NTV Telugu Site icon

Special Story on Jio Super Success Journey: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా జియో సాగించిన సూపర్‌ సక్సెస్ జర్నీపై స్పెషల్‌ స్టోరీ

Special Story On Jio Super Success Journey

Special Story On Jio Super Success Journey

Special Story on Jio Super Success Journey: ప్రస్తుతం మన దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్‌ జియో అనే సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు ‘జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆపర్చునిటీ’. ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది. లాంఛ్‌ అయిన రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌గా ఎదిగింది. రిలయెన్స్‌ జియోని ప్రారంభించాలనే ముఖేష్‌ అంబానీ ఆలోచనకు మూలకారణం ఆయన కూతురు ఇషా అంబానీ. కాలేజీ అసైన్‌మెంట్‌ సబ్మిట్‌ చేసే సమయంలో డేటా స్లోగా ఉండటం వల్ల ఇబ్బందిపడటాన్ని ఆమె తన తండ్రితో చెప్పారు. అప్పుడు ఇండియాలో మరింత డిజిటలైజేషన్‌ ఆవశ్యకతను గుర్తించి ఈ రంగంలో అడుగుపెట్టారు.

తమ్ముడిపై అన్న పైచేయి

2015లో అంబానీ సోదరుల మధ్య తలెత్తిన వివాదాల వల్ల ఆర్‌-కామ్‌ని టేకప్‌ చేయాలని ముఖేష్‌ అంబానీ నిర్ణయించుకున్నారు. 2010లో తన సోదరుడు అనిల్‌ అంబానీపైన నాన్‌ కంపీటింగ్‌ క్లాజ్‌ దాఖలుచేసి రిలయెన్స్‌ జియోని మొదలుపెట్టారు. ప్రారంభించిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కనెక్షన్లతో రిలయెన్స్‌ జియో ఇండియాలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది. సహజంగా టెలికం సంస్థలకి 60 శాతం నుంచి 70 శాతం వరకు ఆదాయం వాయిస్‌ కాల్స్‌ ద్వారానే వస్తుంది. అప్పట్లో టెలికం సంస్థలు డేటా సర్వీస్‌ అందించేందుకు ఎక్కువ ఛార్జీ వసూలు చేసేవి. 2జీ, 3జీ నుంచి అప్‌గ్రేడ్‌ అవటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడేవి. ముఖేష్‌ అంబానీ మాత్రం ముందుచూపుతో ఒకేసారి రెండున్నర లక్షల కోట్ల రూపాయలను 4జీ నెట్‌వర్క్‌లో పెట్టుబడి పెట్టారు.

NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August

ఉపయోగపడిన ‘ఉచిత’ పథకం

ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌లతో పోల్చితే దేశవ్యాప్తంగా 22 జోన్లలో 4జీ స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తెచ్చిన టెలికం సంస్థ రిలయెన్స్‌ జియో మాత్రమే కావటం విశేషం. మిగతా టెలికం సంస్థలు 2జీ, 3జీలోనే ప్రధాన పెట్టుబడులు పెట్టగా రిలయెన్స్‌ జియో మాత్రం 4జీ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. ఈ టెక్నాలజీ స్పీడు అప్పట్లో ఉన్న వేగంతో పోల్చితే 10 రెట్లు ఎక్కువ (అంటే 40 టెరా బైట్స్‌ పర్‌ సెకన్‌) ఉండేది. జియో.. లాస్‌ లీడింగ్‌ స్ట్రాటజీని ఫాలో అయింది. అంటే ఒక వస్తువును అసలు ధర కంటే తగ్గించి అమ్మాలనే మార్కెటింగ్‌ వ్యూహాన్ని అమలుచేసింది. ఒక ఆధార్‌ కార్డ్‌తో ఏకంగా ఎనిమిది సిమ్‌ కార్డులను ఉచితంగా ఇవ్వటం లాంటి సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టారు. వినియోగదారులను ఆకట్టుకోవటానికి సిమ్‌ కార్డులతోపాటు కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, రోమింగ్‌ కూడా ఫ్రీగా ఇచ్చారు.

ఫలించిన లాస్‌ లీడింగ్‌ వ్యూహం

అప్పట్లో ఒక సిమ్‌ కార్డ్‌ యాక్టివేట్‌ అవ్వాలంటే 24 గంటలు పట్టేది. కానీ జియో సిమ్‌ కార్డులు మాత్రం డిజిటల్‌ సంతకం తీసుకున్న 15 నిమిషాల్లోనే యాక్టివేట్‌ అయ్యేలా చేశారు. దాదాపు అన్ని సర్వీసులనూ ఉచితంగానే ఇవ్వటంతో ఈ సంస్థ మొదటి 15 నెలలు నష్టాల్లోనే నడిచింది. కానీ ఈ లాస్‌ లీడింగ్‌ స్ట్రాటజీతోనే తర్వాత కాలంలో 504 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. అయితే.. అన్ని సర్వీసులనూ ఉచితంగా ఇవ్వటం ద్వారా జియో.. టెలికం రంగంపై గుత్తాధిపత్యం (మోనోపలీ) చెలాయిస్తోందంటూ మిగతా నెట్‌వర్క్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి కంప్లైంట్‌ చేశాయి. ఈ ఆటంకాన్ని కూడా రిలయెన్స్‌ జియో విజయవంతంగా అధిగమించింది.

