Site icon NTV Telugu

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం సంచలన ఆదేశాలు

Untitled Design (5)

Untitled Design (5)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో Chat GPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్‌ను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయమై ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది. ప్రభుత్వానికి చెందిన అధికారిక పరికరాలు, సిస్టమ్స్‌పై ఈ AI టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది.

ఈ నిర్ణయం ప్రధానంగా ప్రభుత్వ డేటా గోప్యత (డేటా ప్రైవసీ), సమాచార భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నియంత్రణలేమి లేకుండా AI టూల్స్‌లో సున్నితమైన, వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని నమోదు చేయడం వల్ల ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన రహస్య సమాచారం ఇతర దేశాలకు లేదా అనధికార సంస్థలకు చేరే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

ప్రభుత్వ శాఖలు మరియు ఉద్యోగులు అధికారిక విధులు నిర్వహించేటప్పుడు AI సేవలను అత్యంత జాగ్రత్తగా, నియమావళి ప్రకారం మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉపయోగించాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సమాచారాన్ని మరింత సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కూడా కేంద్రం గుర్తు చేసింది.

ఇదే సమయంలో సైబర్ నిపుణులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ సమాచారం వంటి సున్నితమైన డేటాను AI టూల్స్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్‌లోడ్ చేయకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా డేటా దుర్వినియోగం, సైబర్ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version