iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?

  • ఐఫోన్ 18 ప్రో మాక్స్, గెలాక్సీ S26 అల్ట్రా మధ్య పోటీ
  • ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రారంభ ధర రూ.1,79,900
  • గెలాక్సీ S26 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,39,999
  • రెండు ఫోన్లలో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే
  • మరిన్ని విభాగాల్లో తేడా ఇలా..
Iphone 18 Pro Max Vs Samsung Galaxy S26 Ultra

Iphone 18 Pro Max Vs Samsung Galaxy S26 Ultra

iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యాపిల్‌ నుంచి వచ్చిన ఐఫోన్ 18 ప్రో మాక్స్, శాంసంగ్‌ గాలక్సీ S26 అల్ట్రా మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు ఫోన్లలోనూ అత్యాధునిక ప్రాసెసర్లు, ప్రీమియం డిస్‌ప్లేలు, అధునాతన కెమెరాలు, AI ఫీచర్లు ఉన్నాయి. అయితే ధర విషయంలో మాత్రం భారీ తేడా ఉంది. భారత్‌లో iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,79,900 కాగా.. Galaxy S26 Ultra ప్రారంభ ధర రూ.1,39,999గా ఉంది. అంటే రెండు ఫోన్ల ఎంట్రీ వేరియంట్ల మధ్య దాదాపు రూ.40 వేల తేడా ఉంది.

డిజైన్‌:

రెండు ఫోన్లూ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తాయి. iPhone 18 Pro Max 163.4 x 78.0 x 8.75 మిల్లీమీటర్ల కొలతలతో 249 గ్రాముల బరువు ఉంటుంది. మరోవైపు శాంసంగ్‌ గాలక్సీ S26 అల్ట్రా 163.6 x 78.1 x 7.9 మిల్లీమీటర్ల మందంతో కేవలం 214 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. అంటే ఐఫోన్‌తో పోలిస్తే గెలాక్సీ అల్ట్రా ఏకంగా 35 గ్రాములు తక్కువ బరువు ఉంటుంది. రోజువారీ వినియోగంలో ఈ తేడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

ఐఫోన్‌లో అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌, ముందు సిరామిక్ షీల్డ్ 2, వెనుక సిరామిక్ షీల్డ్ ఉన్నాయి. గెలాక్సీలో ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఉపయోగించారు. రెండు ఫోన్లకూ IP68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఉంది. అయితే తక్కువ బరువు, సన్నని డిజైన్‌ కారణంగా ఈ విభాగంలో శాంసంగ్‌ గాలక్సీ S26 అల్ట్రాకు పైచేయి దక్కుతుంది.

డిస్‌ప్లే:

ఐఫోన్ లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2868 x 1320 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120Hz ProMotion రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. గరిష్ఠ అవుట్‌డోర్‌ బ్రైట్‌నెస్‌ 3,000 నిట్స్‌ వరకు ఉంటుందని పేర్కొన్నారు. అదే గాలక్సీ S26 అల్ట్రాలో 6.9 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది 3120 x 1440 పిక్సెల్స్‌ QHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌ సపోర్ట్‌ చేస్తుంది. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2,600 నిట్స్‌గా ఉంది. రిజల్యూషన్‌ పరంగా శాంసంగ్‌ ముందుండగా, పీక్‌ బ్రైట్‌నెస్‌లో ఐఫోన్‌ ముందుంది.

అంతేకాదు, Galaxy S26 Ultraలో ప్రత్యేకమైన “ప్రైవసీ డిస్ప్లే” ఫీచర్‌ ఉంది. పక్కన ఉన్న వ్యక్తులు స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని చూడకుండా ఇది ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్లు, కొన్ని యాప్స్‌, PINలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారానికి కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

పవర్‌ఫుల్‌ చిప్‌సెట్స్:

ఐఫోన్ యాపిల్‌ కొత్త A20 Pro చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ఇందులో 6-కోర్‌ CPU, 7-కోర్‌ GPU, Neural Accelerators, 16-కోర్‌ Neural Engine ఉన్నాయి. హార్డ్‌వేర్‌ యాక్సిలరేటెడ్‌ రే ట్రేసింగ్‌కు కూడా సపోర్ట్‌ ఉంది. అదే Galaxy S26 Ultraలో Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌ ఉంది. దీనికి రీడిజైన్‌ చేసిన వేపర్ ఛాంబర్ ను జత చేశారు. CPU, GPU, NPU పనితీరులో మెరుగుదలలు అందించినట్లు శాంసంగ్‌ పేర్కొంది.

గేమింగ్‌, వీడియో ఎడిటింగ్‌, AI టాస్క్స్‌ వంటి భారీ పనులకు రెండు ఫోన్లూ శక్తివంతమైనవే. అయితే ఐఫోన్లో హార్డ్‌వేర్‌, iOS మధ్య ఉండే ఆప్టిమైజేషన్‌ ప్రధాన బలం కాగా.. Galaxy S26 Ultraలో AI, మల్టీటాస్కింగ్‌, కస్టమైజేషన్‌ ప్రధాన బలాలుగా ఉన్నాయి.

