కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!

  • 6.39 మి.మీ. స్లిమ్ డిజైన్‌తో TECNO CAMON Slim 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..
  • 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే..
  • పనితీరు కోసం MediaTek Dimensity 7300e 5G చిప్‌సెట్‌
  • వెనుక 50MP Sony LYTIA 700C ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా..
  • 6500mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఫోన్‌కు IP68, IP69, IP69K వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్..
Tecno Camon Slim 5g

Tecno Camon Slim 5g

TECNO CAMON Slim 5G: టెక్నో (TECNO) నుండి కామోన్ (CAMON) సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయ్యింది. టెక్నో కామోన్ స్లిమ్ 5G (TECNO CAMON Slim 5G) పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ ప్రధానంగా స్లిమ్ డిజైన్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు, AI టూల్స్, మన్నికైన బాడీతో ఆకట్టుకుంటోంది. కేవలం 6.39 మిల్లీమీటర్ల మందం ఉన్నప్పటికీ ఇందులో భారీ కెపాసిటీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్‌ ప్రత్యేకత.

స్లిమ్ డిజైన్:

ఈ కొత్త మొబైల్ కేవలం 6.39mm మందంతో రూపొందించారు. CAMON 50 సిరీస్ డిజైన్‌ లాంగ్వేజ్‌ను ఆధారంగా చేసుకున్న కాంటూర్డ్ ఛాసిస్‌ను ఇందులో ఉపయోగించారు. సన్నని బాడీ ఉన్నప్పటికీ 6500mAh బ్యాటరీని అందించారు. ఫోన్ వెనుక భాగంలో బర్గుండీ రెడ్, నియో మాండ్రియన్, మాటిస్ బ్లాక్, వాన్ గోగ్ బ్లూ, రెబెల్ పింక్ వంటి ఐదు వివిధ ఫినిషింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ‘నియో మాండ్రియన్’ వేరియంట్‌లో ఫోటోక్రోమిక్ టెక్నాలజీ ఉండటంతో UV కాంతి పడినప్పుడు వెనుక ప్యానెల్‌పై జ్యామితీయ రంగుల బ్లాక్స్ కనిపిస్తాయి. ‘వాన్ గోగ్ బ్లూ’ వేరియంట్‌లో ‘The Starry Night’ పెయింటింగ్‌ను పోలిన డిజైన్‌ను అందించారు.

IP69K రేటింగ్‌:

మన్నిక విషయంలో కూడా CAMON Slim 5Gపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K వంటి వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అధిక పీడన నీటిని కూడా తట్టుకునే సామర్థ్యంతో పాటు నీటిలో ఫొటోగ్రఫీకి కూడా ఇది ఉపయోగపడేలా రూపొందించారు. అంతేకాకుండా MIL-STD-810 మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది.

AMOLED డిస్‌ప్లే:

ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2644 × 1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 2304Hz PWM డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వర్షంలో లేదా చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా టచ్ సరిగ్గా పనిచేసేలా వెట్ అండ్ ఆయిలీ హ్యాండ్ టచ్ రెకగ్నిషన్ 2.0 టెక్నాలజీని అందించారు. TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది.

ప్రాసెసర్:

మొబైల్ పనితీరు కోసం MediaTek Dimensity 7300e 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్‌పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గరిష్ఠంగా 2.6GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G610 MC2 GPU ఉంది. ఈ ఫోన్ 8GB RAMతో పాటు 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16తో ఫోన్ పనిచేస్తుంది. టెక్నో మూడు ప్రధాన OS అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనుంది. 60 నెలల సిస్టమ్ ఫ్లూయిడిటీకి సంబంధించి TÜV SÜD సర్టిఫికేషన్ కూడా ఉంది.

