Site icon NTV Telugu

StoryBoard: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతోందా..?

Storyboard

Storyboard

StoryBoard: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయంతో.. దేశం మొత్తం ఇటువైపు తిరిగి చూస్తోంది. ఇప్పిటకే బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలన్న జాతీయ స్థాయి డిమాండ్ కు.. ఇక్కడ మన్నన దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, కేంద్రం కూడా బీసీల లెక్కలు తీసి.. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లివ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక వచ్చేదాకా బీసీలకు అసలు రిజర్వేషన్లే లేవని, ఆ తర్వాత కూడా బీసీల్లో ఉన్న అన్ని కులాలకూ రిజర్వేషన్ ఫలాలు అందలేదనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం కేంద్రం జనగణనతో పాటు కులగణనకు అంగీకరించడంతో.. బీసీల లెక్కలు బయటికొస్తాయనే ఆశాభావం వ్యక్తమౌతోంది. ఒక్కసారి బీసీల జనాభా ఎంతో స్పష్టత వస్తే.. అందుకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచక తప్పదని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో పార్టీలన్నీ బీసీ జపం ఎత్తుకున్నాయని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో బీసీ అంశం ప్రధాన అజెండా అవుతుందని బీసీ సంఘాలు నమ్ముతున్నాయి.

దేశంలో స్వాతంత్ర్యం ముందు నుంచీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత కూడా అవే అమలయ్యాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలు తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన వ్యక్తం చేశాయి. అలాగే తమకూ రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ వచ్చింది. తమ జనాభా ఎక్కువగా ఉన్నా.. అసలు రిజర్వేషన్ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామనే వాదన వినిపించింది. దీంతో కేంద్రం బీసీల స్థితిగతుల్ని తేల్చడానికి మండల్ కమిషన్ వేసింది. మండల్ కమిషన్ నివేదికతో బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 27 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.

మండల్ కమిషన్ నివేదిక ఇచ్చి మూడున్నర దశాబ్దాలు దాటింది. బీసీ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సమయంలో కూడా.. అవే రిజర్వేషన్ల అమలు సబబు కాదని దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాయి. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు సముచిత రీతిలో రిజర్వేషన్లు ఉండాలనే ప్రతిపాదన బలం పుంజుకుంది. ఆయా రాష్ట్రాల్లో బీసీ సంఘాల ఒత్తిడి ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయిలో కులగణన ప్రయత్నాలు, బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి. కొన్నాళ్ల క్రితం బీహార్లో బీసీ కులగణన డేటాను పట్నా హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేంద్రం జనగణనలో భాగంగా చేస్తేనే దానికి విలువ ఉంటుందని, లేకపోతే కోర్టులు కొట్టేస్తాయనే అభిప్రాయాలు వచ్చాయి. అలాగే కులగణన ఎలా చేయాలనే అయోమయంలో మరే రాష్ట్రమూ ముందడుగు వేయటానికి సాహసించలేదు. కానీ గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని, నిపుణులతో సంప్రదించి.. వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి.. తెలంగాణ సర్కారు సమగ్ర కులగణన చేసింది. దాదాపుగా 56 రకాల ప్రశ్నలతో రూపొందిన సమగ్ర ప్రశ్నావళికి.. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా చేయడం.. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టడంతో బీసీ జనాభాపై క్లారిటీ వచ్చింది. ఈ కులగణన జరిగిన తీరు దేశానికే ఆదర్శమంటున్న రేవంత్ ప్రభుత్వం.. దానిపై హస్తినలో కాంగ్రెస్ ఎంపీలందరికీ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా కులగణనకు తీసుకున్న ప్రాతిపదికలు, సర్వే జరిగిన తీరును సీఎం, డిప్యూటీ సీఎం సమగ్రంగా వివరించారు. న్యాయసమీక్షకు నిలబడేలా పక్కాగా డేటా తయారు చేశామని చెప్పారు. ఎవరు కోర్టుకు వెళ్లినా అభ్యంతరాలు నిలబడవనే ధీమా వ్యక్తం చేశారు. కులగణన విషయంలో తెలంగాణ సర్కారు ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ అభినందించారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా.. తన అంచనాలకు మించి పనిచేశారని కితాబిచ్చారు. దేశమంతా తెలంగాణ మోడల్ ను అనుసరించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాజ‌కీయాలు గ‌త కొన్నాళ్లుగా బీసీ రిజ‌ర్వేష‌న్ల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార ప‌క్షం కాంగ్రెస్‌.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చేందుకు రెడీ అయింది. అది కూడా స్థానిక సంస్థల ఎన్నిక‌ల నుంచే అమ‌లు చేయాల‌ని నిర్ణయించింది. కాంగ్రెస్ సర్కారు బీసీ రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధితో ఉంది. గత ఎన్నికల సమంయలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించింది. ఆ ప్రకారం కులగణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. వాటి ఆధారంగా ఓ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సిఫారసుల ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని తీర్మానం ఆమోదించింది.

మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందడుగు వేసిన తెలంగాణ సర్కారు.. కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో కొత్త ఆయుధాన్ని అందించింది. తెలంగాణలో కులగణన విజయవంతం అయ్యాకే.. కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పింది. అప్పటిదాకా కులగణన వీలుకాదనే వ్యాఖ్యానాలు చాలా వినిపించాయి. పైగా కొత్తగా కులాల లెక్కలు తీసి.. సామాజిక అశాంతి సృష్టిస్తారా అనే ఆందోళన కూడా వ్యక్తమైంది. కానీ కులాల లెక్కలు తేల్చకుండా దేశంలో సమగ్ర అభిృద్ధి సాధ్యం కాదన్న రాహుల్ వాదనను బలపరిచేలా.. రాష్ట్ర సర్కారు ముందుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమగ్ర కులగణన చేయగలవనే విషయం నిరూపించామంటోంది. ఈ లెక్కలు కేంద్రం తీసుకోకపోయినా.. సర్వే జరిగిన తీరు కచ్చితంగా ఉపయోగపడుతుందనే భావనతో ఉంది. అదే విషయాన్ని ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం గట్టిగా చెప్పారు. బీసీ రిజర్వేషన్ ను వివాదాల తేనెతుట్టెగా మార్చిన క్రమంలో.. ఆ సంక్లిష్టతను ఛేదించే దిశగా తెలంగాణ సర్కారు పనిచేయడం.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి జాతీయ స్థాయిలో తేలిపోయింది. ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ స్థానం.. అన్ని పార్టీలతో పాటే ఉంది. కానీ తెలంగాణ మోడల్ అమలు డిమాండ్ తర్వాత.. కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే రేసులో ముందుకెళ్లిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు అమలైతే.. ఇప్పటివరకు రాజకీయ అవకాశం దక్కని కులాలకు ఛాన్సివ్వాలని, వారి కోసం సబ్ కోటా పెట్టాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో చేసిన బీసీ కులగణన.. చివరకు దేశవ్యాప్త కులగణనకు దారితీసిందని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో తమ చిత్తశుద్ధిని ఇప్పటికే చాటుకున్నామంటున్న కాంగ్రెస్.. కొత్తగా తాము నిరూపించుకోవాల్సిందేమీ లేదని చెబుతోంది.

Exit mobile version