NTV Telugu Site icon

Akunuri Murali: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. సిద్ధమైన రిటైర్డ్‌ ఐఏఎస్‌..

Akunuri Murali

Akunuri Murali

తెలంగాణలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు కొదవలేదు.. మరో కొత్త పార్టీ తెలంగాణ గడ్డపై పురుడుపోసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఇప్పటికే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌కు దీటుగా జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు ఉండగా.. బీఎస్పీ నేను సైతం అంటోంది.. ఇక, కమ్యూనిస్టులు (సీపీఐ, సీపీఎం) మేం గెలిచే పరిస్థితి లేకపోయినా.. గెలిపించగలం.. నంచకపోతే ఓడించగలం అనే సందేశాన్ని మొన్న మునుగోడు ఉప ఎన్నికతో రుజువు చేశారు. మరోవైపు వైఎస్‌ షర్మిల పార్టీ.. ప్రొఫెసర్‌ కోదండరాం పార్టీ.. అంతెందుకు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ.. ఇలా లిస్ట్‌ పెద్దగానే ఉంది.. అయితే, త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని అంటున్నారు రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోఇవాళ మీడియాతో మాట్లాడిన ఆకునూరి మురళి.. తెలంగాణలో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు డబ్బులకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఆదర్శరాజకీయాలను మళ్లీ తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషిచేస్తా… త్వరలోనే నూతన రాజకీయ పార్టీని పెడతానంటూ వెల్లడించారు.

Read Also: Koti Deepotsavam 2022: 11వ రోజుకు చేరిన కోటిదీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ ఓటర్లకు డబ్బులు పంచాయి.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయని పేర్కొన్న ఆయన.. దీనిని పరిగణనలోనికి తీసుకుని ఎన్నికను రద్దు చేయాలని కోరారు.. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. ఇలాంటి పనులను ఇకనైనా కట్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ ముగిసన తర్వాత ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన సమయంలో.. ఈ రిటైర్డ్‌ ఐఏఎస్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్‌ టాపిక్‌గా కాగా.. ఇప్పుడు కొత్త పార్టీనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరి, ఆయన కొత్త పార్టీ ఎప్పుడు పెడతారు? దాని పేరు ఏంటి? ఆ పార్టీ విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి..? లాంటి విషయాలు త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి.

ఇక, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఆకునూరి మురళి విధులు నిర్వహించారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం.. అత్యంత అప్రాధాన్యమైన స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడి పోస్ట్‌కు బదిలీ చేసిందంటూ.. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.. ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన.. దళితుడైన తనకు అంతంగా ప్రాధన్యత లేని శాఖను కేటాయించడంపై సైతం ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తీవ్రమై ఒత్తిడికి గురైన ఆకునూరి మురళి తన పదవీ కాలం ఉండగానే.. వాలంటరీ రిటైర్డ్‌మెంట్ ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించారు.. అయితే, రిటైర్డ్ అయిన రెండు వారాలకే ఏపీలోని వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఆకునూరి మురళికి.. అత్యంత కీలకమైన పదవి కట్టబెట్టిన విషయం విదితమే.

Show comments