Site icon NTV Telugu

Shiv Nadar: శివ్‌ నాడార్‌.. మేటి దాత.. అరుదైన ఘనత..

Shiv Nadar Hcl Tech

Shiv Nadar Hcl Tech

Shiv Nadar: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫౌండర్‌ శివ్‌ నాడార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సగటున రోజుకి 3 కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చి మన దేశంలో అత్యధిక సంపదను పంచిపెట్టినవారి లిస్టులో టాప్‌లో నిలిచారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1,161 కోట్లు డొనేట్‌ చేశారు. తద్వారా తాజాగా విడుదలైన ‘‘ఎడెల్‌గివ్‌ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్‌-2022’’లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. శివ్‌ నాడార్‌ గత మూడేళ్లలో మొత్తం రూ.3,219 కోట్లు ఇచ్చి తన విశాల ఉదార స్వభావాన్ని చాటుకున్నారని ఎడెల్‌గివ్‌ హురున్ ఇండియా రిపోర్ట్‌ వెల్లడించింది.

read also: Indian Market: ఇండియన్‌ మార్కెట్‌.. ఇంపార్టెంట్‌. ఈ మాటన్నది ఏ దేశం?

గత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు) ఇచ్చిన విరాళాలను బట్టి ఈ జాబితాను తయారుచేశారు. హురున్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ సంస్థలు ఇలా దాతల లిస్టును తయారుచేయటం ఇది వరుసగా తొమ్మిదోసారి. కనీసం రూ.5 కోట్లు దానం చేసినవారికే ఇందులో చోటు లభించింది. ఇదిలాఉండగా.. టెక్నాలజీ ఇండస్ట్రీతోపాటు ఫిలాంథ్రపీ రంగంలో శివ్‌ నాడార్‌ అందించిన సేవలకు గాను లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డ్‌-2022 దక్కింది. యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్నర్‌షిప్‌ ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఫోరం.. ద్వైపాక్షిక లాభాపేక్ష లేని సంస్థ.

ఐటీ సర్వీసుల రంగంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థ గత 45 ఏళ్లకు పైగా లీడర్‌లా నిలుస్తోందని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ తెలిపింది. 1976 నుంచి సాంకేతిక విప్లవంలో ముందు వరుసలో ఉంటోందని పేర్కొంది. అవార్డుకు ఎంపికవటంపై శివ్‌ నాడార్‌ స్పందించారు. ఈ పురస్కారం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, వాళ్లు కూడా సొంతగా సంస్థలను ఏర్పాటుచేసి, సర్వీసులను అందించటం ద్వారా డబ్బు సంపాదించి, మళ్లీ సొసైటీకి తిరిగిచ్చేలా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version