Vivo T6x 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివో (Vivo) మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Vivo T5x 5Gకి సక్సెసర్‌గా Vivo T6x 5G త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ భారత ప్రభుత్వ BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించినట్లు సమాచారం. దీంతో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలపై టెక్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Vivo T6x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ టిప్‌స్టర్ Anvin సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్‌లో గుర్తించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ V2652గా ఉన్నట్లు సమాచారం. ఇదే మోడల్ నంబర్‌తో గతంలో Bluetooth SIG సర్టిఫికేషన్‌లో కూడా ఈ ఫోన్ కనిపించినట్లు తెలుస్తోంది. సాధారణంగా BIS సర్టిఫికేషన్‌లో కనిపించడం భారత మార్కెట్లో లాంచ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయనే సంకేతంగా భావించవచ్చు. అయితే వివో సంస్థ నుంచి అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడికాలేదు.
Vivo T6x 5Gకు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించవచ్చని అంచనా. ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు AI కెమెరా ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని సమాచారం.