కెమెరా:

గాలక్సీ S26 అల్ట్రాలో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి. 200MP మెయిన్‌ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌, 50MP 5x టెలిఫొటో, 10MP 3x టెలిఫొటో కెమెరాలను అందించారు. గరిష్ఠంగా 100x డిజిటల్‌ జూమ్‌ సపోర్ట్‌ ఉంది. అదే ఐఫోన్ 18 ప్రో మాక్స్ లో మూడు 48MP కెమెరాలు ఉన్నాయి. 48MP మెయిన్‌ కెమెరా, 48MP అల్ట్రావైడ్‌, 48MP టెలిఫొటో కెమెరాలు ఇందులో ఉన్నాయి. మెయిన్‌ కెమెరాలో కొత్తగా Variable Aperture టెక్నాలజీని అందించారు. ఇది f/1.48, f/1.8, f/2.8, f/4.0 మధ్య అపర్చర్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. జూమ్‌ విషయంలో Galaxy S26 Ultraకు స్పష్టమైన ప్రయోజనం ఉంది. 3x, 5x ప్రత్యేక టెలిఫొటో కెమెరాలు ఉండటం వల్ల దూరంలోని వస్తువులను క్యాప్చర్‌ చేయడంలో ఇది మరింత వెర్సటైల్‌గా ఉంటుంది.

వీడియో రికార్డింగ్‌ విషయంలో ఐఫోన్ మరింత అధునాతన ఫీచర్లను అందిస్తోంది. 4K Dolby Vision వీడియోను 120fps వరకు రికార్డ్‌ చేయవచ్చు. ProRes, ProRes RAW, Apple Log 2, Genlock వంటి ప్రొఫెషనల్‌ వీడియో ఫీచర్లు కూడా ఉన్నాయి. Galaxy S26 Ultra 8K వీడియోను 30fps వరకు, 4K వీడియోను 120fps వరకు రికార్డ్‌ చేయగలదు. ప్రొఫెషనల్‌ వీడియో అవసరాలు ఉన్నవారికి రెండు ఫోన్లూ మంచి ఎంపికలే అయినప్పటికీ.. అధునాతన వీడియో టూల్స్‌ విషయంలో ఐఫోన్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

బ్యాటరీ:

గాలక్సీ S26 అల్ట్రాలో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది గరిష్ఠంగా 31 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని శాంసంగ్‌ పేర్కొంది. 60W వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో సుమారు 30 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు. అదే ఐఫోన్లో బ్యాటరీ సామర్థ్యాన్ని యాపిల్‌ సాధారణంగా mAh రూపంలో ప్రకటించలేదు. అయితే 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌, 38 గంటల వరకు స్ట్రీమ్డ్‌ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని పేర్కొంది. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు. MagSafe, Qi2 ద్వారా 25W వరకు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది.

AI ఫీచర్స్:

AI ఫీచర్ల విషయంలో శాంసంగ్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో గాలక్సీ AIతో పాటు Bixby, Gemini, Perplexity వంటి AI టూల్స్‌, Now Nudge, Now Brief, Circle to Search, Photo Assist వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే ఐఫోన్లో ఆపిల్ ఇంటలిజెన్స్, కొత్త సిరి AI అనుభవంతో పాటు A20 Pro Neural Engineను ఉపయోగించే AI ఫీచర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ AI టూల్స్‌, కస్టమైజేషన్‌ విషయంలో Galaxy S26 Ultra కొంత ముందుంది.

స్టోరేజ్‌:

ఐఫోన్ ను 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్‌ వేరియంట్లలో అందిస్తున్నారు. గాలక్సీ మాత్రం 256GB, 512GB, 1TB వేరియంట్లలో లభిస్తుంది. ఎక్కువ స్టోరేజ్‌ కావాలనుకునే వారికి ఐఫోన్‌ మంచి ఎంపిక.

ధరలో భారీ తేడా..

భారత్‌లో iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,79,900. మరోవైపు Galaxy S26 Ultra ప్రారంభ ధర రూ.1,39,999. అదే Galaxy S26 Ultra విషయంలో 512GB ధర రూ.1,59,999 కాగా, 1TB వేరియంట్‌ ధర రూ.1,89,999గా ఉంది. అంటే బేస్‌ వేరియంట్లను పోల్చుకుంటే Galaxy S26 Ultra, iPhone 18 Pro Max కంటే దాదాపు రూ.39,901 తక్కువ ధరకు లభిస్తోంది.

ఏది కొనాలి.?

మీరు ఆపిల్ ఎకోసిస్టమ్‌లో ఇప్పటికే ఉంటే.. వీడియో రికార్డింగ్‌, ProRes వంటి ప్రొఫెషనల్‌ ఫీచర్లు, గరిష్ఠ స్టోరేజ్‌, iOS అనుభవం కావాలంటే iPhone 18 Pro Max మంచి ఎంపిక. అయితే తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్‌ అనుభవం, మెరుగైన జూమ్‌ కెమెరాలు, QHD+ డిస్‌ప్లే, S Pen, ప్రైవసీ డిస్ప్లే, ఎక్కువ ర్యామ్, భారీ AI ఫీచర్లు, ఆండ్రాయిడ్ కస్టమైజేషన్‌ కావాలంటే Galaxy S26 Ultra మరింత విలువైన ఎంపికగా నిలుస్తుంది.

మొత్తంగా చూస్తే.. ఫీచర్లు, వెర్సటిలిటీ, ధరను పరిగణనలోకి తీసుకుంటే Galaxy S26 Ultraకు పైచేయి. కానీ., వీడియో, ఆపిల్ఎకోసిస్టమ్‌, ప్రీమియం iOS అనుభవం కోరుకునేవారికి iPhone 18 Pro Max బెస్ట్ ఎంపిక.