NTV Telugu Site icon

YSR : వైఎస్ఆర్, జగన్ ఇద్దరిలో రక్తం ఒకటే అయినా.. పాలనలో ఎవరి ముద్ర వారిదే

Ysr Congress

Ysr Congress

నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్.

ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి కూడా చేశామని అంటున్నారు జగన్. ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీగా తలెత్తుకుని ఎన్నికలకు వెళ్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల విషయంలో తండ్రి మాదిరిగానే సంతృప్త స్థాయిని ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలిచ్చారు జగన్. అక్కడక్కడ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య తగ్గించాల్సి వచ్చినా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

వైఎస్ జగన్ పాలన ప్రారంభమై మూడేళ్లవుతున్న సందర్భమిది. ఈ మూడేళ్లలో రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడించింది. భారతదేశంతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు అతాలకుతలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు మరవక ముఖ్యమంత్రి జగన్ వేసిన అడుగులు సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలిచాయి.

అనుభవం లేదు.. ఏం పాలిస్తాడులే అన్న అనుమానాల మధ్య జగన్ పాలన మొదలైంది. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తన మాటే శాసనంగా అమలు చేస్తున్నారు. స్కీములతో ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకునే వ్యూహరచన , జగన్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందనే వాదన ఉంది. ఎవరి మాటా వినరనే విమర్శలున్నా.. అవి రాజకీయంగా నష్టం కలిగించే స్థాయిలో లేవని వరుస ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయనే భావన వైసీపీలో ఉంది. కొత్తతరాన్ని ప్రోత్సహించడంలో జగన్ వైఎస్ ను ఫాలో అవుతున్నారు. కొత్త పార్టీ పెట్టినప్పుడు అనివార్యంగా కొత్త తరాన్ని తీసుకొచ్చినా.. ఆ తర్వాత పదవుల పందేరంలో కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. పనిలోపనిగా సామాజిక న్యాయం పాటిస్తున్నారు.

ఎవరికి ఏ పదవి ఇచ్చినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా జగన్ నిర్ణయాలు ఉంటాయి. ఎమ్మెల్యేలకు డైరక్టుగా వార్నింగ్ ఇచ్చినా. మంత్రులకు ముందే పదవీకాలం ఫిక్స్ చేసినా.. ఇవన్నీ నాయకత్వానికి సూచికలే అనేవాళ్లూ ఉన్నారు. ఇక వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ పేరుతో గ్రామ స్వరాజ్యం సాకారమైందని వైసీపీ ఢంకా బజాయిస్తోంది. ప్రస్తుతానికి పథకాల అమల్లో వీళ్లు కీలకంగా ఉన్నా.. భవిష్యత్తులో బూత్ మేనేజ్ మెంట్ కూ పనికొస్తారనే వ్యూహం ఉంది.

సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్. కరోనా సమయంలో ఆ ఫలితాలు కొంతమేర కనిపించాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో.. పేదలంతా అండగా ఉంటారని ఆశిస్తున్నారు జగన్. మూడేళ్లలోనే 30 ఏళ్ల సమాజ అభ్యుదయానికి పునాదులు వేశామని చెబుతున్న జగన్.. ఎన్నికల్లో 175 సీట్లూ గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.

సీఎంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. అందులో ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ వ్యహాలు ఉంటున్నాయి. జిల్లాల పునర్విభజన అయినా.. కొత్త స్కీమ్ అయినా.. కొత్త ఆలోచన అయినా.. వైసీపీ ఓటుబ్యాంకు సుస్థిరం చేయడమే జగన్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో.. క్యాడర్ కు కూడా జగన్ పై గురి కుదరింది. సీనియర్లు కూడా జగన్ రాజకీయ వ్యూహకర్తగా రాణిస్తున్నారనే అభిప్రాయానికి వచ్చారు. ఓవైపు వైసీపీని బలోపేతం చేసుకుంటూనే ప్రతిపక్షం బలపడకుండా ద్విముఖ వ్యూహం అమలుచేశారు జగన్. కేసులు, కుటుంబ వివాదాల పేరుతో ఎన్ని ఆరోపణలొచ్చినా.. ప్రజల దృష్టి పథకాలపై నుంచి మరలకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఆర్థిక ఇబ్బందులున్న తరుణంలో.. కేంద్రంతో సత్సంబధాలు మెయింటైన్ చేస్తున్నారు. అంశాల వారీ మద్దతు ఇస్తూ.. తానా అంటే తందానా అనే పార్టీ కాదనే సంకేతం కూడా ఇచ్చారు.

