NTV Telugu Site icon

Cancer Diagnosis: క్యాన్సర్‌ని మరింత కచ్చితంగా గుర్తించేందుకు ఏఐ టూల్‌

Cancer

Cancer

ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ కారక జన్యువులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌(ఏఐ) టూల్‌ అందుబాటులోకి రానుంది. మద్రాస్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూపొందించిన ఈ పరికరాన్ని పివోట్‌ (PIVOT) అని పేర్కొంటారు. దీని సాయంతో ఏ పేషెంట్‌లో ఏ జన్యువు కారణంగా క్యాన్సర్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫలితంగా వ్యక్తి స్థాయి చికిత్స విధానాన్ని డెవలప్‌ చేయొచ్చు. ఇప్పటివరకు ఒకే రకమైన క్యాన్సర్‌ రోగులకు ఒకే విధమైన ట్రీట్మెంట్‌ చేసేవారు. పివోట్‌తో ఈ పద్ధతిలో మార్పు రానుంది.

జన్యు ఉత్పరివర్తనలు(మ్యుటేషన్స్‌), వ్యక్తీకరణలు(ఎక్స్‌ప్రెషన్స్‌), నకలు సంఖ్య వైవిధ్యం(కాపీ నంబర్‌ వేరియేషన్‌), జన్యు వ్యక్తీకరణను మార్చటం ద్వారా జీవ సంబంధ నెట్‌వర్క్‌లో వచ్చే కదలికలు తదితర డేటా కలిగిన మోడల్‌ ఆధారంగా పనిచేసేలా పివోట్‌కు డిజైన్‌ చేశారు. క్యాన్సర్‌ అనేది ఒక సంక్లిష్టమైన వ్యాధి కాబట్టి అందరికీ ఒకే ట్రీట్మెంట్‌ చేయటం కుదరదు. ఈ రోజుల్లో క్యాన్సర్‌ చికిత్సా విధానం ఒక్కో పేషెంట్‌కి ఒక్కో విధంగా రూపుమారుతున్న నేపథ్యంలో ఇలాంటి పరికరాలు మరింత ప్రయోజకరంగా ఉంటాయని ఐఐటీ-మద్రాస్‌కి చెందిన డాక్టర్‌ కార్తీక్‌ రామన్‌ పేర్కొన్నారు.

ఈ టూల్‌ క్యాన్సర్‌ కారక జన్యువులను రెండు రకాలుగా విభజిస్తుంది. 1. ట్యూమర్‌ సప్రెసర్‌ జీన్స్‌ 2. ఆంకోజీన్స్‌ లేదా న్యూట్రల్‌ జీన్స్‌. ఈ రెండు రకాల జన్యువుల్లో ఏదైనా ఒక దానిలో కణాలు అడ్డూ అదుపు లేకుండా పెరగటం వల్లే క్యాన్సర్‌ వస్తుంది. అంతేతప్ప అన్ని మ్యుటేషన్లూ క్యాన్సర్‌కి దారితీయవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్‌ చికిత్సలు మనిషి ఆరోగ్యం మొత్తాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. ఇకపై అలా కాకుండా ఏ శరీర భాగంలో అయితే కణాలు డెవలప్‌ అవుతున్నాయో అక్కడ మాత్రమే పనిచేసే మందులను, థెరపీని అభివృద్ధి చేసేందుకు పివోట్ దోహదపడుతుంది.

ఇప్పటికే గుర్తించిన క్యాన్సర్‌ కారక టీపీ53, పీఐకే3సీఏ జన్యువులతోపాటు పీఆర్‌కేసీఏ, ఎస్‌ఓఎక్స్‌9, పీఎస్‌ఎండీ4 వంటి కొత్త జన్యువులను కూడా పివోట్‌ పరికరం గుర్తించగలదు. ఏఐ సాయంతో బ్రెస్ట్‌ ఇన్‌వాసివ్‌ కార్సినోమా, కోలన్‌ అడెనోకార్సినోమా, లంగ్ అడెనోకార్సినోమా వంటి మూడు రకాల క్యాన్సర్‌లను గుర్తించగలిగే మోడళ్లను పరిశోధకులు డెవలప్‌ చేశారు. మరిన్ని రకాల క్యాన్సర్‌లను కనుగొనేందుకు వీలుగా పివోట్‌ను విస్తరించాలని సైంటిస్టుల టీమ్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.