Vivo Y600: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ సామర్థ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ బ్రాండ్ వివో సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Vivo Y600 పేరుతో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, బ్యాటరీ పనితీరుకు సంబంధించి ఈ ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నట్లు వివో వెల్లడించింది. ఈ ఫోన్‌ను 2026 అక్టోబర్ 30న చైనాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
వివో చైనాకు చెందిన అధికారిక వీబో ఖాతాలో వెల్లడించిన వివరాల ప్రకారం, Vivo Y600 అక్టోబర్ 30న చైనా మార్కెట్లో అడుగుపెట్టనుంది. కంపెనీ షేర్ చేసిన చిత్రాల్లో ఈ ఫోన్ వైట్, పర్పుల్ రంగుల్లో కనిపించింది. ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ఫ్లాట్ సైడ్స్‌తో పాటు కొద్దిగా పైకి ఉబ్బిన కెమెరా మాడ్యూల్‌ను అందించినట్లు తెలుస్తోంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌ను అందించనున్నట్లు సమాచారం.
Vivo Y600లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దాని భారీ బ్యాటరీ. ఇందులో 10,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వివో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ బ్యాటరీ పనితీరును పరీక్షించేందుకు ప్రత్యేక లైవ్‌స్ట్రీమింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఫోన్ ఏకంగా 32 గంటల 37 నిమిషాల పాటు పనిచేసినట్లు పేర్కొంది. ఈ బ్యాటరీ పనితీరుతో Vivo Y600 గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు కంపెనీ వెల్లడించింది.
Vivo Y600 డిజైన్ ఇటీవల మలేషియా మార్కెట్లో పరిచయం చేసిన Vivo V80 Liteను పోలి ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉండే గోల్డ్ రింగ్ వంటి చిన్న మార్పులను పక్కన పెడితే, రెండు ఫోన్ల డిజైన్ల మధ్య పోలికలు కనిపిస్తున్నాయి. దీంతో Vivo Y600, Vivo V80 Liteకు రీబ్రాండెడ్ వెర్షన్ అయి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

