ప్రజాస్వామ్య భారత్ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును లిఖించారు. ప్రభుత్వ అధినేతగా ఆయన పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న ఒకే ఒక్కడిగా రికార్డు సృష్టించారు. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగిన మోడీ శకం.. దేశానికి సరికొత్త రాజకీయాల్ని.. వినూత్న సంస్కరణల్ని ఏక కాలంలో పరిచయం చేసింది. సీఎంగా గుజరాత్ మోడల్‌కు రూపకల్పన చేసిన మోడీ.. పీఎంగా వియ్ విల్ డూ ఇట్ అంటున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం పెట్టుకున్న మోడీ.. ఆ దిశగా సేవ చేయడమే తన తక్షణ కర్తవ్యమని చెబుతున్నారు. సీఎంగా, పీఎంగా 25 ఏళ్ల నుంచి వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు మోడీ. ఒక వ్యక్తి రజతోత్సవ కాలం పాటు ప్రజల మన్ననలు పొందడం ఏమాత్రం చిన్న విషయం కాదు. రాష్ట్ర స్థాయి.. జాతీయ స్థాయి ఎక్కడ ఉన్నా.. ప్రజల విశ్వాసం చూరగొనడంలో మోడీ విజయం సాధించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైంది. ఈ పాతికేళ్ల ప్రయాణం ఆయనను గుజరాత్ నుండి ఢిల్లీకి చేర్చింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ రాష్ట్రం అదే ఏడాది సంభవించిన వినాశకరమైన కచ్ భూకంపం ప్రభావం నుండి కోలుకుంటోంది. పునర్నిర్మాణం, నీటి నిర్వహణ, సాగునీటి పారుదల, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. చెక్ డ్యామ్‌లు , నర్మదా కాలువ వ్యవస్థ విస్తరణ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చాయి.2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత మోడీ 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కాలంలో ఆయన హయాం గుజరాత్ మోడల్ తో గుర్తింపు పొందింది. ఈ విధానం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నీటిపారుదల, వేగవంతమైన నిర్ణయ ప్రక్రియలకు ప్రాధాన్యతనిచ్చింది.
భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీది ప్రత్యేకమైన ప్రయాణం. పార్టీ వ్యవస్థలో సంస్థాగత కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం.. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం మీదుగా దేశ ప్రధానమంత్రి పదవి వరకు సాగింది. ముఖ్యమంత్రిగా దాదాపు 13 ఏళ్లు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా వరుసగా మూడు పర్యాయాలు కొనసాగడం మోడీ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఎన్నికల ప్రచార వ్యూహం, బలమైన వ్యక్తిగత నాయకత్వం, సంక్షేమం, అభివృద్ధిని కలిపిన రాజకీయ నినాదాలు ఆయనను జాతీయ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా నిలిపాయి.
నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసులోనే ప్రజా, సామాజిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం, బీజేపీలో సంస్థాగత బాధ్యతలు ఆయన రాజకీయ ఎదుగుదలకు పునాది వేశాయి. పార్టీ కార్యకర్తగా, నిర్వాహకుడిగా పనిచేసిన అనుభవమే తర్వాత పరిపాలనా రాజకీయాల్లో ఆయనకు ఉపయోగపడింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్, వ్యవసాయం, పరిపాలనా సంస్కరణలను మోదీ తన పాలనకు ప్రధాన అంశాలుగా ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ మోడల్ పేరుతో అభివృద్ధి నమూనాను బీజేపీ జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసింది.
2013లో బీజేపీ మోడీని 2014 లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చింది. అప్పటివరకు ప్రధానంగా గుజరాత్ నాయకుడిగా ఉన్న ఆయన ఒక్కసారిగా జాతీయ రాజకీయాల కేంద్రబిందువుగా మారారు. దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం, అభివృద్ధి నినాదం, బలమైన నాయకత్వం అనే అంశాలతో ఎన్నికలకు వెళ్లారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీకి లోక్‌సభలో సొంత మెజారిటీ రావడం ఆ ఎన్నికల ప్రత్యేకత. 2014 మే 26న నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తొలి ఐదేళ్ల పాలన అనంతరం 2019లో మోడీ మరోసారి ప్రజాతీర్పును కోరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 2014 కంటే మరింత బలమైన ఫలితాన్ని సాధించింది. దీంతో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండో దఫా పాలనలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కూడా ఈ కాలంలో జాతీయ రాజకీయాల్లో ప్రధానాంశంగా నిలిచింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రాకపోయినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధించింది. దీంతో మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రిగా మోదీ పదవీకాలంలో స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలుగా నిలిచాయి.
ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ ప్రధాని మోడీ దేశప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త నినాదాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. 2047 నాటికి భారత్‌ను వికసిత భారత్ గా, ఆత్మనిర్భర భారత్‌గా మార్చడమే మన ప్రధాన లక్ష్యమని, దీనిని మనం సాధించి తీరుతామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మనం చేసి తీరుతాం.. We Will Do It అంటూ మోడీ కొత్త నినాదం ఇచ్చారు. తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఒక ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 ఏళ్లు సేవ చేసే అవకాశం వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని మోడీ చెప్పారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ప్రజల నిరంతర ఆశీస్సులే కారణమని, ఆ క్రెడిట్ అంతా ప్రజలకే దక్కుతుందని వినమ్రంగా చెప్పారు.
2001 అక్టోబర్ 7 నుంచి 2026 అక్టోబర్ 7 వరకు చూస్తే మోడీ ప్రయాణంలో ఒక ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రభుత్వాధినేత పాత్ర మధ్యలో విరామం లేకుండా ప్రధానమంత్రి పదవిలో కొనసాగింది. కేంద్ర మంత్రివర్గం ఆయన 25 ఏళ్ల నిరంతర నాయకత్వాన్ని గుర్తిస్తూ ప్రత్యేక తీర్మానం చేసింది. మొత్తం మీద నరేంద్ర మోడీ పాతికేళ్ల అధికార ప్రస్థానం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.
దేశంలో కేవలం పథకాలను నిర్వహించడం కంటే.. ప్రజలు, వ్యాపారాలు, అధికారులతో ప్రభుత్వం వ్యవహరించే పద్ధతినే పూర్తిగా మార్చేయడం పాలనలో అతి పెద్ద మార్పు కిందకు వస్తుంది. దీని వెనక ఉన్న సూత్రం చాలా సులభం. మనం అనుకున్న సరైన ఫలితాన్ని సాధించడం, దాని స్థాయిని అంచనా వేయడం, పెద్ద ఎత్తున దానిని విస్తరించడాన్ని మరింత సులభతరం చేయడం. మోడీ నమ్ముకున్న ప్రాథమిక పాలన సూత్రం ఇదే. ఈ ఏకైక సూత్రంతోనే ఆయన సుదీర్ఘకాలంగా దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు.
మోడీ పాలనా విధానంలో ప్రవేశపెట్టిన మార్పు ఏమిటంటే.. ప్రభుత్వం, పౌరులు, వ్యాపారవేత్తలు, అధికారుల మధ్య ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని సృష్టించడం. ఈ కొత్త విధానం పూర్తిగా జన్ విశ్వాస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఒకప్పుడు భారత భారీ జనాభాను పరిపాలనాపరమైన సవాలుగా మాత్రమే చూసేవారు.. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న సరికొత్త పాలనా వ్యవస్థ విభిన్నమైన అవకాశాలను అందిస్తోంది. డిజిటల్, సంస్థాగత వ్యవస్థలు సేవలనూ, మార్కెట్లనూ, అవకాశాలనూ ప్రజలందరికీ సమర్థంగా చేరవేసినప్పుడు.. ఆ భారీ పరిమాణమే దేశానికి అతిపెద్ద ప్రయోజనంగా మారుతుంది. ఈ పరిపాలనా నమూనా ఇప్పుడు కేవలం విధులను నిర్వహించే వ్యవస్థగా మాత్రమే లేదు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఆస్తిగా మారుతోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే క్రమంలో.. దేశానికున్న అత్యంత బలమైన వ్యూహాత్మక ప్రయోజనాల్లో ఒకటిగా ఈ నమూనా అవతరిస్తోంది.
తనను తాను చాయ్ వాలాగా ప్రజలకు పరిచయం చేసుకున్న మోడీ.. ఇప్పటివరకూ ఆ ఇమేజ్ నుంచి దూరం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం కూడా మోడీకి మేలు చేసింది. వీలైనప్పుడల్లా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే తీరు.. బహిరంగ సభల్లో నేరుగా ప్రజలతో మాట్లాడినట్టుగా ఉండే ప్రసంగాలు.. మోడీ భావాలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. మోడీ చెబుతున్న మాటలకు.. చేస్తున్న పనులకు పొంతన ఉంటోందన్న విషయం కూడా ప్రజలు గ్రహించేలా పాలన సాగుతోంది. హైవేల దగ్గర్నుంచి రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల దాకా భారత్ చాలా మారిందని మోడీ ప్రచారం చేస్తున్నారు. కావాలంటే గతంతో పోల్చి చూసుకోవాలని సవాల్ విసురుతున్నారు. ప్రజలు కూడా మార్పును గుర్తిస్తున్నారు. మెట్రో నగరాలపై మోడీ సర్కారు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కూడా మోడీకి మంచి పేరు తీసుకొస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, అవసరమైతే నిబంధనల సడలింపులు వంటివి మోడీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారనే దృష్టి కలగజేశాయి.మోడీ కారణంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందనే ప్రచారం బలంగా జరుగుతోంది. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతున్న పరిస్థితి ఉంది. మోడీ ప్రధానిగా ఉంటేనే.. భారత్ ప్రపంచ శక్తిగా ఉండగలదనే భావన బలపడేలా.. మోడీ సర్కారు కార్యాచరణ తీసుకుంటోంది.

