Site icon NTV Telugu

Story Board : హైదరాబాద్‌లో పబ్బులు, రిసార్టులు మాటున జరిగేదేంటి..?

Story

Story

Story Board : హైదరాబాద్ చుట్టూ డేంజర్ జోన్ ఏర్పడింది. సిటీ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌసులు, రిసార్టుల్లో తరచుగా డ్రగ్స్, రేవ్ పార్టీలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ బర్త్ డే పార్టీ రచ్చతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. వీటికి తోడుగా సిటీలో పబ్ కల్చర్ ఉండనే ఉంది. నగరం నిద్రపోతున్నవేళ జరిగే కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

 
Harish Rao : ఇది మార్పా రేవంత్ గారు..? హరీష్‌ రావు సెటైర్లు
 

హైదరాబాద్ మెట్రోసిటీ. ఇక్కడ పార్టీ కల్చర్ చాలా మామూలు విషయం. నార్మల్ పార్టీలతో ఎవరికీ నష్టం లేదు. అవి పెద్ద ఇష్యూ కూడా కాదు. కానీ పార్టీ కల్చర్ మరింత శృతిమించి డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల స్థాయికి చేరడమే సమస్యగా మారింది. ఇందుకోసం సిటీ చుట్టూ ఉన్న ఫామ్ హౌసులు, రిసార్టులను వాడుకోవడం కొత్త ట్రెండ్ గా మారింది. వీఐపీల దగ్గర్నుంచీ కాస్త డబ్బున్న వారిదాకా.. అందరూ ప్రతి చిన్న సందర్భాన్నీ సెలబ్రేట్ చేసుకోవటానికి పార్టీలే మార్గమని భావిస్తున్నారు. అంతవరకూ ఓకే. కానీ ఈ పార్టీల పేరుతో జరుగుతున్న తంతే.. నగరం నిద్రపోతున్నవేళ.. అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. చేవెళ్ల దగ్గర్లోని త్రిపుర రిసార్ట్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీని కూడా అందరూ మామూలు పార్టీ అనుకున్నారు. కానీ న్యూసెన్స్ గా ఉందనే ఫిర్యాదుతో అక్కడకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. విదేశీ మద్యం బాటిళ్లతో పాటు గంజాయి కూడా వాడుతున్నట్టు అనుమానించిన పోలీసులు.. కొందరికి డ్రగ్ టెస్టులు చేశారు. ఒకరికి పాజిటివ్ రావడంతో.. అది బర్త్ డే పార్టీ కాదు.. డ్రగ్స్ పార్టీ అని తేలిపోయింది. సాధారణ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి వాడాల్సిన అవసరమేంటని పోలీసులు ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ఎంతటివారికైనా లాఠీలు ఉపయోగించి బుద్ధి చెప్పాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు.

 

ఊరికే పార్టీ చేసుకుంటే ఏముంటుంది. కాస్త కిక్ కావాలంటే డ్రగ్స్ ఉండాల్సిందే అనుకుంటున్నారు. అలా పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలవుతున్నాయి. దేశీ లిక్కర్ వాడితే ప్రత్యేకత ఏముందని.. ఫారిన్ లిక్కర్ కు ఓటేస్తున్నారు. కానీ ఎక్సైజ్ శాఖ పర్మిషన్ మాత్రం తీసుకోవడం లేదు. దీంతో కేసులు బుక్కౌతున్నాయి. పార్టీ కిక్కు మరీ ఎక్కువైతే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పైగా పార్టీలు పురుషులు, స్త్రీలు కలిసి డాన్సులు చేయడం.. ఎంజాయ్ చేయడం ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి పార్టీలే శృతిమించి నేరాలు, ఘోరాలకు దారితీసిన ఘటనలు కూడా గతంలో జరిగాయి. అప్పుడు కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఎప్పటికప్పుడు కేసులైతే బుక్కౌతున్నాయి కానీ.. ఈ బ్యాడ్ పార్టీలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు.

అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ఫామ్ హౌసులు, రిసార్డులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇక్కడైతే ఎవరూ పెద్దగా పట్టించుకోరనే అంచనాతో ఉంటున్నారు. అలాగే కాసుల కక్కుర్తితో సిటీకి దూరంగా ఉన్న రిసార్టులు, ఫామ్ హౌసుల మేనేజర్లు కూడా ఇలాంటి పార్టీలకు సహకరిస్తున్నారు. ఏదోలా బిజినెస్ జరుగుతుంది కదా అనే ఆలోచనలో వారుంటున్నారు. ఇలా ఒకరి అవసరం, మరొకరి వ్యాపారం కలిసి ఉభయకుశలోపరిగా బ్యాడ్ పార్టీ కల్చర్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఈ పార్టీల టైమింగ్స్ ను బట్టి కూడా అవే పార్టీలో ఇట్టే చెప్పేయొచ్చనే వాదన కూడా ఉంది. సాయంత్రం ఆరు దాటితే ఓ మాదిరి పార్టీలు.. రాత్రి 8 తర్వాత లిక్కర్ పార్టీలు.. రాత్రి 10 దాటితే డ్రగ్స్ పార్టీలని ఫిక్స్ చేయొచ్చని చెబుతున్నారు. అలాగే మిడ్ నైట్ పార్టీ అన్నారంటే.. కచ్చితంగా రేవ్ పార్టీ అని ఊహించుకోవచ్చని అంటున్నారు. ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చే పార్టీలు కొన్నే. కానీ మనీ కలెక్ట్ చేసి.. ప్లాన్ చేసి మరీ ఏర్పాటయ్యే పార్టీలకు లెక్కే లేదు. ఇలా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న బ్యాడ్ పార్టీలు.. అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నాయి. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవటానికి రిసార్టులు, ఫామ్ హౌసులు కూడా బ్యాడ్ పార్టీలకు సెపరేట్ రేటు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీస్ ప్రాబ్లమ్ రాకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చే కొన్ని రిసార్టులు కూడా లేకపోలేదు. అయితే ఎంత జాగ్రత్తపడినా.. ఏదోరకంగా పోలీసులకు ఉప్పందుతోంది. అడ్డంగా బుక్కైపోతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంటోంది. కానీ కేసు బుక్కయ్యాకే అసలు కథ మొదలవుతోంది. కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలే కానీ.. రోజులు గడిచేకొద్దీ ఇలాంటి కేసులు నీరుగారిపోతున్నాయి. నిందితులు కూడా కొన్నిరోజుల కస్టడీ తర్వాత బెయిల్ పై విడుదలౌతున్నారు. అంతే కానీ బ్యాడ్ పార్టీ కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్న సందర్భాలు అరుదుగా ఉంటున్నాయి. దీంతో కేసులు బుక్కైనా.. ఏదోలా బయటపడొచ్చనే ధీమాతో రిసార్టులు, ఫామ్ హౌసుల్లో బ్యాడ్ పార్టీలకు బరితెగిస్తున్నారు.

ఎక్కువ పార్టీలు వీకెండ్ లోనే జరుగుతాయి. దీంతో వీకెండ్స్ లో బ్యాడ్ పార్టీలకు సహకరించే రిసార్టులు, ఫామ్ హౌసులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సిటీ శివారులో చాలావరకు ఫామ్ హౌసులు ఖాళీగానే ఉంటాయి. ఇదే అదనుగా వీటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. అసలు యజమానులు ఎక్కడో ఉండటంతో.. వారు ఇక్కడో వాచ్ మెన్ ను పెడతారు. అసలు యజమానుల పర్యవేక్షణ అంతగా లేకపోవడమే బ్యాడ్ పార్టీలకు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఫామ్ హౌస్ అయితే వాచ్ మెన్ ను, రిసార్ట్ అయితే మేనేజర్ ను మేనేజ్ చేస్తే చాలు. పార్టీ పేరుతో ఏం చేసినా అడిగేవాడుండడు. సిటీలో జరిగే పార్టీలు కొంతవరకు లిమిట్ లో ఉంటాయి. ఇక్కడ బాగా పలుకుబడి ఉన్నవారే బరితెగించే అవకాశం ఉంటుంది. కానీ రిసార్టులు, ఫామ్ హౌసుల్లో అలా ఉండదు. ఎక్కువమంది దృష్టిలో పడమనే ఉద్దేశంతోనే ఇక్కడ పార్టీలు పెడతారు. ఎవరూ గమనించడం లేదనే ధీమాతో.. ఇక్కడ అందరూ రెచ్చిపోతారు. ఏం చేసినా, ఎలా ఎంజాయ్ చేసినా ఎవరికీ తెలియదనే ఊహే.. వీరిని మత్తులో ముంచేస్తోంది. అడపాదడపా పోలీస్ కేసులు నమోదైనా.. చాలా వరకు పార్టీలు రహస్యంగానే జరుగుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియనంతగా బ్యాడ్ పార్టీల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే వీక్ అంతా పడ్డ స్ట్రెస్ కు.. ఇలాంటి పార్టీలే రిలీఫ్ ఇస్తాయని కూడా కొందరు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అసలు తాము అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నామనే స్పృహ కూడా చాలా మందికి ఉండటం లేదంటే నమ్మాల్సిందే.

