యూట్యూబ్‌లో ఆసక్తికరమైన థంబ్‌నెయిల్ కనిపిస్తే చాలు.. అందులో ముఖ్యమైన సమాచారం ఉంటుందేమోనని యూజర్లు వెంటనే వాటిని ‘క్లిక్’మనిపిస్తారు. తీరా ఓపెన్ చేశాక, ‘సోది ఎక్కువ మేటర్ తక్కువ’ అన్నట్టుగా ఆ వీడియోలు సాగుతాయి. ఎక్కడ రెండు ముక్కల్లో ఉండే అసలు మేటర్ కోసం, మిగతా సోదిని భరించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. అదే.. ‘మోస్ట్ రీప్లేడ్’!
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వీడియోలో యూజర్లు ఎక్కువ భాగం ఏది చూశారో, దాన్ని మాత్రమే చూపిస్తుంది. దీంతో.. యూజర్లు మొత్తం వీడియో చూడకుండానే, ఎక్కువగా యూజర్లు చూసిన మెయిన్ కంటెంట్ వద్దకు నేరుగా వెళ్ళిపోవచ్చు. దీని వల్ల యూజర్ల సమయంతో పాటు డేటా కూడా ఆదా అవుతుంది. ఇప్పటివరకూ ఈ సౌకర్యం ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడిది సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. యూజర్లకు వీడియోలోని మోస్ట్ రీప్లేడ్ పార్ట్ తెలిసేలా.. వీడియో పక్కన ప్రొగ్రెసివ్ బార్ గ్రాఫ్ ఉంటుంది. దాంతో, యూజర్లు వీడియోలో మోస్ట్ రీప్లేడ్ కంటెంట్‌ను చూడొచ్చు. ఇది డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.
కేవలం ఈ ఒక్క ఫీచరే కాదు, మరికొన్ని అప్డేట్స్‌తో పాటు ఫీచర్స్‌ని యూట్యూబ్ తీసుకొస్తోంది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, ఆల్రెడీ ఉన్న మరికొన్నింటిని అన్ని డివైజ్‌లకు అందుబాటులోకి తెస్తోంది. వీడియోల్ని సబ్-సెక్షన్స్‌గా విభజించేందుకు.. 2020 మే నెలలో ‘వీడియోస్ చాప్టర్’ ఫీచర్‌ని యూట్యూబ్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వీడియోలోని తమకు నచ్చిన పార్ట్‌ను ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఇది డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ డివైజ్‌లకే పరిమితం కాగా.. ఇప్పుడు స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, చూసిన వీడియోని మళ్ళీ చూసేందుకు తీసుకొచ్చిన ‘సింగిల్ లూప్’ ఫీచర్ ఇకపై మెనూలో ఉంటుంది.