Site icon NTV Telugu

Cab Charges: ఇంధన ధరల ఎఫెక్ట్.. క్యాబ్‌లలో ఏసీలు బంద్

హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సల్లావుద్దీన్ వెల్లడించారు.

వేసవి కారణంగా ఒకవేళ ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని షేక్ సల్లావుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఏసీతో క్యాబ్‌లను నడపడం సాధ్యం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓలా, ఉబర్ కంపెనీలు సైతం కమీషన్ రేట్లు పెంచడం లేదని.. అందుకే క్యాబ్‌లలో ఏసీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏసీ ఆన్ చేస్తే క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం చొరవ తీసుకొని కనీస ధరలను నిర్ణయించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సల్లావుద్దీన్ కోరుతున్నారు.

https://ntvtelugu.com/trade-unions-call-for-bharat-bandh-on-march-28-and-29th/
Exit mobile version