుల చర్చలు విఫలమయ్యాయి. కాల్పుల్లో ఓ అభ్యర్థి చనిపోవడంపై రైల్వే డీజీ సందీప్ శాండిల్యతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.
-
విజయవాడలో హెల్ప్ లైన్ నంబర్లు
అగ్నిపథ్ స్కీంపై ఆందోళనల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్‌లలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైళ్లు రద్దు కావడం, దారి మళ్లించడం వంటి పూర్తి వివరాల కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 0866-2767055 0866-2767075 ఈ నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
-
ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు రద్దు
అగ్నిపథ్ స్కీంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో హింసాత్మక ఘటనలు జరగడంతో ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లో అన్ని మెట్రో రైలు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు.
-
అమిత్ షాతో కిషన్‌రెడ్డి సమావేశం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంటున్న విధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం అయ్యారు.
-
స్టేషన్‌కు వెళ్లే అన్ని దారులు మూసివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఆందోళనకారులెవరూ రాకుండా స్టేషన్‌కు దారితీసే సమీప మార్గాలను అన్నింటినీ మూసివేశారు.
-
ఆందోళనకారుల కాల్పుల్లో ఒకరు మృతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై ఆర్పీఎఫ్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు.
-
200 రైళ్ల రాకపోకలపై ప్రభావం
దేశంలో అగ్నిపథ్ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. అటు బీహార్‌లో.. ఇటు సికింద్రాబాద్‌లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో దేశంలో మొత్తం 200 రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే 35 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. మరో 13 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
-
నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
-
40 బైకులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. రైలు బోగీలతోపాటు 40 బైక్‌లకుపైగా నిప్పటించారు. పార్శిళ్లు, ఫర్నిచర్స్‌ను ట్రాక్‌పై ఉంచి నిప్పుపెట్టారు. ప్రయాణికులను పోలీసులు స్టేషన్ బయటకు తరలిస్తు్న్నారు.
-
రైల్వే జీఎం అత్యవసర సమావేశం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో రైల్వే జీఎం అత్యవసర భేటీ నిర్వహించారు. ఆస్తి నష్టం, ప్రయాణికులకు ప్రత్యామ్నాయంపై అధికారులతో రైల్వే జీఎం చర్చలు చేపట్టారు.
-
కేంద్ర ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలి-రేవంత్
అగ్నిపథ్ ఆందోళనలపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ల జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయం ఫలితం ఇదన్నారు. దేశ భక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగుతుంటే అగ్నిపథ్ సరైనది కాదని ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
-
దేశంలోనే నిరుద్యోగమే ఆందోళనలకు కారణం-కేటీఆర్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశంలో ఉన్న నిరుద్యోగతకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవల రైతులను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు యువతను గందరగోళానికి గురిచేస్తుందని కేటీఆర్ విమర్శించారు.
-
అగ్నిపథ్‌ను యువత అర్థం చేసుకోవాలి-గడ్కరీ
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు విమర్శిస్తాయని, అందులో భాగంగానే అగ్నిపథ్‌పై యువత ముసుగులో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందనే ఆందోళన అవసరం లేదని చెప్పారు.
-
విధ్వంసకాండకు, NSUIకి సంబంధం లేదు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న విధ్వంసకాండకు తమకు సంబంధం లేదని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రకటించారు.
-
బీహార్‌లోనూ ఆందోళనలు
కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బీహార్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రైల్వే స్టేషన్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. లక్ష్మీనియా రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
-
ఆందోళనకారులపై కాల్పులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
-
పార్శిళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకారులు రైలు పట్టాలపైకి భారీగా చేరుకుని పార్శిల్ సామాన్‌లకు నిప్పుపెట్టారు. పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్ పథకంపై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రైల్వేస్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌లోని స్టాళ్లను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు చెందిన బోగీలకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు రైళ్లకు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.