జగన్ కొన్ని విషయాల్లో తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేల్ని లాక్కున్నా.. తాను మాత్రం ఆ పని చేయనన్నారు. సొంత పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చినా పదవికి రాజీనామా చేస్తేనే చేరిక అని స్పష్టంగా చెప్పేశారు జగన్. ఎన్నికల్లో గెలుపు కోసం అలవిమాలిన వాగ్దానాలు చేసేది లేదన్న మాటకు కూడా కట్టుబడ్డారు. సీఎం అయ్యాక కూడా ఎన్ని సంక్లిష్ట సమస్యలు వచ్చినా.. ధైర్యంగా ఫేస్ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ, ఇసుక సంక్షోభం, రాజధాని వివాదం లాంటి అంశాల్లో ఇబ్బంది ఎదురైనా.. తొణక్కుండా పార్టీని సేఫ్ ల్యాండింగ్ చేయగలిగారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడకుండా.. వాటినే తన ట్రాప్ లో వేయడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రోజురోజుకూ రాజకీయంగా రాటుదేలుతున్న జగన్.. 30 ఏళ్ల దాక పాలన సుస్థిరం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నారు.

కాంగ్రెస్ సీఎంగా ఉన్న వైఎస్.. పాలనలో తన సొంత ముద్ర వేశారు. ఢిల్లీలో అధిష్ఠానం ఉన్నా.. వైఎస్ మాటిస్తే అయిపోతుందనే భరోసాను అనుచరులకు ఇవ్వగలిగారు. జలయజ్ఞం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా కవరయ్యేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకున్నారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయడంతో.. 2- 3 పథకాలతోనే మంచి పేరు వచ్చింది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు కూడా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పొలిటికల్ గా ట్యాకిల్ చేశారు. రాజకీయంగా తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. అందరితో చర్చంచడం వైఎస్ క అలవాటు. మెజార్టీ అభిప్రాయం మేరకే వెళ్లేవారు. ప్రజాదర్బార్ తో ఎప్పటికప్పుడ జనం నాడిని కూడా అంచనా వేసే వ్యూహం ఉంది.

అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే.. తనవైన అభిప్రాయాల విషయంలో రాజీ ఉండదని చేసి చూపించారు వైఎస్. ఒక్కోసారి ఢిల్లీ నుంచి కూడ బడ్జెట్ విషయంలో హెచ్చరికలు వచ్చినా.. పట్టించుకోలేదు. వైఎస్ బతికున్నప్పటి కంటే చనిపోయాకే ఆయన లేని లోటు కాంగ్రెస్ కు బాగా తెలిసింది. ఆయన ఉంటే విభజన జరిగేది కాదని నమ్మేవాళ్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నరనే వాదన ఇప్పటికీ ఉంది. రాజకీయ ప్రత్యర్థులు కూడా వైఎస్ ను ఆచితూచి విమర్శించాల్సి వచ్చేది. వైఎస్ పాలనపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. అవి జనంలోకి వెళ్లలేదు. ప్రతిపక్షాల కంటే వైఎస్ మాటల్నే ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో దశాబ్దాలు నలిగిన వైఎస్ కు.. ఎలాంటి నేతనైనా ఇట్టే కలుపుకుపోయేవారు. ప్రతిపక్ష పార్టీల ఓటుబ్యాంక్ ను కూడా ఆయన కాంగ్రెస్ వైపు మళ్లించగలిగారు. ఈజీ యాక్సెస్, చెప్పింది చేస తత్వం, మాటిస్తే తప్పకపోవటం లాంటి లక్షణాలు వైఎస్ ను విభిన్నవర్గాలకు చేరువ చేశాయి. పార్టీలకు అతీతంగా ఎవరికైనా అపాయింట్ మెంట్లు ఇచ్చే వ్యవహారశైలి కూడా కలిసొచ్చింది.

