కేవలం హోం వర్క్ చేయలేదనే ఒకేఒక్క కారణంతో టీచర్ వేసిన శిక్షకు ఆచిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో చోటుచేసుకున్న ఈఘటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు 7ఏండ్లు. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్ కోప్పడింది. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టారు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడపై మోయించినట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది.
అంతేకాకుండా చిన్నారి తలపై స్కేల్‌తో కొట్టారు. ఆ తర్వాత ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో గాయపడిన ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా, తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఫాతిమా నిన్న మృతిచెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
వారు మాట్లాడుతూ.. బాధిత బాలిక గత రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫాతిమాను కొట్టిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్, నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. చిన్నారి ఫాతిమా మృతి చెందిన వార్త తెలుసుకున్న విద్యా సంస్థ పాఠశాలను మూసివేసింది. ఇక నిజామాబాద్ మండల విద్యాధికారి రామారావు పాఠశాల వద్దకు వచ్చి పరిశీలించారు. అయితే.. ఫాతిమా చదువుతున్న పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన ఓ లెక్చరర్‌కు చెందినదిగా తెలుస్తోంది. చిన్నారిపై కర్కషంగా వ్యవహరించిన టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. స్కూల్ను మూసేయాలని డీఈవో ఆదేశించారు.
Asia Cup: ముగిసిన భారత్ కథ.. ఫైనల్ ఆశలు గల్లంతు
