హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసాన్ని విశిష్ట మాసంగా చెబుతారు. అలాంటి కార్తీక మాసంలోనూ పౌర్ణమిని మరింత విశిష్టమైనదిగా ఎన్నో పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా ప్రతి పుణ్య తిథి వెనుకా ఒకటో రెండో ఐతిహ్యాలుంటాయి. కానీ కార్తీక పౌర్ణమితో ముడిపడి ఎన్నో పౌరాణిక ప్రత్యేక ఘట్టాలు ఉండటం.. సాక్షాత్తూ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా జరుపుకోవడం, అన్నింటికీ మించి.. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే.. ఏడాదంతా దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకమే.. కార్తీక పౌర్ణమికి ఎక్కడలేని విశిష్టతను తీసుకొస్తున్నాయి. కార్తిక మాసములో శుక్ల పక్షమునాడు వచ్చే తిథిని కార్తిక పౌర్ణమి అంటారు. కార్తిక పౌర్ణమి చాలా పవిత్రమైనది.కార్తిక పౌర్ణమి హరి హరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది.
కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లైతే, కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున కేదారీశ్వర వ్రతము చేసినట్లయితే అత్యంత శుభం చేకూరుతుంది. సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు కార్తిక పురాణ పుస్తకాలను పంచడం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు,కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తిక పురాణ వైశిష్ట్యాన్ని తెలిపే పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిదని చెబుతారు.
కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.ఆరోజు ఏ నది అందుబాటులో ఉంటే ప్రాతః కాలమున లేచి ఆ నదిలో స్నానం చేస్తే శుభం. ఒకవేళ మనం ఉండే ప్రాంతంలో నదులు ఏవీ దగ్గరలో లేనప్పుడు చెరువునందు గానీ, బావి దగ్గర గానీ, తలస్నానం చేయవచ్చని చెబుతారు. కార్తిక పౌర్ణమి నాడు శివ, విష్ణు దేవాలయాలు రెండింటిలో దీపాలు వెలిగిస్తారు. కార్తిక దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజ స్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ మట్టి ప్రమిదల్లో, ఆవు నెయ్యి తో తడిపిన వత్తి ఉసిరి కాయల మీద వేసి,బియ్యపు పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో చక్కగా అలంకరించాలి. శివాలయాల్లో ధ్వజ స్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణిలలో, కుండలు లోహ పాత్రలలో దీపాన్ని వెలిగించి వేలాడదీయాలి. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెట్టాలి. ఇలా చేయడం పుణ్యప్రదమే కాక, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మూడొందుల అరవై ఐదు వత్తులన్నీ కలిపి కార్తిక పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో వెలిగిస్తే సంవత్సర కాల పుణ్యాన్ని ఒకటేసారి పొందవచ్చు.
వైజ్ఞానిక పరంగా చూస్తే ఈ కార్తిక దీపాల వల్ల వచ్చే వెలుగు, గాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆవు నెయ్యితో వెలిగే దీపాల వల్ల వాయు శుద్ధి అవుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. అదీకాక, కార్తీక మాసం మొత్తo వాతావరణం చలిగా, తేమగా ఉంటుంది. గాలిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీపాలు వెలిగించడం వల్ల వాటి వేడికి క్రిమి కీటకాలు నశించడమే కాకుండా, చలి విరిగి నులివెచ్చదనంగా వాతావరణం మారుతుంది.
శివుడు త్రిపురాసురులను, వారి రాక్షస గణాలను పౌర్ణమి నాడు సంహరించాడు. అందువల్ల ఈ కార్తిక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణువులిద్దరూ కలిసి త్రిపురాసుడిని సంహరించారు కాబట్టి, అటు శివాలయాల్లో ఇటు విష్ణువాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు దైవ దర్శనం, దీపారాధన,సాలగ్రామ దానం, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే విశేష శుభ ఫలితాలు కలుగుతాయని కార్తిక పురాణంలో స్పష్టంగా ఉంది. అలాగే కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినం కార్తీకపౌర్ణమి ఈ రోజు శ్రీహరి మత్స్యరూపంలో అవతరించాడని ప్రతీతి. కార్తీక పౌర్ణమినాడు సాయంకాలం ప్రదోషవేళలో దీపాలను వెలిగించి దీపదర్శనం చేసుకోవాలి. జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలు పరిహరించబడి సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం. సర్వపాపపరిహారం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది.
కార్తీక మాసం నెలరోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్క రోజు 365 లేదా వెయ్యి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. స్వయంపాకం పితృప్రీత్యర్థం దానం చేస్తారు. కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే.. కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిదనే నమ్మకం కూడా ఉంది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
తులసి మొక్క జన్మించిన రోజుగా కూడా కార్తీక పూర్ణిమను భావిస్తారు. అలాగే, శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు జన్మించిన పవిత్రమైన రోజుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం, గంగా స్నానం, దీపదానం చేయడం మహాఫలప్రదంగా పరిగణించబడుతుంది. దీపారాధన చేసి, శివుడు, విష్ణువు, కార్తికేయుడు, తులసీ దేవి, గంగాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. ఏతావాతా కార్తీక పౌర్ణమి రోజుతో ముడిపడి ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉండటం.. అందుకు తగ్గట్టుగానే కార్తీక పౌర్ణమి విశిష్టత కూడా మరింత పెరుగుతోంది.

