Google Pixel Watch 4: గూగుల్ తాజగా నిర్వహించిన Made by Google 2025 ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు పిక్సెల్ బడ్స్ 2a, పిక్సెల్ బడ్స్ ప్రో 2 లతోపాటు గూగుల్ పిక్సెల్ వాచ్ 4 (Google Pixel Watch 4)ను లాంచ్ చేసింది. ఈ కొత్త పిక్సెల్ వాచ్ 4కు మూన్‌స్టోన్ కలర్ ఆప్షన్‌ను ప్రకటించింది. మరి ఈ కొత్త పిక్సెల్ వాచ్ 4 ఫీచర్లు, ధర, పనితీరు గురించి తెలుసుకుందాము.
డిజైన్, డిస్‌ప్లే:
పిక్సెల్ వాచ్ 4 ఇప్పటివరకు వచ్చిన మోడళ్ల కంటే అతిపెద్ద మార్పులతో వచ్చింది. Actua 360 డిస్‌ప్లేతో కూడిన ఈ వాచ్, డోమ్‌డ్ గ్లాస్ డిజైన్ కలిగి ఉంటుంది. వాచ్ 3 కంటే 10% ఎక్కువ స్క్రీన్ ఏరియా, సన్నని బెజెల్స్ ను అందిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్‌ను 3,000 నిట్స్ వరకు పెంచారు. ఇది ఇదివరకు కంటే 50% ఎక్కువ.
Jio Recharge: యూజర్లకు ‘జియో’ మరో షాక్.. రూ.799 ప్లాన్‌కూ చరమగీతం!
సాఫ్ట్‌వేర్:
ఈ వాచ్ గూగుల్ కొత్త Material 3X Expressive UI పై నడుస్తుంది. దీంతో రిచ్ నోటిఫికేషన్స్, మరింత డైనమిక్ వాచ్ ఫేసెస్, అడాప్టివ్ థీమ్స్ లభిస్తాయి. ఇక హార్డ్‌వేర్ పరంగా చూస్తే.. క్వాల్‌కామ్ Snapdragon W5 Gen 2 ప్లాట్‌ఫారమ్, AI ఆధారిత కో-ప్రాసెసర్, కొత్త హాప్టిక్స్ ఇంజిన్, మెరుగైన స్పీకర్, 6GB ర్యామ్ అందించారు. గూగుల్ ప్రకారం, ఈ కాంబినేషన్ గత మోడల్ కంటే 25% వేగంగా, అలాగే సగం పవర్ మాత్రమే వినియోగిస్తుంది.
బ్యాటరీ & ఛార్జింగ్:
బ్యాటరీ పనితీరులో పిక్సెల్ వాచ్ 4 గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఎందుకంటే, 41mm మోడల్‌లో ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇక 45mm వేరియంట్‌లో ఇది ఇంకా ఎక్కువగా అంటే సుమారు 40 గంటల వరకు పని చేస్తుంది. అంతేకాకుండా బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేస్తే వాచ్ సులభంగా 2 నుంచి 3 రోజులు పనిచేయగలదు. వేగవంతమైన ఛార్జింగ్ కూడా ఇందులో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. కేవలం 15 నిమిషాల లోపే 50% వరకు ఛార్జ్ అయ్యే సామర్థ్యం వాచ్‌కు లభించింది.
డ్యూరబిలిటీ:
డ్యూరబిలిటీ పరంగా పిక్సెల్ వాచ్ 4 మరింత బలంగా రూపొందించబడింది. ఇందులో గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల స్క్రాచులకు గట్టి రక్షణ లభిస్తుంది. వాచ్ బాడీని ఎరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు కాబట్టి ఇది తేలికపాటి అయినా, బాగా బలంగా ఉంటుంది. అలాగే, ఈ వాచ్‌కి IP68 సర్టిఫికేషన్ లభించింది. దీని వల్ల దుమ్ము నిరోధకంగా ఉండటంతో పాటు, గరిష్టంగా 50 మీటర్ల లోతులో నీటిలో కూడా వాటర్‌ప్రూఫ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇది పిక్సెల్ వాచ్ సిరీస్‌లో తొలి సర్వీస్ చేయదగిన మోడల్. అందువల్ల అవసరమైతే డిస్‌ప్లే, బ్యాటరీని సులభంగా రీప్లేస్ చేసుకోవచ్చు.
ఫిట్‌నెస్ & హెల్త్ ట్రాకింగ్:
ఫిట్‌నెస్ మరియు హెల్త్ ట్రాకింగ్ విషయానికి వస్తే.. పిక్సెల్ వాచ్ 4లోని ఫీచర్లు ఫిట్‌బిట్ టెక్నాలజీ, గూగుల్ AI ఆధారంగా పనిచేస్తాయి. ఇవి వినియోగదారులకు మరింత ఖచ్చితమైన హార్ట్‌రేట్ మానిటరింగ్, మెరుగైన స్లీప్ ట్రాకింగ్, అలాగే కొత్తగా జోడించిన స్కిన్ టెంపరేచర్ సెన్సార్ వంటి ప్రయోజనాలు అందిస్తాయి. అంతేకాకుండా, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS మరింత సరిగ్గా లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. AI ఆధారిత యాక్టివిటీ రికగ్నిషన్ ద్వారా యూజర్ చేసే వ్యాయామాలను ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డు చేస్తుంది. ఫిట్‌నెస్ ఫీచర్లతో పాటు, వాచ్‌లో జీమెయిల్, క్యాలెండర్, జెమిని ఆన్ ది రిస్ట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన “రైజ్ టు టాక్” ఫీచర్ వల్ల వాయిస్ కంట్రోల్ ఉపయోగించడం మరింత సులభతరం అవుతుంది.
ధర, లభ్యత:
ధర మరియు లభ్యత విషయానికి వస్తే, పిక్సెల్ వాచ్ 4 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 41mm మోడల్ ధర రూ.39,900 కాగా, అలాగే 45mm మోడల్ ధర రూ.43,900గా నిర్ణయించారు. భారత్‌లో మాత్రం ఈ వాచ్ యొక్క Wi-Fi మోడల్స్ మాత్రమే లభిస్తాయి. ప్రీ-ఆర్డర్స్ ఆగస్టు 20 నుండి ప్రారంభమవుతాయి. ఇక అధికారిక విక్రయాలు అక్టోబర్ 4 నుండి ప్రారంభం కానున్నాయి.
