Apple Kukatpally: టెక్ దిగ్గజం ఆపిల్ హైదరాబాద్‌లో తన తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 10, గురువారం కూకట్‌పల్లిలోని లేక్ షోర్-వై జంక్షన్ మాల్లో ఆపిల్ కూకట్పల్లి (Apple Kukatpally) స్టోర్ అందుబాటులోకి రానుంది. ఇది భారత్‌లో ఆపిల్‌కు ఏడో అధికారిక రిటైల్ స్టోర్. ఈ స్టోర్ ప్రారంభానికి ముందే ఆపిల్ ప్రత్యేకమైన బ్యారికేడ్ డిజైన్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ గుర్తింపును ప్రతిబింబించేలా ముత్యాల స్ఫూర్తితో రూపొందించిన ఆపిల్ లోగోను ఇందులో ఏర్పాటు చేసింది. ఇరిడెసెంట్ రంగులతో ఈ డిజైన్ ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ముత్యాల దిగుమతి, శుద్ధి, ఎగుమతులకు హైదరాబాద్‌కు ఉన్న చారిత్రక గుర్తింపును ఇది చాటిచెబుతోంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఆపిల్‌కు పరిశోధన, అభివృద్ధి (R&D), రిటైల్ కస్టమర్ కేర్ కార్యకలాపాలు ఉన్నాయి. కొత్త స్టోర్‌తో నగరంలో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. త్వరలో ఓపెన్ కాబోయే ఈ స్టోర్‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ సహా కంపెనీ పూర్తి ఉత్పత్తుల శ్రేణి అందుబాటులో ఉండనుంది. కస్టమర్లకు ప్రత్యేక నిపుణుల ద్వారా ఉత్పత్తుల వివరాలు, సాంకేతిక సహాయం అందించనున్నారు. అలాగే వ్యాపార వినియోగదారుల కోసం ప్రత్యేక బృందం కూడా సేవలందిస్తుంది. ప్రతిరోజూ ఉచితంగా నిర్వహించే ‘Today at Apple’ సెషన్లు ఈ స్టోర్ ప్రత్యేకతగా నిలవనున్నాయి. వీటిలో ఆపిల్ పరికరాల వినియోగం, ఫొటోగ్రఫీ, వీడియో ప్రొడక్షన్, డిజిటల్ ఇలస్ట్రేషన్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
ప్రస్తుతం భారత్‌లో ఆపిల్‌కు ఆరు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ముంబైలో Apple BKC, Apple Borivali, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో Apple Saket, Apple Noida, బెంగళూరులో Apple Hebbal, పుణేలో Apple Koregaon Park స్టోర్లు ఉన్నాయి. వీటికి తాజాగా హైదరాబాద్‌లోని Apple Kukatpally ఏడో స్టోర్‌గా చేరనుంది. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆపిల్ ప్రత్యేక డిజిటల్ వాల్పేపర్లు, స్టిక్కర్లు, హైదరాబాద్ స్థానిక సంగీత సంస్కృతిని ప్రతిబింబించే Apple Music ప్లేలిస్ట్‌ను కూడా విడుదల చేసింది. వీటిని కంపెనీ ప్రత్యేక వెబ్‌పేజీలో పొందవచ్చు.