సోనీ కెమెరా & బ్యాటరీ:

ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP సోనీ LYTIA 700C ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో 1/1.56 అంగుళాల సెన్సార్ ఉంది. దీనికి తోడు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ప్రధాన కెమెరాలో OIS, EIS, AI షట్టర్ కలిపిన ట్రిపుల్ స్టెబిలైజేషన్ వ్యవస్థ ఉంది. సూపర్-జూమ్ ఫ్లాష్ స్నాప్ ఫీచర్ ద్వారా కదులుతున్న సబ్జెక్టులను వేగంగా క్యాప్చర్ చేయవచ్చు. మల్టీ-ఫోకల్ పోర్ట్రైట్ ద్వారా 24mm, 35mm, 50mm ఫోకల్ లెంగ్త్‌లలో పోర్ట్రెయిట్ ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ టోన్ అనే AI టెక్నాలజీ వివిధ లైటింగ్ పరిస్థితుల్లో స్కిన్ టోన్‌ను మరింత సహజంగా చూపించేందుకు ఉపయోగపడుతుంది.

బ్యాటరీ విషయంలో CAMON Slim 5Gలో 6500mAh బ్యాటరీ ఉంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇంత సన్నని 6.39mm బాడీలో ఇంత పెద్ద బ్యాటరీని అందించడం ఫోన్‌లోని ప్రధాన ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇక స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, హై-రేస్ ఆడియో, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్, NFC, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

AI ఫీచర్స్:

TECNO CAMON Slim 5Gలో అనేక AI ఆధారిత ఫీచర్లను కూడా అందించారు. AI స్నాప్ పోస్టర్ ద్వారా ప్రొడక్ట్ ఫొటోల నుంచి బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించి కమర్షియల్ పోస్టర్లను రూపొందించుకోవచ్చు. AI పెట్ టుగెథర్ ద్వారా యూజర్, పెట్ ఫొటోలను ఒకే చిత్రంగా కలపవచ్చు. AI లైట్ మాస్టర్ 2.0 ద్వారా లెన్స్ ఫ్లేర్, హార్ష్ షాడోస్, విండో రిఫ్లెక్షన్స్ వంటి వాటిని ఫొటో నుంచి తొలగించవచ్చు. AI రికార్డింగ్ నోట్స్ ఆడియోను టెక్స్ట్‌గా మార్చడంతో పాటు వైట్‌బోర్డ్ స్లైడ్స్‌ను టైమ్‌స్టాంప్‌లతో అనుసంధానిస్తుంది. AI క్లాస్ షెడ్యూల్ రాసిన టైమ్‌టేబుల్‌ను గుర్తించి హోమ్ స్క్రీన్‌లో షెడ్యూల్‌గా చూపిస్తుంది. AI హెల్తి ఈటింగ్ ద్వారా ఆహారాన్ని స్కాన్ చేసి దాని పోషక విలువలు, క్యాలరీలను అంచనా వేయవచ్చు.

వీటితోపాటు “మాగ్ బ్యాడ్జి” అనే మాగ్నెటిక్ యాక్సెసరీని కూడా పరిచయం చేసింది. ఇందులో 1.73 అంగుళాల AMOLED డిస్‌ప్లే, అంతర్గత బ్యాటరీ ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసి 10 మీటర్ల వరకు రిమోట్ షట్టర్‌గా ఉపయోగించవచ్చు. సెల్ఫీలకు లైవ్ ప్రివ్యూ స్క్రీన్‌గా లేదా డిజిటల్ బ్యాడ్జ్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ధర:

ఈ మొబైల్ ను వివిధ ప్రాంతాల్లో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ధర, ఖచ్చితమైన లాంచ్ తేదీ, మార్కెట్ వారీగా లభించే వేరియంట్ల వివరాలను ఆయా మార్కెట్లకు అనుగుణంగా ప్రకటించాల్సి ఉంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫోన్ కొనుగోలుతో మూడు నెలల గూగుల్ AI ప్లస్ ట్రయల్, 2TB క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందించనున్నారు.