ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ప్రారంభోత్సవం రాజకీయ రచ్చకు తెర లేపింది. .వైద్యుల పోస్టులు భర్తీ చేయకుండా ప్రారంభోత్సవం చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. చివరకు కాంగ్రెస్ – టీఆర్‌ఎస్ శ్రేణులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడం ఇప్పడు హాట్ టాపిక్ అయింది.
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 కోట్లతో ఏర్పాటు చేశారు. ఆసుపత్రి 250 పడకల ఆస్పత్రిలో 8 డిపార్ట్‌మెంట్లలో 366 మంది వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో భర్తీ జరగలేదు. ఇదే ఇప్పడు రచ్చకు కారణమైంది. కేంద్రం నిధులతో నిర్మించి… ఎంపీ సోయం బాపూరావ్ లేకుండా ప్రారంభోత్సవం చేయడంపై BJP నేతలు నిరసనకు దిగారు. అలాగే మంత్రుల కాన్వాయ్‌ని కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో టీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య గొడవ జరిగింది. చివరకు వ్యవహారం స్టేషన్ వరకు వెళ్లింది.
వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు మంత్రులు. దమ్ముంటే బిజెపి ఎంపీలు బయ్యారం ఉక్కుఫ్యాకర్టీ, సీసీఐ తెరిపించడం కోసం ప్రయత్నంచేయాలని సవాల్ విసిరారు. మొత్తానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే రాష్ట్ర మంత్రులు ప్రారంభించడంతో ఆధిపత్య పోరుకు తెర లేచినట్టయింది.
