Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్

Anthropic Ai

Anthropic Ai

Anthropic: ఫ్యాక్టరీలు లేవు, వేల కొద్దీ స్టోర్లు లేవు.. అయినా సరే కేవలం ఐదేళ్లలోనే సుమారు రూ.140 లక్షల కోట్ల విలువైన కంపెనీగా ఆంత్రోపిక్ (ఆంత్రోపిక్) ఎదిగింది. ఇప్పటివరకు ఏఐ ప్రపంచంలో ఎక్కడ చూసినా ChatGPT, OpenAI గురించే మాటలు వినిపించేవి, కానీ ఇప్పుడు మరో కంపెనీ మొత్తం టెక్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుంది. 2021లో మొదలైన ఆంత్రోపిక్, నవంబర్ 19, 2026న చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకదాని ద్వారా 81.3 బిలియన్ డాలర్లు (billion dollars) సేకరించి, దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్ల (trillion dollars) వాల్యుయేషన్ (valuation) స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం క్లౌడ్ ఏఐ (Claude AI). కంపెనీలు ఇప్పుడు దీన్ని కేవలం ప్రశ్నలు అడగడానికి మాత్రమే కాకుండా, తమ పనులను పూర్తి చేయించుకోవడానికి కూడా వాడుతున్నాయి.

కొన్నేళ్ల క్రితం వరకు ఒక ఏఐ చాట్‌బాట్ (chatbot) తయారు చేసే కొత్త కంపెనీ ఇంత వేగంగా ప్రపంచంలోని టాప్ వాల్యుయేషన్ కంపెనీల రేసులోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీని స్థాపించిన వాళ్లు గతంలో OpenAIలోనే పని చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం కచ్చితంగా అర్థం చేసుకోవాలి. 1.5 ట్రిలియన్ డాలర్లు అనేది మార్కెట్‌లో కంపెనీకి నిర్ణయించిన విలువ అంటే వాల్యుయేషన్ మాత్రమే. అంత డబ్బు కంపెనీ దగ్గర ఉందని లేదా అంత ఆదాయం (revenue) వచ్చేసిందని దీని అర్థం కాదు. అలాగే ఆంత్రోపిక్ పాత, పెద్ద కంపెనీలన్నింటినీ దాటేసిందని చెప్పడం కూడా సరికాదు. కానీ ఇంత తక్కువ కాలంలోనే ఈ స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయమే.

ఇక, ఆంత్రోపిక్ మే 2021లో ప్రారంభమైంది. డారియో అమోడీ, డానియెలా అమోడీ, ఏఐ రీసెర్చ్ (AI research)కు చెందిన ఇతర నిపుణులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. డారియో, డానియెలా ఇంతకుముందు OpenAIతో కలిసి పని చేశారు. శక్తివంతంగా ఉండటంతో పాటు సురక్షితం, నమ్మదగినదిగా ఉండే ఏఐ సిస్టమ్స్ (AI systems) రూపొందించాలనే పెద్ద ఆలోచనతో ఈ కంపెనీ పుట్టింది. ఆంత్రోపిక్ తనను తాను కేవలం మరో టెక్ కంపెనీగా పరిచయం చేసుకోలేదు. ఏఐ పరిశోధన, భద్రత, మనుషులు చేసే వివిధ పనులకు ఉపయోగపడే మోడల్స్ తయారు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇదే ఆలోచనతో మార్చి 2023లో Claude అనే ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది నేరుగా ChatGPT లాంటి ఏఐ టూల్స్ (AI tools) కు పోటీగా నిలిచింది. మొదట్లో ఆంత్రోపిక్ దగ్గర గూగుల్ లాంటి భారీ టెక్ వ్యవస్థ గానీ, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కస్టమర్ రీచ్ గానీ లేవు. కానీ ఏఐ రీసెర్చ్ చేసే అనుభవజ్ఞులైన టీమ్ (team) ఉంది. అదే దానికి అతిపెద్ద బలంగా మారింది. ఇదే పట్టుదలతో సంస్థ ఎదిగింది.