సీఎం అయ్యేందుకు పాదయాత్ర చేసిన వైఎస్.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ పై ఫ్యాక్షనిస్టు ముద్ర వేయాలనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించలేదు. తనను తాను మానవతావాదిగా ప్రజలకు పరిచయం చేసుకున్నారు వైఎస్. అట్టడుగు వర్గాలకు అభ్యున్నతి కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకునే లక్షణం వైఎస్ కు ఉంది. తాను ఎంత గట్టిగా నమ్మిన విషయమైనా.. ఇప్పుడు పనికిరాదు అనుకున్నప్పుడు పక్కన పెట్టడానికి మొహమాటపడకపోవడం ఆయన స్వభావం. పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడే సలహాలు చిన్న స్థాయి కార్యకర్త ఇచ్చినా తీసుకునే నైజం ఉంది. ఇవన్నీ ఆయన రాజకీయ విజయాలకు కారణమయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వైఎస్, జగన్ ఇద్దరూ సీఎంలుగా చేసినా.. అప్పటి, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఇద్దరు నేతల రక్తం ఒకటే అయినా స్వభావాల్లో తేడా ఉంది. అయితే సంక్షేమం విషయంలో మాత్రం ఇద్దరికీ పోలికలున్నాయి.

వైఎస్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం. అన్నింటికీ పైన అధిష్ఠానం ఉండేది. జగన్ విడిపోయిన ఏపీకి సీఎం. సొంతంగా వైసీపీ స్థాపించారు. పార్టీకి ఆయనే అధినేత. ఆయనకు ఎదురుచెప్పే పరిస్థితి లేదు. ఇద్దరు నేతలు ఫేస్ చేసిన పరిస్థితులు వేరు. ఎవరి వ్యూహాలు వాళ్లు రచిస్తూ ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించారు. ఎదురుదెబ్బలు తగిలినా వెన్ను చూపకుండా పోరాటం చేసిన చరిత్ర ఇద్దరికీ ఉంది.

సంక్షేమానికి వైఎస్ , జగన్ ఇద్దరూ ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్ని ఫోకస్ చేసి స్కీములు తెచ్చారు. జగన్ సంక్షేమం విషయంలో మరో నాలుగు అడుగులు ముందుకేశారనే చెప్పాలి. వైఎస్ కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్ మాత్రం దూకుడుగా ముందుకెళ్తారు. వైఎస్ దగ్గర ఎక్కువ మంది నేతలకు ఏదైనా చెప్పే చనువు ఉంటుంది. కానీ జగన్ దగ్గర అలాంటి పరిస్థితి ఉండదు. జగన్ కు ఎదురుచెప్పడానికి సీనియర్లు కూడా సంశయించే పరిస్థితి. వైఎస్ సీఎం అయినా.. ఆయనకు పార్టీ పరంగా పరిమితులున్నాయి. జగన్ కు అవిలేవు కాబట్టి కొన్ని అనూహ్య నిర్ణయాలు, వినూత్న ఆలోచనలు వస్తున్నాయి. వైఎస్ కు ఢిల్లీలో సొంత పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి.. నిధులకు ఇబ్బంది లేదు. జగన్ కు ఆ సౌకర్యం లేదు. వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నా.. రావాల్సిన నిధుల్ని సజావుగా రాబట్టుకోవడంలో తనదైన వ్యూహంతో వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రంలో బ్రేకులు పడ్డ ప్రాజెక్టులు కూడా తామ కదిలించామని చెప్పుకుంటున్నారు జగన్. ఎవరి గురించి పట్టించుకోకుండా.. నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ముంచినా.. తేల్చినా జగనే అని ప్రజలు అనుకోవాలనే భావన కూడా ఉండొచ్చు.

వైఎస్ ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. రాజధాని అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. జలయజ్ఞాన్ని, వైఎస్ ను వేరు చేసి చూడలేం. అలాగే హైదరాబాద్ లో ఓఆర్‌ఆర్, హైటెక్ సిటీ విస్తరణ, శంషాబాద్ ఎయిర పోర్ట్, మెట్రో లాంటి ప్రాజెక్టులు కూడా వైఎస్ హయాంలోనే పట్టాలెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ కుటుంబంగా ఉన్న వైఎస్ ఫ్యామిలీలో తండ్రీకొడుకుల పాలన మధ్య పోలిక రావడం సహజమే. అయితే పోల్చడం కరెక్ట్ కాదని, ఎవరి పాత్ర వాళ్లు సజావుగా నిర్వహించారనే వాదన లేకపోలేదు.