DoT SIM Misuse Warning: సిమ్ కార్డు పొందడానికి ఎక్కడైనా గుర్తింపు కార్డు ఇచ్చారంటే, ఆ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు తీసి వాడుతున్నారో, ఆ సిమ్ కార్డులను ఎవరు వినియోగిస్తున్నారో, దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, మీ పేరు మీద జారీ చేయబడిన SIM కార్డు దుర్వినియోగం అయితే, మీరు చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుందని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) స్పష్టంగా హెచ్చరించింది.
Read Also: I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మొబైల్ నంబర్ల దుర్వినియోగం నేపథ్యంలో DoT మొబైల్ వినియోగదారులకు ఈ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. వినియోగదారుడి పేరు మీద జారీ చేసిన SIM కార్డు ద్వారా సైబర్ మోసం లేదా ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపం జరిగితే, అసలు కస్టమర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని తెలిపింది. సిమ్ కార్డు పొందేటప్పుడు లేదా యాక్టివ్ సిమ్‌ను వేరొకరికి బదిలీ చేసినప్పుడు నకిలీ పత్రాలు ఉపయోగించడం టెలికాం నిబంధనల తీవ్ర ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఈ తరహా సందర్భాల్లో, మోసం జరిగినట్టు నిర్ధారించినప్పుడు సిమ్ తీసుకున్న వ్యక్తి కూడా దర్యాప్తు పరిధిలోకి వస్తారు.
IMEI మార్పులపై కఠిన చర్యలు..!
IMEI నంబర్‌ను ట్యాంపర్ చేయడం, మార్చడం లేదా అలాంటి పరికరం ఉపయోగించడం.. టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం శిక్షార్హమైన నేరం. అలాంటి నేరాలకు.. 3 సంవత్సరాల జైలుశిక్ష.. రూ.50 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉందని DoT తెలిపింది.
కాల్ ఐడీ మార్చే యాప్‌లు కూడా నేరం..
ఆన్‌లైన్‌లో కాలర్ ఐడి (CLI) మార్చే యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించడం కూడా చట్టవిరుద్ధమే అని శాఖ హెచ్చరించింది. అలా చేస్తే వినియోగదారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. DoT వినియోగదారులను తమ మొబైల్ పరికరాల IMEI నంబర్‌ను ధృవీకరించడానికి మరియు తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డుల లిస్టును చెక్ చేయడానికి Sanchaar Saathi Portal ఉపయోగించాలని సూచించింది.
ఈ పోర్టల్ ద్వారా:
అయితే, మీ పేరుతో ఉన్న అన్ని మొబైల్ నంబర్లు చెక్ చేయవచ్చు.. దొంగిలించిన ఫోన్‌లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.. అనధికార సిమ్‌లను బ్లాక్ చేయవచ్చు అని సూచించింది.. భారతదేశంలో సురక్షితమైన, పారదర్శకమైన మరియు నమ్మదగిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించడం మా లక్ష్యం అని డాట్ పేర్కొంది.. మీ ఐడీ ప్రూఫ్‌ను ఎవరితోనూ పంచుకోకండి.. మీ పేరు మీద ఎవరైనా సిమ్ తీసుకుంటే అంగీకరించకండి.. Sanchaar Saathi ద్వారా సిమ్‌లు వెంటనే ధృవీకరించండి.. అనుమానాస్పద కాల్స్, OTP, లింక్‌లకు స్పందించకండి అని డాట్ సూచించింది..
