Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్‌సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..

Telegram

Telegram

Telegram: సెక్యూర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ యూజర్లకు ఆ సంస్థ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో టెలిగ్రామ్‌ యూజర్లకు ఉచితంగా వెబ్‌సైట్ సదుపాయం అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం .gram డొమైన్‌ కోసం టెలిగ్రామ్ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్‌కు అనుమతి లభిస్తే.. టెలిగ్రామ్ యూజర్లు తమ యూజర్‌నేమ్‌తో ప్రత్యేక వెబ్ అడ్రస్‌ పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. టెలిగ్రామ్‌లో మీ యూజర్‌నేమ్ @rahul అయితే భవిష్యత్తులో rahul.gram అనే వెబ్ అడ్రస్‌ను ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. .gram డొమైన్‌ను ఉపయోగించాలంటే సంబంధిత అనుమతులు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది.

.gram డొమైన్ అంటే

సాధారణంగా వెబ్‌సైట్ అడ్రస్‌లలో చివరన కనిపించే .com, .in, .org వంటి వాటిని టాప్-లెవల్ డొమైన్లుగా పిలుస్తారు. అదే తరహాలో .gram కూడా భవిష్యత్తులో కొత్త టాప్-లెవల్ డొమైన్‌గా మారే అవకాశం ఉంది. టెలిగ్రామ్‌ దరఖాస్తుకు అనుమతి లభించిన తర్వాతే దీనిని అధికారికంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. .gram డొమైన్‌ అందుబాటులోకి వస్తే టెలిగ్రామ్‌లోని దాదాపు ఒక బిలియన్ యూజర్లు తమ యూజర్‌నేమ్‌కు అనుగుణంగా సెకండ్‌-లెవల్ డొమైన్‌ పొందే అవకాశం ఉంటుందని పావెల్ దురోవ్‌ వెల్లడించారు. అంటే టెలిగ్రామ్ యూజర్‌నేమ్‌, ఇంటర్నెట్‌లో వ్యక్తిగత గుర్తింపు మధ్య దూరాన్ని తగ్గించాలన్నది కంపెనీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక ఈ సర్వీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక ప్రాంప్ట్‌ ఇచ్చినప్పుడే వెబ్‌సైట్‌ను రూపొందించుకునే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో టెలిగ్రామ్‌ ఉన్నట్లు సమాచారం. సాధారణంగా వెబ్‌సైట్‌ రూపొందించిన తర్వాత హోస్టింగ్‌, డొమైన్‌ కోసం అదనపు ఖర్చులు ఉంటాయి. అయితే టెలిగ్రామ్‌ ప్రతిపాదిస్తున్న సర్వీస్‌ ఉచితంగా ఉండొచ్చని తెలుస్తోంది.

చాటింగ్‌ యాప్‌ నుంచి వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ దిశగా..

టెలిగ్రామ్‌ ఇప్పటికే కేవలం మెసేజింగ్‌ యాప్‌గా కాకుండా మరిన్ని సేవలను అందించే ప్లాట్‌ఫామ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. బ్రౌజర్‌, మినీ యాప్‌ స్టోర్‌, బాట్స్‌, ఛానల్స్‌, మినీ యాప్స్‌ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్‌నేమ్‌లను నేరుగా వెబ్ లింక్‌లుగా ఉపయోగించే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో .gram డొమైన్‌ ప్రతిపాదన టెలిగ్రామ్‌ వ్యూహంలో మరో కీలక అడుగుగా కనిపిస్తోంది. అయితే ICANN నుంచి .gram దరఖాస్తుకు అనుమతి రావాల్సి ఉంది. ఆమోదం లభించిన తర్వాతే టెలిగ్రామ్ యూజర్లకు ఈ ఉచిత వెబ్‌సైట్‌ సదుపాయం ఎప్పుడు, ఎలా అందుబాటులోకి వస్తుందనేది స్పష్టమవుతుంది.