Site icon NTV Telugu

Human Washing Machine: బట్టలనే కాదు.. ఈ వాషింగ్ మెషిన్ మనుషులను కూడా ఉతుకుతుంది..!!

Human Washing Machine

Human Washing Machine

Human Washing Machine: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఒకప్పుడు చేత్తో బట్టలు ఉతికేవాళ్లు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉండటంతో పని సులువుగా మారిపోయింది. వాషింగ్ మెషీన్ కారణంగా గృహిణీలకు పనిభారం కూడా ఎంతో తగ్గింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కాకుండా మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ కూడా రాబోతోంది. ఈ యంత్రాన్ని జపాన్‌కు చెందిన కంపెనీ తయారుచేయనుంది. స్నానం చేయడానికి బద్దకం చూపించే మనుషులకు ఈ యంత్రం వల్ల మేలు చేకూరనుందని ప్రచారం జరుగుతోంది. ఒసాకాకు చెందిన సైన్స్ కో లిమిటెడ్ ఈ యంత్రాన్ని రూపొందిస్తోంది.

ఫైన్ బబుల్ టెక్నాలజీ సహాయంతో వివిధ సెన్సార్లు, కృత్రిమ మేధస్సు ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాక విశ్రాంతిని ఇచ్చే సంగీతాన్ని కూడా వినిపిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ డిస్‌ప్లేలో ఫోటోలను కూడా చూపిస్తూ అహ్లాదాన్ని అందించేలా ఈ యంత్రం సహాయపడుతుంది. అయితే ఈ వాషింగ్ మెషీన్‌లో మనిషి వెళ్లి కూర్చుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందనే సందేహం రావచ్చు. అలాంటి భయం అవసరం లేకుండా నరాలు దెబ్బతినకుండా ఈ మెషిన్‌లోని సెన్సార్లు పనిచేస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. మనిషి శరీర పనితీరు ఆధారంగా మెషిన్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సేకరించిన మనిషి డేటా సాయంతో సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఈ మెషిన్ సృష్టిస్తుందని రూపకర్తలు అంటున్నారు.

Read Also: Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్

అయితే మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ రూపొందించే ఆలోచన ఇప్పుడు పుట్టిందేమీ కాదు. 1970లో జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ అల్ట్రాసోనిక్ బాత్ అనే పరికరాన్ని తయారు చేసింది. అది కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తి చేసింది. అయితే అప్పట్లో సదరు మెషిన్‌పై వచ్చిన సందేహాలతో మార్కెట్లోకి విడుదల చేసే సాహసం చేయలేదు. అయితే ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా ఈ వెరైటీ మెషీన్ 2025లో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version