iPhone Duo vs iPhone 18 Pro: యాపిల్ తెచ్చిన తొలి ఫోల్డబుల్ మోడల్ ‘ఐఫోన్ డ్యూయో’ మార్కెట్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. అప్పుడే ఈ ఫోన్‌పై రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. ఓ అంతర్జాతీయ మీడియా టెక్నాలజీ రైటర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ డ్యూయో vs ఐఫోన్ 18 ప్రోలో రోజువారీ వాడకానికి ఏది బెస్ట్ అనే అంశంపై వివరణ ఇచ్చారు. ఫోల్డబుల్ ఫోన్‌తో మీరు అనుకున్నంతగా శాటిస్ఫై కారని చెబుతున్నారు. గత ఏడాది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 వాడిన అనుభవంతో చెప్తున్నా, కొన్నిసార్లు ఫోల్డబుల్ స్క్రీన్‌ను తెరవకుండానే రోజులు గడిచిపోతాయని వివరిస్తున్నారు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. నేను గతేడాదికి పైగా శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 వాడుతున్నారు. చాలా రోజులు దాన్ని అస్సలు అన్ఫోల్డ్ చేయకుండానే సాధారణ ఫోన్లా వాడుతుంటాను. పెద్ద స్క్రీన్ చూసి మురిసిపోవడం ఆరంభంలోనే, రోజువారీ వాడకంలోకి వచ్చేసరికి ఆ క్రేజ్ దానంతట అదే తగ్గిపోతుంది. ఫోల్డబుల్ ఐఫోన్ కొందరికి విపరీతంగా నచ్చొచ్చు గాక, కానీ చాలామంది నాలానే నిరాశపడే అవకాశం ఉంది.
ఈ ఫోన్లో ఉండే మొదటి సమస్య వీటి సైజు, పట్టుకోవడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఐఫోన్ డ్యూయో చూడటానికి సర్ఫేస్ డ్యూయో తరహా డిజైన్‌తో, సంప్రదాయ ఐఫోన్‌లకంటే పూర్తిగా భిన్నంగా ఉంది. యాపిల్ ఈవెంట్లో దీన్ని చూసినప్పుడే అనిపించింది. ఒంటిచేత్తో పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని. జెడ్ ఫోల్డ్ 6 మందంగా ఉంటే, ఈ డ్యూయో వెడల్పుగా ఉండి పట్టుకోవడానికి అసౌకర్యంగా అనిపిస్తుంది. రోడ్డుపై నడుస్తున్నప్పుడో లేక క్యూలో నిలబడినప్పుడో ఫోన్‌ను అన్ఫోల్డ్ చేసి వాడటానికి భయం వేస్తుంది. ఎక్కడ చేయిజారి కిందపడిపోతుందోనన్న ఆందోళన ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్నప్పుడైతే ఎలాగూ ల్యాప్‌టాప్ లేదా ఐప్యాడ్ వంటి పెద్ద స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫోల్డబుల్ ఫోన్ అవసరమే రాదు. కూర్చుని ఏదైనా చదువుకుంటున్నప్పుడు కూడా, మళ్లీ మడతపెట్టి జేబులో పెట్టుకునే శ్రమ ఎందుకని చాలామంది ఫోల్డ్ చేసే ఉంచుతారు. కాలక్రమేణా ఫోల్డబుల్ ఫోన్‌ను మామూలు ఫోన్లాగే వాడటం మొదలుపెడతాం. ఫలితంగా, దానివల్ల వచ్చే అసలైన ప్రయోజనాలను అనుభవించకుండానే, కేవలం బరువు, మందం వంటి సమస్యలతో విసిగిపోతాం.
ఇక మల్టీటాస్కింగ్ విషయానికి వస్తే, ఒకేసారి రెండు యాప్‌లు వాడొచ్చని గొప్పగా చెప్తారు కానీ, నిజంగా ఫోన్లో ఒకేసారి రెండు యాప్‌లు వాడే అవసరం ఎంతమందికి వస్తుంది? వీడియోలు చూస్తూ వేరే యాప్ వాడటానికి సాధారణ ఐఫోన్లలో పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ ఎలాగూ ఉంది. మామూలు ఫోన్లలో ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మారడం రెప్పపాటులో జరిగిపోతుంది. కానీ, స్క్రీన్‌పై రెండు యాప్‌లను సెట్ చేసుకుని వాడటం సమయాన్ని వృథా చేయడమే. యాపిల్ సాఫ్ట్వేర్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ఐప్యాడ్‌లలోనే మల్టీటాస్కింగ్ అంత సౌకర్యవంతంగా ఉండదు, ఇక ఫోన్లో చెప్పాల్సిన పనేలేదు. యాపిల్ డ్యూయో మార్కెట్లో అత్యంత నాణ్యమైన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచే మాట వాస్తవమే కావొచ్చు, కానీ ఫోల్డబుల్ టెక్నాలజీ అనేది అందరికీ సెట్ కాదు. కేవలం ఆకర్షణీయమైన ప్రచారాలను చూసి మోసపోకూడదు. నా అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే.. రోజువారీ వాడకానికి ఎప్పుడూ సంప్రదాయ ఫోన్లే బెస్ట్. కాబట్టి, అంత డబ్బు పెట్టి డ్యూయో కొనేకంటే, బెస్ట్ ఫీచర్లు ఉండే ఐఫోన్ 18 ప్రో కొనుక్కొని డబ్బులు మిగుల్చుకోవడం తెలివైన పని అని చెబుతున్నారు.

