NTV Telugu Site icon

Jio Book: Jio Book: జియో నుంచి మరో బాంబ్.. 15 వేలకే ల్యాప్‌టాప్‌

Jio Book Laptop

Jio Book Laptop

Reliance Jio To Launch Jio Book Laptop At Very Low Cost: రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగం ఎలా ఉలిక్కి పడిందో అందరికీ తెలుసు. కొన్ని నెలలపాటు ఉచిత సేవల్ని అందించడంతో.. ఇతర సంస్థలన్నీ వణికిపోయాయి. జియో, ఇతర సంస్థల మధ్య ఒక మినీ యుద్ధమే కొనసాగింది. ఇప్పుడు అదే జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. అతి తక్కువ ధరలోనే ల్యాప్‌టాప్‌ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. దీనికి ‘జియో బుక్’ అనే పేరు ఖరారు చేయనున్నారని, 4జీ ఆధారిత సిమ్‌తో పనిచేసేలా దీన్ని రూపొందిస్తున్నారని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక ఉన్నత ఉద్యోగి తెలిపారు.

ఈ ల్యాప్‌టాప్ తయారీ కోసం.. రిలయన్స్ జియో ఇప్పటికే క్వాల్‌కామ్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని ఆ ఉద్యోగి పేర్కొన్నారు. ఈ ల్యాప్‌టాప్‌కు క్వాల్‌కామ్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ను అందిస్తుండగా.. మైక్రోసాఫ్ట్‌ కొన్ని యాప్‌లకు విండోస్‌ ఓఎస్‌తో మద్దతు ఇవ్వనుందని వెల్లడించారు. ఈ ల్యాప్‌టాప్‌‌ను దేశీయ కంపెనీ ‘ఫ్లెక్స్‌’ తయారు చేస్తోందని.. మార్చి నాటికి వేల సంఖ్యలో ఈ ల్యాప్‌టాప్‌ను విక్రయించాలన్నది జియో లక్ష్యమని అన్నారు. కాగా.. ఈ ల్యాప్‌టాప్‌ కోసం ప్రత్యేకంగా జియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. జియోస్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ ధరను రూ.15 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఈ జియోబుక్‌ నవంబరులో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

మరోవైపు.. 5జీ సేవలను ప్రారంభించిన వెంటనే, జియో 5జీ ప్లాన్స్‌కు అధిక ధరల్ని వసూలు చేసే అవకాశం లేదని, 4జీ ధరలకే 5జీ సేవల్ని అందిస్తామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ధరల్ని అమలు చేసే యోచన ప్రస్తుతానికైతే లేదని ఆ ఉద్యోగి తేల్చి చెప్పారు. దీపావళి కల్లా.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలో జియో 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.