Addanki Dayakar comments on BJP, Komati Reddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకపుట్టిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మంగళవారం తన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక త్వరలోనే మునుగోడుకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వ్యవహారంపై ఫైర్ అవుతున్నారు. ఇటు బీజేపీతో పాటు అటు కోమటి రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చాయని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లి గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. చికోటీ కేసులో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. బీజేపీ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ బ్లాక్ మెయిల్ లో ఉందని విమర్శించారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుందని అన్నారు.
Read Also: Thummala Nageswara Rao: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమే అని..నష్టమే అని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ తన అస్తిత్వం కాపడుకునే పనిలో పడ్డారని అన్నారు. ఈటెల తన సహజగుణం కోల్పోయారని అద్దంకి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ నేతలే దిక్కయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోడీ మొహమే నెగిటివ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు వ్యాపార బానిసలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటెల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీకి, టీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారని.. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని.. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ విమర్శించారు. సోనియా గాంధీ నియమించిన వ్యక్తే కదా.. రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు.