లక్షల కోట్ల రూపాయల విలువైన ఫ్రాంఛైజీలు.. వేల కోట్ల రూపాయల లాభాలు. ప్లేయర్లను వేలంవెర్రిగా అభిమానించే ఫ్యాన్స్. ఇదీ టూకీగా ఐపీఎల్ కు ఉండే క్రేజ్. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు డబ్బుకు లోటేం లేదు. అసలు నష్టాలు వస్తాయనే ఆలోచనే లేదు. అయినా సరే అభిమానుల్ని దారుణంగా వంచిస్తున్నారు. ఫ్రాంఛైజీలు, టికెట్ బుకింగ్ పార్ట్‌నర్స్‌తో కలిసి ఆడుతున్న డర్టీ గేమ్.. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే.. స్టార్లంటే పడిచచ్చే అభిమానులకు మ్యాచ్‌ల్ని దూరం చేస్తున్నాయి. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో బయటపడ్డ ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా హైదరాబాద్ కే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దందానే నడుస్తోందనే చర్చ జరుగుతోంది.
సీజన్‌ను బట్టి విమానాల్లో టికెట్ల ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు కొన్ని రైళ్లలో కూడా రద్దీని బట్టి టికెట్ల ధరలు పెరగటం కామన్. ఇదే సూత్రం తమకు మాత్రం ఎందుకు వర్తించదని ఐపీఎల్ సన్ రైజర్స్ యాజమాన్యం ఆలోచించినట్టుగా ఉంది. అందుకే ఊహించని విధంగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల రేట్లు పెంచేసి.. బ్లాక్ మార్కెట్ దందాకు గేట్లెత్తింది. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం చాలదన్నట్టుగా బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి..అసలైన అభిమానుల్ని ఆటకు దూరం చేయడంపై రచ్చ జరుగుతోంది. టికెట్ల విక్రయాలకు వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలతోనే అసలైన డర్టీ గేమ్ మొదలౌతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఉప్పల్ వేదికగా జరిగే ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కి డిమాండ్ మామూలుగా లేదు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల రికమండేషన్‌లు కూడా పెట్టుకున్నా టికెట్ దొరకడం గగనంగా మారింది. అలాంటి క్రేజీ మ్యాచ్ కి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరికేశాయ్.. మేం బుక్ చేసుకున్నాం.. అనుకుని సంబరపడుతున్నారా..? ఇంతకూ మీరు టికెట్ బుక్ చేసుకున్న వెబ్‌సైట్ ఒరిజనలేనా..? నకిలీదా..? తస్మాత్ జాగ్రత్త ! కేవలం ఈ మ్యాచ్‌ను క్యాష్ చేసుకునేందుకు మార్కెట్లోకి నకిలీ డిస్ట్రిక్ యాప్ వచ్చేసింది.
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీమ్ ఆడుతోందని కాదు… క్రికెట్ మ్యాచ్ జరుగుతోందా లేదా.. మనం చూశామా లేదా.. అదే ముఖ్యం అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. దానికి తోడు ఇప్పుడు బెంగళూరుతో మ్యాచ్‌కు కోహ్లీ ఫ్యాక్టర్ తోడు కావడంతో.. క్రేజ్ ఆకాశాన్నంటిందనే చెప్పాలి. ఈ క్రేజ్‌కి తగ్గట్టు… టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్నీఇన్నీ కావు. ఆన్‌లైన్ లో ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా..? అని రెండు మూడు గంటల ముందు నుంచే యాప్ ఓపెన్ చేసుకుని నిరీక్షిస్తుంటారు. ఐనా టికెట్ దొరుకుతుందన్న గ్యారెంటీ ఉండదు. ధర ఎక్కువైనా పర్లేదు… ఎన్ని రెట్ల ధర పెరిగినా గుడ్డిగా కొనేద్దామనుకునే ఫ్యాన్స్‌కు లోటు లేదు. అంతే ఇంకేముంది. ఈ వేలంవెర్రిని క్యాష్ చేసుకోవటానికి అటు ప్రైవేట్ వ్యక్తులతో పాటు.. ఇటు ఫ్రాంఛైజీలు కూడా రంగంలోకి దిగటం.. అభిమానుల్ని నివ్వెరపోయేలా చేస్తోంది. నిజానికి మొదట్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా.. కేవలం ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో జరిగేది. కానీ ఏటా ఈ బ్లాక్ మార్కెట్ దందాను, అది కళ్ల జూస్తున్న లాభాలను చూసి.. ఫ్రాంఛైజీలు కూడా కకుర్కి పడుతున్నాయి. అసలు ఎవరైతే మ్యాచ్‌ను క్రమపద్ధతిలో నిర్వహించాలో.. వారే బ్లాక్ మార్కెట్ దందాకు గేట్లెత్తిన తర్వాత.. ఇక చెప్పేదేముంది. అసలు ఈ దందాకు అడ్డుకడ్డ పడేదెలాగ అనే ప్రశ్నలు అభిమానుల్ని కుదిపేస్తున్నాయి.
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటిదాకా అభిమానంతో ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా టికెట్ కోసం అభిమానులు చిన్నసైజు యుద్ధాలకూ వెనుకాడరు. అలాంటప్పుడే క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఈ క్యాష్ చేసుకోవడం కూడా ఓ స్థాయి వరకు అయితే పర్లేదు. కానీ ఏకంగా కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయింటే దుస్థితి వచ్చిందంటే.. దానికి ఐపీఎల్ దోపిడీ అని కొత్త పేరు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర జరుగుతోంది ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా శుక్రవారం చివరి మ్యాచ్ జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య . రెండూ హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్. ఇంకేం… ఫ్యాన్స్ కి పండగే. పక్కా పైసా వసూల్ మ్యాచ్. రెండు టీమ్స్ నుంచి సిక్సర్ల వర్షం… బౌండరీల వరద… ! ఫ్యాన్స్‌కి అసలైన కిక్ ఇచ్చే మ్యాచ్ ఇది. ఇక ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి మాస్ జాతరే. ఏ మ్యాచ్ చూడకపోయినా సరే.. ఈ మ్యాచ్ చూద్దాం అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి మ్యాచ్ కి టికెట్లు అంటే… పరిస్థితి మామూలుగా ఉంటుందా..? డిస్ట్రిక్ యాప్‌లో నిమిషాల్లో టికెట్లు మాయం అయ్యాయి. క్షణాల్లోనే సోల్డ్ ఔట్ బోర్డు దర్శనం ఇచ్చింది. కొందరు ఏకంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారుల రికమండేషన్‌లు పెట్టిస్తున్నారు. మరికొందరు ఏకంగా మంత్రుల రిఫరెన్స్ తో టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఐనా టికెట్ దొరకడం లేదు.
ఎప్పుడు అవకాశం దొరుకుతుందా..? అని గోతికాడి నక్కల్లా ఎదురుచూసే సైబర్ నేరగాళ్లు.. ఈ మ్యాచ్ ను అవకాశంగా వాడుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్‌ను తయారు చేశారు. అచ్చం జోమాటో డిస్ట్రిక్ట్ యాప్‌ను తలపించేలా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్… ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూ లేదు… ఏ ఏరియాలో కావాలన్నా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. హమ్మయ్యా టికెట్ దొరికితే చాలనుకున్న ఫ్యాన్స్… వెబ్‌సైట్ పై పెద్దగా కాన్సన్‌ట్రేట్ చేయలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు నకిలీ డిస్ట్రిక్ట్ యాప్‌పై ప్రచారం చేశారు. కానీ.. అప్పటికే వందలాది మంది టికెట్ బుక్ చేసుకున్నారు. లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్‌లో బుక్ చేసుకున్న టికెట్ క్యూ ఆర్ కోడ్ ద్వారా మ్యాచ్‌కి వస్తే… లోపలికి అనుమతించబోమని చెప్తున్నారు. దీంతో… టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ అంతా అయోమయానికి గురవుతున్నారు. తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా.. కాదా అనే గందరగోళంలో పడ్డారు.
ఇప్పటికే నకిలీ యాప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. కానీ.. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం ఏటా ఐపీఎల్ టికెట్ల తిప్పలు మాత్రం తప్పడం లేదు. వీటికి తోడు ఇలాంటి సైబర్ నేరగాళ్లు కూడానూ. కొన్ని ముఠాలు ముందుగానే భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి, వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకకుండా పోతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రత్యేకంగా జొమాటో డిస్ట్రిక్ యాప్స్ ద్వారా జరిగిన బుకింగ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లు పలుమార్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, దీంతో నిజమైన అభిమానులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హై ఓల్టేజ్ మ్యాచ్‌లను ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం భారీగా క్యాష్ చేసుకుంటోందని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ ధరలు పెంచడమే కాకుండా.. అదనంగా భారీ బుకింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాధారణ టికెట్ ధర ఇప్పుడు రెట్టింపు నుంచి పది రెట్ల దాకా పెరిగిపోయిందంటే.. ఐపీఎల్ బ్లాక్ టికెద్ దందా ఏ రేంజ్‌లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా సన్ రైజర్స్ నుంచి స్పందన లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఐపీఎల్ టికెట్ల విషయంలో బ్లాక్ దందా.. కొత్తగా బయటపడిన వ్యవహారం కాదు. గతంలో బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లోనూ ఇదే దందా నడిచింది. ఇంకా మాట్లాడితే గతంలో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా కూడా బ్లాక్ టికెట్ దందా నిరాటంకంగా జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో బ్లాక్ దందా చేస్తున్న కేటుగాళ్లు.. బీసీసీఐని మించి ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో పండిపోయారు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ అభిమానులు గట్టిగా నిలదీస్తున్నారు. క్యూలో లక్షల మంది వేచి చూస్తుండగానే క్షణాల వ్యవధిలో అన్ని టికెట్లు ఎలా అమ్ముడవుతాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు టికెట్లు నిజమైన అభిమానుల చేతుల్లోకి వెళ్తున్నాయా? లేక తెరవెనుక ముందస్తుగానే బ్లాక్ మార్కెట్ ఏజెంట్లకు మళ్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్లే, అధికారిక యాప్‌లో సోల్డ్ ఔట్ అని పడిన కొద్దిసేపటికే.. సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇతర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌లలో రెండింతలు, మూడింతల ధరలకు టికెట్లు అమ్ముతున్న స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
క్రికెట్ కేవలం వినోదంగా కాకుండా పూర్తిగా ఒక కమర్షియల్ వ్యాపార మోడల్‌గా మారిపోతోందని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. స్టార్ ప్లేయర్స్ ఉన్న మ్యాచ్‌లను ప్రీమియం ఈవెంట్స్‌గా మార్చి రేట్లు పెంచడం ఫ్రాంచైజీలకు లాభదాయకమే కావచ్చు, కానీ భవిష్యత్తులో ఇది మైదానంలో ఉండే అసలైన క్రౌడ్ వైబ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. స్టేడియం సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పుడు డిమాండ్‌ను బట్టి ధరలు పెరగడం మార్కెట్ సూత్రమే అయినా, సామాన్యుల కోసం కొంత కోటాను అందుబాటు ధరల్లో ఉంచాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్లపై ఉందంటున్నారు.
అసలు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే టికెట్ల గురించి వివాదం మొదలైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ రేసు నుంచి బెంగళూరును తప్పించడానికి గల కారణాలను బీసీసీఐ వెల్లడించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లను డిమాండ్ చేయడంతో చిన్నస్వామి స్టేడియానికి అవకాశం దక్కలేదని బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం స్టేడియం మొత్తం సామర్థ్యంలో 15 శాతం టికెట్లను మాత్రమే ఆతిథ్య రాష్ట్ర సంఘానికి ఉచితంగా కేటాయిస్తారు. అన్ని రాష్ట్రాల సంఘాలకు ఇదే ప్రామాణికం. అయితే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల సమయంలో కేఎస్‌సీఏ నిర్ణీత 15 శాతం కోటా కంటే చాలా ఎక్కువ కోరుతున్నట్లు తేలడంతో.. బీసీసీఐ ఆందోళనకు గురైంది. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమనే భావనతో కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు అదే టికెట్ల విషయంలో బ్లాక్ మార్కెట్ దందా తెరపైకి రావడం.. బీసీసీఐకి కూడా తలబొప్పి కట్టిస్తోంది. ఏటా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతున్న తరుణంలో.. ఇలాంటి బ్లాక్ మార్కులు పడితే.. ఇమేజ్ సంగతేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు బ్లాక్ టికెట్ల దందాపై బీసీసీఐ దగ్గర ఆందోళన వ్యక్తం చేశాయి. ఎందుకంటే బ్లాక్ టికెట్ దందాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు. గతంలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయి. ఇలా అనుకోకుండా జరుగుతున్న వరుస ఘటనలు.. ఐపీఎల్‌కు చెడ్డపేరు తెస్తాయేమోననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్‌కు ఉన్న పేరు కాపాడుకోవాలంటే.. ఇలాంటి బ్లాక్ టికెట్ దందాలకు చెక్ పెట్టాల్సిందే.
ఏతావాతా బ్లాక్ టికెట్ దందాతో.. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ, టికెట్ల విక్రయంలో లోపాలు బట్టబయలౌతున్నాయి. అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంఛైజీలు.. ఎక్కడికక్కడ స్థానిక క్రికెట్ అసోసియేషన్ల సహకారం తీసుకుని.. మరింత కట్టుదిట్టంగా మ్యాచులు నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏమాత్రం పరిస్థితులు కట్టుతప్పినా.. వాటిని మళ్లీ గాడిన పెట్టడం అంత తేలిక కాదనే చర్చ జరుగుతోంది. అభిమానులు పిచ్చిగా ఎంత రేటైనా పెట్టి టికెట్ కొంటున్నారు కదా అని అలుసుగా తీసుకోవడం కూడా భవిష్యత్తులో ముప్పు కొనితెచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ ఉప్పల్ మ్యాచ్ హ్యాష్ ట్యాగ్ నిజమౌతుందా.. లేదా అనే విషయం పక్కనపెడితే.. మెల్లగా ఓ వర్గం అభిమానులు ఐపీఎల్‌పై ఆసక్తి తగ్గించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అప్పుడు ఓ క్రమ పద్ధతిలో ఐపీఎల్ టికెట్లకు డిమాండ్ తగ్గి.. చివరకు రంజీ మ్యాచుల్లాగా స్టేడియాలు నిండని దుస్థితి కొనితెచ్చుకోవద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది, ఇకనైనా బ్లాక్ టికెట్ దందాకు అడ్డుకట్ట వేయటానికి సమర్థ కార్యాచరణ తీసుకోవాలి, ఐపీఎల్ ఆదాయం ఎంత పెరుగుతుందో చూసుకోవడంతో పాటు.. ఆ ఆదాయ మార్గాల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ, ఫ్రాంఛైజీల మీదే ఉంది. ఐపీఎల్‌తో భారీగ సంపాదిస్తూ.. టికెట్ల రేట్ల దగ్గర కక్కుర్తి ఏమిటనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఈ చర్చ పెరిగి పెద్దదైతే.. అసలుకే మోసం వస్తుదనే సంగతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు.
దేశంలో ఇతర క్రీడల దుస్థితి ఎలా ఉంది చూసైనా.. బీసీసీఐ క్రికెట్ క్రేజ్‌ను పదిలంగా కాపాడుకోవాలి. అలాగే ఐపీఎల్ బిజినెస్ ఫెయిర్‌గా జరుగుతోందనే నమ్మకం కలిగించడం కూడా చాలా అవసరం. మ్యాచ్ టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందో చెప్పటానికి ప్రస్తుత సినీ ఇండస్ట్రీ పరిస్థితే పెద్ద ఉదాహరణ. గతంలో సినిమా టికెట్లు కూడా బ్లాక్ లో విక్రయించేవాళ్లు. చివరకు ఆ రేట్లే ప్రామాణికంగా తీసుకుని.. టికెట్ ధరలు విపరీతంగా పెంచేశారు. దానికి జస్టిఫికేషన్ గా ప్రేక్షకులు కోరుకోని కొత్త సాంకేతికలు తెచ్చి వారి తలపై రుద్దారు. కానీ టికెట్ ధరల భారం మోయలేక.. సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో చివరకు టికెట్ ధరల్లో సబ్సిడీ ఇస్తామని ప్రకటనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ కూడా రేపేమాపో ఇలా తయారవ్వదని గ్యారంటీ ఏం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే అత్యాశతో.. ఇలాగే టికెట్ ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెంచుకుంటూ పోవడం.. చివరకు ఆ రేటుకూ విక్రయించకుండా బ్లాక్ మార్కెట్‌కు తెరలేపటం.. అభిమానులకు మొహం మొత్తించదనే హామీ ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఇదో పెద్ద విషయం కాదని లైట్ తీస్కుంటే.. చివరకు పరిష్కరించలేని సమస్యగా మారే పెనుప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు.
140 కోట్ల జనాభా.. వీళ్లంతా అభిమానించే ఆట. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా.. మ్యాచ్ మొదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులు. ఎప్పుడూ ఇండియా గెలవాలని కోరుకునే ఫ్యాన్స్.. తమ ఫేవరెట్ జట్టు నెగ్గాలని ప్రార్థిస్తారు. మరికొందరైతే, జట్టు సంగతి ఎలా ఉన్నా పర్వాలేదు.. తమ అభిమాన ఆటగాడు మాత్రం చెలరేగాలని కోరుకుంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా.. టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోయి చూసేవాళ్లు కోట్లాది మంది. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే.. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అయింది. కోట్ల రూపాయల కాసులవర్షం కురిపిస్తోంది. కానీ ఇప్పుడీ క్యాష్ రిచ్ లీగ్.. క్రమంగా దోపిడీ రిచ్ లీగ్‌గా మారుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఒక చిన్న యూట్యూబ్ ఛానల్‌కు లక్ష మంది వ్యూవర్స్ ఉంటేనే.. మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి. అలాంటిది కోట్ల మంది వ్యూవర్‌షిప్ ఉన్న ఐపీఎల్‌కు ఎంత డబ్బు వస్తుందో ఊహించుకుంటే చాలు. కోట్ల రూపాయల సంపద.. కేవలం అభిమానులు చూస్తున్నందుకే. మనం ఆటగాళ్ల ఫోర్లు, సిక్సులు, వాళ్ల బౌలింగ్, ఫీల్డింగ్‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. అలా మనం చూడటమే.. బీసీసీఐకి బిలియన్ల సంపద సృష్టిస్తోంది. ప్రపంచంలోని ఏ క్రికెట్ బోర్డునైనా శాసించే శక్తిని ఇస్తోంది. అందుకే చాలామంది ఆటగాళ్లు.. తమ దేశానికి ఆడటానికైనా వెనకడుగు వేస్తారు కానీ.. ఐపీఎల్‌కు దూరం కావడానికి మాత్రం ఇష్టపడరు. ఈ లీగ్‌లో ఆడితే.. తమ లైఫ్ సెట్ అవుతుందని వాళ్లకు బాగా తెలుసు. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్, సౌతాఫ్రికాలో మరో లీగ్‌తో పాటు శ్రీలంక, పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. అయితే ఐపీఎల్ ముందు అవన్నీ తీసికట్టే. అలా బీసీసీఐ ధన బలాన్ని భారీగా పెంచేసింది ఐపీఎల్.
ఐపీఎల్‌లో క్లిక్ అయితే ఆటగాళ్ల ఫేట్ మారిపోతుంది. అందుకే దేశవాళీ క్రికెటర్లంతా రెండు నెలలపాటు జరిగే టోర్నీ కోసం.. ఏడాదంతా కష్టపడతారు. బేసిక్ ధర నుంచి అమాంతం కోట్లకు పడగలెత్తొచ్చు. అంతేకాకుండా కాస్త లక్ కలిసి వస్తే.. టీమిండియాకే సెలెక్ట్ కావొచ్చు. ఒక్కసారి ఆ లైమ్‌లైట్‌లోకి వస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయేంత సంపాదించుకోవచ్చు. ఇది ఆటగాళ్ల వెర్షన్. ఆస్ట్రేలియా రిచ్చెస్ట్ బోర్డు అయినా.. వాళ్లు ఆటగాళ్లకు ఇచ్చే డబ్బులతో పోలిస్తే.. ఐపీఎల్‌లో వాళ్లు సంపాదించేదే ఎక్కువ. కాబట్టి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకే అన్ని దేశాల ఆటగాళ్లు క్యూకడతారు. ఇక ఐసీసీలో బీసీసీఐకి ఎదురుచెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేరు. ఎందుకంటే.. మనదేశంతో కయ్యం పెట్టుకుంటే వేల కోట్ల బిజినెస్ లాస్ అవుతాయి ఆయా బోర్డులు. అందుకే ఇతర లీగ్‌లలోఆడకుండా ఆటగాళ్లను నియంత్రించే బోర్డులు.. ఐపీఎల్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. అంతేకాదు.. ఆ టైమ్‌లో ఇతర సిరీస్‌లు ఏవీ లేకుండా షెడ్యూల్‌లో మార్పులు చేసుకుంటాయి. ఇది ఐపీఎల్ వల్ల బీసీసీఐకి వచ్చిన స్టామినా. ఇలా క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐని బాస్‌ని చేసింది ఐపీఎల్.
ఆటగాళ్లకు కోట్ల రూపాయలు వస్తాయి. బీసీసీఐ కూడా భారీగా ఆర్జిస్తోంది సరే.. ఇంతకీ.. వీళ్లకు ఇంత డబ్బులు ఎలా వస్తాయి ? సామాన్య అభిమాని మ్యాచ్ చూస్తే.. బోర్డు ఖాతాలో డబ్బులు ఎలా పడుతున్నాయి. ఇది తెలియాలంటే.. ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. అదే ప్రసార హక్కుల పంపిణీ. 2023 నుంచి 2027వరకు అంటే ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసార హక్కుల్ని.. బీసీసీఐ 6.2 బిలియన్లకు అమ్మింది. దాదాపు 50వేల కోట్ల రూపాయలు. అంటే.. ప్రతి సీజన్‌కు ప్రసార హక్కుల ద్వారా.. దాదాపు పదివేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బీసీసీఐ. ప్రపంచంలో అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ తర్వాత.. సెకండ్ ప్లేస్ మన ఐపీఎల్‌దే. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ బేస్‌బాల్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ లీగ్‌లను కూడా ఐపీఎల్ దాటేసింది. అంత రిచ్చెస్ట్‌గా ఐపీఎల్‌ను మార్చింది.. కోట్ల మంది క్రికెట్ అభిమానులే. కానీ అలాంటి అభిమానులకు చివరకు టికెట్ పోటే మిగులుతోందా అనే కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఆ సందేహాలకు నిదర్శనాలుగా వెలుగుచూస్తున్న బ్లాక్ టికెట్ దందా ఘటనలు.. ఐపీఎల్ ఇమేజ్‌ను చెడగొడుతున్నాయనడంలో సందేహం లేదు.
ప్రసార హక్కులతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఐపీఎల్ నిర్వాహకులకు డబ్బు వస్తుంది. 10 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు అని గతంలో కొన్ని నివేదికలు తేల్చాయి. ఇప్పడు దాని విలువ దాదాపు లక్ష కోట్ల దాకా చేరి ఉంటుంది. ఇది దాదాపు మనదేశంలో చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. 2022లో 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. 2023 నాటికి 28 శాతం పెరిగింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటితో పోలిస్తే.. ఏకంగా 433 శాతం వృద్ధి చెందింది. మరి ఇంత సంపద కళ్ల జూస్తున్నప్పుడు.. ఏటా బ్రాండ్ వాల్యూలు పెరుగుతూనే ఉన్నప్పుడు.. సామాన్య అభిమానుల్ని బ్లాక్ టికెట్ దందాలతో పీక్కుతినడం ఎందుకనేదే కీలక ప్రశ్న.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్..ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది. టీవీ, మొబైల్‌లో మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. IPL 2023 నుండి 2027 వరకు ప్రసార హక్కుల్ని బీసీసీఐ దాదాపు 50వేల కోట్లకు అమ్మంది. ఈ సంపాదనలో సగం IPL జట్లకు వెళుతుంది. దానివల్ల ఫ్రాంఛైజీలకు రాబడి కూడా పెరుగుతుంది. ఐపిఎల్ జట్లు విదేశాలలో లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేస్తూ, మానిటైజేషన్ కోసం కొత్త మార్గాలను తెరుస్తున్నాయి. కానీ ఎన్ని ఆదాయమార్గాలున్నా.. రైట్‌రాయల్‌గానే వేల కోట్ల సంపాదన వచ్చి పడుతున్నా.. ఫ్రాంఛైజీలు మాత్రం చిలక్కొట్టుడు మానుకోవడం లేదా.. అంటే లేదనే చెప్పాలి. పైగా ఆ చిలక్కొట్టుడు కోసం తొక్కుతున్న అక్రమ మార్గాలు.. సాధారణ క్రికెట్ అభిమానుల్ని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పటిదాకా ