600 రోజుల బ్యాటరీ బ్యాకప్‌, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!

Moto Tag 2

Moto Tag 2

Moto Tag 2 Launched: స్మార్ట్ ట్రాకర్ మార్కెట్‌లో యాపిల్ AirTag‌కు పోటీగా మోటరోలా కొత్త Moto Tag 2ను యూరప్‌లోని కొన్ని దేశాల్లో విడుదల చేసింది. ఇది సాధారణ ట్రాకర్‌లానే కనిపించినా, ఇందులో అందించిన కొత్త టెక్నాలజీలు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. Moto Tag 2ను కీలు, బ్యాగులు, వాలెట్లు, లగేజీ వంటి వస్తువులకు అటాచ్ చేసుకునేలా రూపొందించారు. ఇది గూగుల్ “ఫైండ్ హబ్” నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతూ, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వస్తువుల లొకేషన్‌ను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

ఈ కొత్త ట్రాకర్‌లో ప్రధాన హైలైట్ అల్ట్రా-వైడ్ బ్యాండ్ (UWB) టెక్నాలజీ. దీనితో పాటు బ్లూటూత్ 6.0, బ్లూటూత్ ఛానల్ సౌండింగ్ సపోర్ట్ కూడా ఉంది. సాధారణ బ్లూటూత్ ట్రాకర్లతో పోలిస్తే ఇది మరింత ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. దీంతో యూజర్లు తమ ఫోన్ ద్వారా పోయిన వస్తువు ఎటు వైపు ఉందో దిశా సూచనలతో పాటు ఎంత దూరంలో ఉందో కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాల్లో సాధారణ బ్లూటూత్ ట్రాకర్లు సరైన సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో Moto Tag 2 మరింత మెరుగైన అనుభవాన్ని అందించనుంది.

బ్యాటరీ విషయంలో కూడా మోటరోలా పెద్ద అప్‌గ్రేడ్ ఇచ్చింది. స్టాండర్డ్ CR2032 రీప్లేసబుల్ బ్యాటరీతో Moto Tag 2 దాదాపు 600 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది తొలి తరం Moto Tag‌తో పోలిస్తే భారీ పెరుగుదల. అదేవిధంగా ఈ డివైస్‌కు IP68 రేటింగ్ ఇవ్వడంతో నీరు, దుమ్ము నుంచి మంచి రక్షణ లభిస్తుంది. వర్షం, స్పిల్స్ లేదా రోజువారీ వినియోగంలో చిన్నపాటి డ్యామేజ్‌లను కూడా ఇది తట్టుకోగలదు.

డిజైన్ పరంగా Moto Tag 2 చాలా స్లిమ్‌గా ఉండేలా రూపొందించారు. దీంతో వాలెట్ లేదా లగేజీలో సులభంగా పెట్టుకోవచ్చు. సాధారణంగా ట్రాకర్లలో కనిపించే వైట్ లేదా బ్లాక్ రంగులకు భిన్నంగా, మోటరోలా దీనిని గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఇంకా ఇందులో ఉన్న బిల్ట్-ఇన్ బటన్ ద్వారా కనెక్ట్ అయిన ఫోన్‌ను రింగ్ చేయడం లేదా కెమెరా షట్టర్‌ను రిమోట్‌గా ట్రిగ్గర్ చేయడం కూడా సాధ్యమవుతుంది. గూగుల్ ఎన్క్రిప్టెడ్ “ఫైండ్ హబ్” ఎకోసిస్టమ్‌ను ఉపయోగించడం వల్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రస్తుతం Moto Tag 2 యూకే, జర్మనీ వంటి యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. యూకేలో దీని ధర £29.99 కాగా, జర్మనీలో సుమారు €40గా నిర్ణయించారు. త్వరలో ఇతర దేశాల్లో కూడా ఈ ట్రాకర్‌ను విడుదల కానుంది.