iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?

Iphone 18 Pro

Iphone 18 Pro

iPhone 18 Pro: ఆపిల్ (Apple) నుండి కొత్తగా ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడంతో వాటి ధరలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో తక్కువ ధరలకు ఐఫోన్ 18 ప్రో సిరీస్ లభించే అవకాశం ఉంది. మరి ఆ వివరాలేంటి..? ఎంత తక్కువకు దొరుకుతుందో చూసేద్దామా..

ఆ దేశాల్లో ఐఫోన్ ధరలు తక్కువ..

ప్రపంచంలోని కొన్ని మార్కెట్లలో ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు కనపడుతున్నాయి. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్ ను విడుదల చేయగా.. వివిధ దేశాలలో వివిధ రకాలుగా ధరలు ఉన్నాయి. అందులో కెనడా, అమెరికా, హాంకాంగ్, మలేషియా, దుబాయ్, జపాన్ వంటి మార్కెట్లలో ధరలు భారత్ లో ఉండే ధరల కంటే తక్కువగా ఉన్నాయి.

ట్యాక్స్ రీఫండ్‌తో మరింత తగ్గే అవకాశం..

అయితే కేవలం ఫోన్ ధరను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరిపోదు. ఆయా దేశాల్లో పన్ను రీఫండ్ లేదా ట్యాక్స్ రీఫండ్ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా కీలకంగా మారుతుంది. అమెరికా, కెనడా, హాంకాంగ్, మలేషియా వంటి కొన్ని మార్కెట్లలో భారతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలో పన్ను రీఫండ్ ప్రయోజనం ఉండదు. కాబట్టి అక్కడ కొనడం ఒకసారి ఆలోచించడం మంచింది.

దుబాయ్, జపాన్‌లో..

దుబాయ్, జపాన్ మాత్రం ట్యాక్స్ రీఫండ్ కారణంగా అక్కడ కొనడం బెస్ట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు దుబాయ్‌లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ.32,000 వరకు తక్కువగా ఉండగా., అక్కడ కొనడం ద్వారా రీఫండ్ పొందడం తర్వాత మరింత సేవింగ్ చేయవచ్చు. ప్రో మ్యాక్స్ విషయంలోనూ ఇదే విధంగా ధర తగ్గే అవకాశం ఉంది. జపాన్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ట్యాక్స్ రీఫండ్ అనంతరం ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ.23,000 వరకు, ప్రో మ్యాక్స్ ధర సుమారు రూ.35,000 వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వాస్తవ ధరలు, కరెన్సీ మార్పిడి రేట్లు, పన్ను నిబంధనలు, కొనుగోలు చేసే సమయంలో వర్తించే షరతుల ఆధారంగా మారవచ్చు.

భారత్‌లో జీఎస్టీ ప్రయోజనం ఎలా?

మరోవైపు భారత్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపార సంస్థలు లేదా అర్హత కలిగిన కొనుగోళ్ల విషయంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అందువల్ల విదేశాలకు ప్రత్యేకంగా వెళ్లి ఐఫోన్ కొనుగోలు చేయడం కంటే, ఇప్పటికే విదేశాలకు వెళ్లే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా కొనుగోలు చేయడం కొంతమందికి ఖర్చు తగ్గించే మార్గంగా ఉండవచ్చు.

విదేశాల్లో కొనేముందు ఇవి తప్పక చూడాలి..

అయితే విదేశాల నుంచి ఐఫోన్ కొనుగోలు చేసే ముందు వారంటీ, మోడల్ నంబర్, సిమ్/ఈసిమ్ అనుకూలత, దిగుమతి నిబంధనలు, కస్టమ్స్ నిబంధనలు, ట్యాక్స్ రీఫండ్ అర్హత వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే జీఎస్టీ ప్రయోజనం పొందేందుకు కొనుగోలు అర్హత, ఇన్వాయిస్, వ్యాపార వినియోగం వంటి నిబంధనలు వర్తించవచ్చు.