AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!

  • వర్చువల్ ఇంటర్వ్యూలలో పెరుగుతున్న AI మోసాలు
  • హిడెన్ ట్యాబ్స్, వాయిస్ క్లోనింగ్‌తో ఉద్యోగాల వేట
  • అభ్యర్థుల ట్రిక్స్‌ను ఈజీగా పసిగడుతున్న కంపెనీలు
  • లైవ్ కేస్ స్టడీస్, క్రాస్ వెరిఫికేషన్‌తో కొత్త రూల్స్
Ai

Ai

కరోనా మహమ్మారి తర్వాత ఐటీ , కార్పొరేట్ రంగాలలో వర్చువల్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొనే ఉద్యోగాలు సాధించే ఈ పద్ధతి అభ్యర్థులకు ఎంత వీలుకల్పించిందో, అంతే స్థాయిలో మోసాలకు కూడా దారితీస్తోంది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ ఇంటర్వ్యూలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువైంది. అభ్యర్థులు తమ సొంత నైపుణ్యాలతో కాకుండా, టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు కొట్టేయాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రాక్సీ , ఫేక్ అభ్యర్థులకు చెక్ పెట్టడానికి ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు తమ ఇంటర్వ్యూ విధానాలనే పూర్తిగా మార్చేస్తున్నాయి.

ఆన్‌లైన్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు స్క్రీన్ వెనుక హిడెన్ బ్రౌజర్ ట్యాబ్స్ ఓపెన్ చేయడం, ఏఐ ప్రాంప్ట్స్ ద్వారా రియల్ టైమ్‌లో సమాధానాలు వెతకడం, ఆఖరికి వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి వేరొకరితో ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటి ఖతర్నాక్ మోసాలు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఇంటర్వ్యూ ప్యానల్స్ ఈ ట్రిక్స్‌ను చాలా ఈజీగా పసిగడుతున్నాయి. అభ్యర్థులు సమాధానాలు చెప్పేటప్పుడు స్క్రీన్‌పై వారి కళ్ల కదలికలు, ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవ్వడానికి తీసుకునే గ్యాప్, మాట్లాడేటప్పుడు సహజత్వం లేకపోవడం , రోబోలా యాంత్రికంగా సమాధానాలు చెప్పడం వంటి లక్షణాల ద్వారా వారు ఏఐ లేదా వేరే సహాయం తీసుకుంటున్నారనే విషయాన్ని ఇంటర్వ్యూవర్లు కనిపెట్టేస్తున్నారు.

ఇలాంటి నకిలీ అభ్యర్థులను ప్రాథమిక దశలోనే ఫిల్టర్ చేయడానికి డెలాయిట్, డాయిష్ బ్యాంక్, స్కేలర్ వంటి ప్రముఖ గ్లోబల్ ఆర్గనైజేషన్లు ఇప్పుడు సరికొత్త, కఠినమైన మూల్యాంకన విధానాలను అమలు చేస్తున్నాయి. కేవలం రొటీన్ ప్రశ్నలు అడిగితే ఏఐ టూల్స్ సాయంతో సమాధానం చెప్పేస్తారనే ఉద్దేశంతో, ఇప్పుడు కంపెనీలు అభ్యర్థులకు నేరుగా డెఫినేషన్లు అడగకుండా ఒక కంపెనీకి సంబంధించిన లైవ్ కేస్ స్టడీని ఇచ్చి, దానిపై లోతైన విశ్లేషణ చేయమని అడుగుతున్నాయి. దీనివల్ల అభ్యర్థికి ఉన్న నిజమైన నిర్ణయాధికారం బయటపడుతుంది. అలాగే అస్పష్టమైన లేదా క్లిష్టమైన పరిస్థితులను సృష్టించి, ఆ టైంలో అభ్యర్థి ఎలా స్పందిస్తారో లైవ్‌లోనే సిములేషన్స్ ద్వారా పరీక్షరిస్తున్నారు. దీనికి ఇన్‌స్టంట్‌గా ఆలోచించే తెలివితేటలు కావాలి తప్ప ఏఐ టూల్స్ పనికిరావు. దీనితో పాటు అభ్యర్థి నైపుణ్యాలను ఒకే రౌండ్‌తో తేల్చేయకుండా, వేర్వేరు విభాగాలకు చెందిన నిపుణులతో పదేపదే క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నారు.

ఈ మార్పులన్నింటినీ గమనిస్తే అభ్యర్థులు ఎంత అడ్వాన్స్‌డ్ సాంకేతికతను వాడి కంపెనీలను బురిడీ కొట్టించాలని చూసినా, అంతిమంగా మనిషికి ఉండే సహజ ప్రతిభ, సృజనాత్మకత , సామర్థ్యాన్ని పరీక్షించే దిశగానే కంపెనీలు తమ ఇంటర్వ్యూ ఫార్మాట్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాయని స్పష్టమవుతోంది. కాబట్టి, టెక్నాలజీని షార్ట్‌కట్‌గా వాడుకుని ఉద్యోగం సాధించాలనుకోవడం కంటే, సొంత నైపుణ్యాలను పెంచుకోవడమే నిరుద్యోగులకు లాంగ్ రన్‌లో సహాయపడుతుంది.