Site icon NTV Telugu

Recharge Price Hike: సామాన్యలకు బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు..

Recharge

Recharge

Recharge Price Hike: సామాన్యులకు మరో బిగ్‌షాక్ తగిలింది. టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు 2026 జూన్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక వెల్లడించింది. గతంలో జరిగిన ధరల సవరణల ట్రెండ్‌కు ఇదే సరైన కాలమని ఆ నివేదిక పేర్కొంది. ధరలు పెరగడమే కాకుండా, దేశంలో డేటా వినియోగం వేగంగా పెరగడం, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వైపు వినియోగదారులు మారడం వల్ల ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధికి బలమైన మద్దతు లభిస్తోంది.

READ MORE: LIC Bima Lakshmi Plan: మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ ప్లాన్.. నెలకు రూ.4,400 కడితే.. చేతికి రూ.16 లక్షలు..!

2026లో జరిగే రీచార్జ్ ధరల పెంపు ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెరుగుతుందని అంచనా. ఇది 2026లో 7 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు రెండింతలు. టారిఫ్‌లు 15 శాతం పెరిగితే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం కూడా 2027లో సగటున 14 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల కొత్త వినియోగదారుల చేరిక కొంత మందగించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. ధరల పెంపు ప్రభావం కంపెనీల వారీగా భిన్నంగా ఉండనుంది. రిలయన్స్ జియో తన సేవల ధరలను 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశముందని అంచనా. దీని ద్వారా భారతి ఎయిర్‌టెల్‌తో సమానంగా తన విలువను నిలబెట్టుకోవడం, పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా పరిస్థితి మరింత కఠినంగానే ఉంది. భారీ ప్రభుత్వ బకాయిలను తీర్చేందుకు 2027 నుంచి 2030 మధ్య కాలంలో మొత్తం మీద సుమారు 45 శాతం వరకు సేవల ధరలు పెంచాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా.

READ MORE: Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి చాలా ప్రత్యేకం.. సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బ్రేక్ అయ్యేనా?

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు చెందిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ బకాయిలు 2032 నుంచి చెల్లించడం ప్రారంభించి 2041 వరకు కొనసాగనున్నాయి. ఐదేళ్ల పాటు మోరేటోరియం అమలైతే తక్షణ నగదు భారం కొంత తగ్గినా, నెట్‌వర్క్ పెట్టుబడులను కొనసాగించేందుకు కంపెనీకి ఇంకా భారీగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 5జీ నెట్‌వర్క్‌ల నిర్మాణం ప్రధాన దశ పూర్తవుతున్న నేపథ్యంలో, టెలికాం కంపెనీల ఖర్చులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని అంచనా. 2027 వరకు పెట్టుబడి ఖర్చులు నియంత్రిత స్థాయిలోనే కొనసాగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, రాబోయే టారిఫ్ పెంపు టెలికాం రంగానికి ఆదాయ పరంగా కొత్త ఊపునివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version