Trump Gold Card: త్వరలో ట్రంప్ కార్డ్.. గోల్డ్‌ కార్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు

బ్యాడ్ పార్టీల్లో డ్రగ్స్ పార్టీలు ఓ రకమైతే.. ఇక రేవ్ పార్టీలు వీటన్నింటికీ పీక్స్. రేవ్ పార్టీల్లో ప్రధానం మ్యూజిక్, లైటింగ్. మిణుకుమిణుకు అంటూ.. వచ్చే లైట్లలో డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తారు. ఎలక్ట్రిక్ ట్రాన్స్ మ్యూజిక్, లైటింగ్, లేజర్ షోలు, ప్రొజెక్టెడ్ ఇమేజ్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లు, ఫాగ్ మెషీన్లు ఉంటాయి. రేవ్ పార్టీలో ఉపయోగించే.. డీజే సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ తీసుకుని.., అమ్మాయిలు, అబ్బాయిలు మ్యూజిక్ లో మునిగిపోతారు. ఇష్టం వచినట్టు డ్యాన్సులు చేస్తారు. రేవ్ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల వరకూ కూడా జరుగుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం.. చేస్తారు. వీళ్లు పార్టీ చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి.. కోడ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటారు. పోలీసులకు అనుమానం రాని ప్రదేశాలను ఎంపిక చేసుకుంటారు. ఫుడ్‌, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా.. కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్, ఎక్స్టసీ లాంటి డ్రగ్స్ కూడా ఉంటాయి. కొన్ని రేవ్ పార్టీలలో సెక్స్ కోసం రూమ్స్ కూడా ఉంటాయని చెబుతారు. రేవ్ పార్టీలను చాలా రహస్యంగా ఉంచుతారు. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి చాలా సేఫ్ ప్లేస్ గా భావిస్తారు.

వీకెండ్ విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోతోంది. మందు, చిందుతో యువత రెచ్చిపోతోంది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజా విసురుతోంది. భారీగా జీతాలు అందుకుంటూ.. వీకెండ్ లో రెండు రోజులు సరాదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి.. అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలామంది తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. ఇదివరకు రేవ్ పార్టీ అంటే.. అబ్బో అది పెద్దోళ్లకు సంబంధించిన వ్యవహారం అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా మారుతోంది. ఏదో ఎంజాయ్ చేయాలనే ఆరాటం యువతను ఒక్క దగ్గర నిల్చోనివ్వడం లేదు. దానికి తగ్గట్టుగా పెద్ద జీతాలు వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే మస్తీ మజా అనుకుంటూ లేనిపోని షోకులతో రేవ్ పార్టీ కల్చర్ కు అలవాటు పడుతున్నారు. రాత్రంతా మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి లేజర్ లైట్ల వెలుతురులో చిందేయడమే రేవ్ పార్టీ. ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే.. మందు, విందు, పొందు ఒకే దగ్గర లభించే వేదిక. డీజే సౌండ్స్, అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు ఆ తర్వాత సోయి లేకుండా బట్టలు విప్పేయడం.. అలా అలా శృంగార కార్యకలాపాలకు సిద్ధమవుతారు. అయితే రేవ్ పార్టీలకు వచ్చే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధపడే వస్తారు. హుక్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకున్నాక.. వాళ్లు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.

సిటీ కల్చర్ లో భాగంగా మొదలైన పార్టీ కల్చర్ కాస్తా.. డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల స్థాయికి చేరి.. విచ్చలవిడితనానికి బాటలు పరుస్తోంది. సమాజంలో అన్ని వర్గాలవారికీ ఈ బ్యాడ్ పార్టీ కల్చర్ పాకడం.. ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి పార్టీలపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే.. భవిష్యత్తులో హైదరాబాద్ చుట్టూ ఈ పోకడలు కామన్ గా మారే ప్రమాదం లేకపోలేదు.

 

 

 

Exit mobile version