HMD Rise Launched: నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD గ్లోబల్ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ HMD రైజ్ ను విడుదల చేసింది. 6.51 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ రియర్ కెమెరాతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో “ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్” ఆపరేటింగ్ సిస్టమ్ అందించారు. ఈ మొబైల్ కేవలం 4GB RAM, 64GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో లభించనుంది.
HMD Riseలో 6.51 అంగుళాల డిస్‌ప్లే ఉంది. Unisoc 9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 128GB వరకు పెంచుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో పాటు బాక్స్‌లోనే ఛార్జర్ అందిస్తున్నారు. USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో Sarvam AI రూపొందించిన Indus AI సదుపాయాన్ని అందించారు. ఇది 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. భారతీయ సంస్కృతికి అనుగుణమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఈ సేవకు సంబంధించిన సర్వర్లు, డేటా భారత్‌లోనే హోస్ట్ అవుతున్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన Sanchar Saathi ప్లాట్‌ఫామ్‌ను కూడా ఆప్షనల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మన పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇంకా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం, అనుమానాస్పద మోసపూరిత కమ్యూనికేషన్లను రిపోర్ట్ చేయడం, హ్యాండ్‌సెట్ అసలైనదో కాదో వెరిఫై చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఈ ఫోన్‌కు రెండేళ్ల పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా 18,000 పిన్‌కోడ్‌ల పరిధిలో 275 సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర ఆఫర్లతో కలిపి తొలి రోజు ప్రత్యేక లాంచ్ ధర రూ.9,999గా నిర్ణయించారు. డిసెంబర్ 2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సిల్వర్, మిడ్‌నైట్ గోల్డ్, ఎమరాల్డ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

