Site icon NTV Telugu

WhatsApp Alert: ఈ యాప్ వద్దురామ.. వినరా మామ!

Whatsapp Malware

Whatsapp Malware

జనాలని బురిడీ కొట్టించి, డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటుందే, దాన్నే ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు వీరి కన్ను ‘వాట్సాప్’పై పడింది. ఈ మెసేజింగ్ యాప్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే! దీన్నే ఆసరాగా చేసుకొని.. వాట్సాప్‌ని పోలి ఉండే నకిలీ యాప్స్ తయారు చేస్తూ, మోసాలకు తెగిస్తున్నారు. గతంలోనూ ఈ పన్నాగాలు పన్నారు. ఇప్పుడు మళ్లీ సరికొత్ పంథాని అనుసరిస్తున్నారు.

‘హే మోడ్స్’ అనే ఓ డెవలపింగ్ సంస్థ ‘హే వాట్సాప్’ సహా మరికొన్ని మాల్‌వేర్స్‌ని సిద్ధం చేసింది. ఇవి వాట్సాప్ మోడిఫైడ్ వర్షన్స్‌లా ఉంటాయి. ఫేక్ యాప్స్ అన్న భావన కలిగించవు. కానీ.. ఇవి ముమ్మాటికీ ఫేక్ యాప్స్ అని అధికార వాట్సాప్ సంస్థ తేల్చింది. ఇవి చాలా ప్రమాదకరమైనవని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ట్విటర్ మాధ్యమంగా వివరించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోవద్దని, డౌన్‌లోడ్ చేసుకున్న వారి స్మార్ట్‌ఫోన్లలో నుంచి కీలక సమాచారాన్ని చోరీ చేసిన సంగతిని తాము గుర్తించామని ఆయనన్నారు. కాంటాక్ట్స్ జాబితాతో పాటు ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని సైతం సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ యాప్స్ ద్వారా కొట్టేస్తున్నారని స్పష్టం చేశారు.

ఈ యాప్స్ అచ్చం వాట్సాప్ ఫీచర్లనే కలిగి ఉంటాయని, అయితే ఇది వాట్సాప్ ప్లేస్టోర్‌లో ఉండదని, ఇతర సోర్స్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేస్తే మాత్రం నట్టేట ముగినిగిపోతారని క్యాత్‌కార్ట్ తెలిపారు. ఈ నకిలీ యాప్స్‌లో ఎండ్ టు ఎండ ఎన్‌క్రిప్షన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవని, కేవలం ఒరిజినల్ వర్షన్‌లోనే లభిస్తుందని పేర్కొన్నారు. ఎండ్ టు ఎండ ఎన్‌క్రిప్షన్ ఉండటం ద్వారా ఇద్దరు వ్యక్తులు చేసుకునే వాట్సాప్ సంభాషణ మరో వ్యక్తికి కనిపించదన్నారు. కాబట్టి.. నకిలీ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించాడు.

Exit mobile version