Hash Oil : ఈగల్ ఫోర్స్ , అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పక్కా ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.5 లక్షల విలువైన 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నివాసముంటూ జీవనోపాధి కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, చెడు వ్యసనాలకు బానిసైన అతడు గతంలోనే గంజాయి విక్రయిస్తూ సరూర్‌నగర్, మీర్‌పేట్ పోలీసు స్టేషన్లలో పలు ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గత నవంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం చాలకపోవడంతో మళ్లీ డ్రగ్స్ దందా వైపు మళ్లాడు.
స్నాప్‌చాట్ ద్వారా నెట్‌వర్క్.. కోరాపుట్ నుంచి అక్రమ రవాణా
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నరేంద్ర శ్రీనివాస్ స్నాప్‌చాట్ యాప్‌ను వేదికగా చేసుకున్నాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువాకు చెందిన ‘హరి’ అనే సరఫరాదారుడితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెంచుకుని, అక్కడ రూ. 9,000కు కొనుగోలు చేసిన హ్యాష్ ఆయిల్‌ను హైదరాబాద్‌లో 10 మిల్లీలీటర్లను రూ. 1,200 చొప్పున విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఒడిశా వెళ్లిన అతడు, అక్కడి నుంచి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఆగస్టు 7న బస్సులో బయలుదేరాడు. అరెస్టు కాకుండా ఉండేందుకు ముందుగా టికెట్లు బుక్ చేసుకోకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించే పద్ధతిని ఎంచుకున్నాడు.
ORR వద్ద పట్టుకున్న పోలీసులు..
విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఒడిశా నుంచి వచ్చిన బస్సు దిగగానే నరేంద్ర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రెండు బాటిళ్లలో ఉన్న హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.