‘కస్టమర్‌ ఫస్ట్‌’ పాలసీ

మామూలుగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు బ్రేక్‌ ఈవెన్‌ అనాలసిస్‌ చేస్తుంటారు. జియో మాత్రం వినియోగదారుల అవసరాలకు, ఆలోచనా విధానాలకు అనుగుణంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కస్టమర్‌ లాయల్టీ అనేది ఉండేది. సిగ్నల్‌ రాని పరిస్థితుల్లో కూడా మొబైల్‌ నంబర్‌ మార్చాలంటే ఆలోచన చేసేవారు. ఎందుకంటే బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ కార్డులు వంటి ఎన్నో సర్వీసులకు అది లింకై ఉండటం వల్ల వెనకాడేవారు. కానీ టెలికం రెగ్యులేటరీ అథారిటీ నంబర్‌ పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకురావటంతో ఎక్కువ మంది పాత నంబర్లతోనే జియో సర్వీస్‌ వైపు మొగ్గుచూపారు. దీంతో 2021 చివరి నాటికి జియో యూజర్ల సంఖ్య అనూహ్యంగా 41 కోట్ల 50 లక్షలకు పెరిగింది. టెలికం మార్కెట్‌లో ఈ సంస్థ వాటా 2021 జనవరి 31 నాటికి 35.45 శాతానికి చేరింది.

లీడర్‌గా.. అవార్డుల విన్నర్‌గా..

నెట్‌వర్క్‌లు అందుబాటులోలేని, సరిగా పనిచేయని టయర్‌-2, టయర్‌-3 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మొబైల్‌ నెట్‌వర్క్‌ల్లో లీడర్‌ అయింది. రానున్న రోజుల్లో మరో 41 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు పెరుగుతారని అంచనా వేస్తోంది. 5జీ స్పెక్ట్రంలోకి ఇండియా చేరటానికి ఇటీవల జరిగిన వేలంలో జియో 88,078 కోట్ల రూపాయలతో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. 2021-22లో అన్ని జియో ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం 10 బిలియన్‌ డాలర్లు దాటినట్లు యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. డేటా ట్రాఫిక్‌ ఏటా 46 శాతం పెరుగుతుండటంతో రిలయెన్స్‌ జియోవాళ్లు దానికి తగ్గట్లుగా 2021-22లో 91 బిలియన్‌ జీబీలకు పెంచారు. ఫలితంగా ఓపెన్‌ సిగ్నల్‌ అనే సంస్థ నుంచి బెస్ట్‌ వీడియో ఎక్స్‌పీరియెన్స్‌ అవార్డ్‌ సాధించింది. ట్రాయ్‌ రూపొందించిన మై స్పీడ్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

ప్రశంసలు.. పార్ట్నర్‌షిప్‌లు..

ఇండియాలో డేటా రేట్లు దిగిరావటంలో రిలయెన్స్‌ జియో చేసిన ప్రయత్నాలను నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో ప్రశంసించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి విజయవంతంగా నడుస్తోందంటే దానికి ప్రధాన కారణం జియో డేటాయేనని ఆయన చెప్పారు. జియో తన ప్రయాణంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో మార్ట్‌లో డిజిటల్‌ రీఛార్జ్‌ ఆప్షన్‌ కోసం వాట్సాప్‌తో చేతులు కలిపింది. ఎంటర్‌ప్రైజ్‌, కన్జ్యూమర్‌ సిగ్మెంట్లలో 5జీ అమలు కోసం గూగుల్‌తో కూడా లాంగ్‌టర్మ్‌ స్ట్రాటజీలో భాగంగా పార్ట్నర్‌ అయింది. 13 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.1,52,056 కోట్ల నిధులు సమీకరించింది. 2017లో జియో తొలి 100 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. జియో ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2018లో 300 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లతో నంబర్‌ వన్‌ నెట్‌వర్క్‌ అనిపించుకుంది.

మరోసారి నంబర్‌ వన్‌గా..

2018లోనే జియో ఫైబర్‌ సర్వీస్‌ను ప్రయోగవంతంగా మొదలుపెట్టింది. 2019లో జియో ఫైబర్‌ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ సర్వీసులన్నింటినీ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ అనే సింగిల్‌ హోల్డింగ్‌ కంపెనీ కిందికి తీసుకొచ్చింది. 2020లో ఫేస్‌బుక్‌, గూగుల్‌కి 34 శాతం వాటాను విక్రయింటం ద్వారా లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా ఫండ్‌ రైజ్‌ చేసింది. 2021లో జియో ఫోన్‌ నెక్‌స్ట్‌ అనే గూగుల్‌ జియో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్‌ చేసింది. 2022లో జియో ఫైబర్‌ 50 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వటం ద్వారా నంబర్‌ వన్‌ ఎఫ్‌టీటీహెచ్‌ (ఫైబర్‌ టు ది హోం) ప్రొవైడర్‌గా ఘనత వహించింది.