2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!

  • itel 2165Cలో ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్స్
  • PhonePeతో భాగస్వామ్యంగా ఆఫ్‌లైన్ UPI సదుపాయం
  • 2G నెట్‌వర్క్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల అవకాశం
  • 2 అంగుళాల డిస్‌ప్లే, 1200mAh బ్యాటరీ
  • గరిష్ఠంగా 11.67 గంటల టాక్‌టైమ్, 25 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్
Itel 2165c

Itel 2165c

itel 2165C: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) కీలక అడుగు వేసింది. itel 2165C ఫీచర్ ఫోన్‌లో PhonePe ద్వారా ఆఫ్‌లైన్ UPI పేమెంట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ఫోన్‌పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండే ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది ఉపయోగపడనుంది.

ఈ కొత్త సదుపాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని కంపెనీ తెలిపింది. తద్వారా 2G నెట్‌వర్క్ వినియోగదారులు కూడా యూపీఐ సేవలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆధారిత పేమెంట్ యాప్‌లకు దూరంగా ఉన్న వినియోగదారులను డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తీసుకురావడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. itel 2165C ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 2 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 1200mAh బ్యాటరీని అందించారు. ఏఐ బ్యాటరీ, సూపర్ బ్యాటరీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 11.67 గంటల టాక్‌టైమ్, 25 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32GB వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్‌లో 2,000 కాంటాక్ట్స్, 500 మెసేజ్‌లను స్టోర్ చేసుకునే సదుపాయం ఉంది. ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్‌ను అందించారు. బ్లూటూత్, రికార్డింగ్‌తో కూడిన వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం 10 భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. itel 2165C ధర రూ.1,199గా ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఐటెల్‌కు 1.30 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లు, 1,000కు పైగా అధీకృత సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫోన్ పే సపోర్ట్‌తో కూడిన ఈ ఫీచర్ ఫోన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది.