మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్న వినియోగదారులకు రెడ్‌మీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెడ్‌మీ 15 5G, రెడ్‌మీ Note 15 5G స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచినట్లు సమాచారం. రెండు ఫోన్‌ల అన్ని వేరియంట్లపై ఏకరీతిగా రూ.2,000 పెంపు అమలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
లీకైన షియోమీ అంతర్గత పత్రం ద్వారా ఈ ధరల పెంపు వెలుగులోకి వచ్చింది. టిప్‌స్టర్ సంజు చౌదరి తన ‘X’ సోషల్ మీడియా ఖాతాలో ఈ వివరాలను పంచుకున్నారు. మే 25, 2026 తేదీతో ఉన్న ఈ పత్రాన్ని Mi హోమ్ స్టోర్లు, ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములకు పంపినట్లు సమాచారం.
రెడ్‌మి 15 5G కొత్త ధరలు
6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499 నుంచి రూ.20,499కు పెరిగింది.
8GB + 128GB వేరియంట్ ధర రూ.20,499 నుంచి రూ.22,499కు చేరింది.
8GB + 256GB వేరియంట్ ధర రూ.22,499 నుంచి రూ.24,499కు పెరిగింది.
రెడ్‌మి నోట్ 15 5G కొత్త ధరలు
8GB + 128GB వేరియంట్ ధర రూ.24,999 నుంచి రూ.26,999కు పెరిగింది.
8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ.29,999కు చేరింది.
ఈ విధంగా అన్ని మోడళ్లపై రూ.2,000 చొప్పున ధరలు పెరిగాయి.
2026లో మరింత పెరిగే అవకాశం?
ధరలను పెంచుతున్నది కేవలం రెడ్‌మి మాత్రమే కాదు. భారత మార్కెట్లో ఉన్న పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా ఉత్పత్తి వ్యయాలను నియంత్రించేందుకు ధరలు పెంచడం లేదా నిశ్శబ్దంగా స్పెసిఫికేషన్‌లలో మార్పులు చేయడం ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న RAM మెమరీ కొరతను పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా AI డేటా సెంటర్ల నుంచి భారీగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం రాబోయే నెలల్లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ల ధరలపై పడే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
