Juice Jacking: మీరు పబ్లిక్ ప్లేసుల్లో యూఎస్‌బీ ద్వారా మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నారా..? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడ్డట్లే. ఛార్జింగ్ కోసం ఒకే USB కార్డ్‌ని ఉపయోగిస్తే స్మార్ట్‌ఫోన్‌ల వంటి గాడ్జెట్‌లను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ‘జ్యూస్ జాకింగ్’ అనే డేటా ట్రాన్స్‌ఫర్ ద్వారా మొబైల్స్‌ని హ్యాక్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొబైల్ లేకుండా మన జీవితం సాగే పరిస్థితి లేదు. కొన్ని సందర్భాల్లో ఇంటికి దూరంగా ఉండటమో, లేక ఏదైనా ప్రయాణంలో ఉన్న సమయంలోనో మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంటుంది, అటువంటి సమయాల్లో మనం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే, ఇలా చేస్తే మన మొబైల్ నుంచి డేటాను దొంగిలించే అవకాశం ఉంది. దీంతో పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు సురక్షితమా..? కాదా..? అనేది ముందు నిర్దారించుకోవాలి.
‘‘జ్యూస్ జాకింగ్’’ అంటే ఏమిటి..?
యూఎస్‌బీ పోర్టు ద్వారా మన మొబైల్ లేదా ఇతర ఏదైనా డిజిటల్ డివైస్ నుంచి సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం, దొంగిలించడాన్ని ‘‘జ్యూస్ జాకింగ్’’గా అభివర్ణిస్తారు. USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేసే సమయంలో మన సెల్‌ఫోన్ లోని సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల్లో మన మొబైల్ నుంచి డేటా దొంగిలించవచ్చు.
‘‘జ్యూస్ జాకింగ్’’ రకాలు:
మాల్వేర్ ఎటాక్:
మాల్వేర్ ఇన్ఫెక్షన్ ఎటాక్ ద్వారా మన పరికరాలను వేరే వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభాకరమైన మాల్వేర్ కోడ్, ట్రోజర్ హార్స్, స్పైవేర్, కీలాగర్లతో సహా వివిధ మాల్వేర్లను ఉపయోగించి పరికరంపై నియంత్రణను పొందడానికి సైబర్ దాడి చేసేవారు జ్యూస్ జాకింగ్ దాడులను ఉపయోగిస్తారు.
స్మార్ట్ ఫోన్ భద్రతా ఉల్లంఘన, సిస్టమ్ ఈ మాల్వేర్ల కారణంగా రాజీ పడే అవకాశం ఉంటుంది. వినియోగదారుడు వీటని కనుగొని అన్ ఇన్‌స్టాల్ చేయనంత వరకు మన మొబైల్ ఫోన్లలో ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది.
డేటా థెప్ట్ జ్యూస్ జాకింగ్:
ఈ విధానంలో ఛార్జింగ్ చేసే సమయంలో డేటాను దొంగిలించే అవకాశం ఉంటుంది. యూఎస్‌బీ పోర్టులో మన మొబైల్ ఎంత సేపే ఛార్జింగ్ పెట్టామనే దానిపై ప్రమాదం ఉంటుంది. ఎక్కువ సేపు సమయం ఛార్జింగ్ ఉంటే, మన మొబైల్‌పై ఎటాక్ చేసేవారికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీంతో మైబైల్ లోని డేటాను కాపీ చేసే అవకాశం ఉంటుంది.
మల్టీ-డివైస్ జ్యూస్ జాకింగ్:
ఇది కూడా మాల్వేర్ ఇన్ఫెక్షన్ దాడుల్లాగే దాడి చేస్తుంది. ఒక మొబైల్ ఫోన్‌లో హానికరమైన కోడ్ ఇన్ స్టాల్ అయి ఉంటే, దాన్ని యూఎస్‌బీ పోర్టుకు కనెక్ట్ చేసిన సమయంలో, ఇతర యూఎస్‌బీ పోర్టులను పాడయ్యేలా చేస్తుంది. ఆ సమయంలో ఛార్జింగ్ ఉన్న ఇతర మొబైళ్లను కూడా ప్రమాదంలో పడేస్తుంది.
నివారణ ఎలా..?
సాధ్యమైనంత వరకు పబ్లిక్ యూఎస్‌బీ ఛార్జింగ్‌ని వాడొద్దు. పవర్ బ్యాంక్‌ని వాడాలి. మీ మొబైల్ ఛార్జర్ వాడేలా చూసుకోవాలి. చట్టవ్యతిరేక ఫైల్స్, యాప్స్ ఇన్-స్టాల్ చేసుకోవద్దు. జ్యూస్ జాకింగ్ నుంచి కాపాడుకోవాలంటే USB డేటా బ్లాకర్‌ని ఉపయోగించాలి. అన్ని వేళల్లో యాంటీ వైరస్ ప్రోగ్రామ్స్ జ్యూస్ జాకింగ్ నుంచి రక్షించలేవని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అయితే, హ్యాకర్లు హానికరమైన ఫైల్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ మాల్వేర్ ఇన్ఫెక్షన్‌ను ఆపగలదు. బయటకు వెళ్లే సమయంలో మీ మొబైల్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఖచ్చితంగా తీసుకెళ్లండి.