Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!

Redmi K100

Redmi K100

Redmi K100 Launch Confirmed for October 2026: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. గేమింగ్ ప్రియులు, ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే యూజర్లను లక్ష్యంగా చేసుకుని Redmi K100 స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఈ నెలలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఫోన్ విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. రెడ్‌మీ అధికారిక వీబో (Weibo) ఖాతాలో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే చైనాలో ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమైనట్లు సమాచారం. కేవలం 9.9 చైనీస్ యువాన్లు (సుమారు రూ.140) డిపాజిట్‌గా చెల్లించి ప్రీ-రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఫోన్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేక గిఫ్ట్ ప్యాకేజీ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

Redmi K100 ప్రధానంగా గేమింగ్, అధిక పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, నాణ్యమైన OLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండవచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ అందించనున్నారనే వార్త ప్రస్తుతం ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ బ్యాటరీ నిజంగా అందుబాటులోకి వస్తే, తరచూ ఛార్జింగ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు ఎక్కువ బ్యాకప్ అందించే అవకాశం ఉంది.

లీకుల ప్రకారం, Redmi K100లో 6.9 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ స్క్రీన్ 185Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాసెసర్ అందుబాటులోకి వస్తే, హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఇతర పనుల్లో మెరుగైన పనితీరును అందించవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Redmi K100లో Android 17 ఆధారిత HyperOS 4 అందించవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

రెడ్‌మీ విడుదల చేసిన టీజర్ చిత్రంలో ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరా సెన్సర్లు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్‌లో Bose ట్యూనింగ్‌తో కూడిన స్పీకర్లు, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉండనున్నట్లు సమాచారం. ధర విషయానికి వస్తే, Redmi K100 చైనాలో సుమారు 3,500 చైనీస్ యువాన్లకు (దాదాపు రూ.50,000) విడుదల కావచ్చని లీకులు సూచిస్తున్నాయి.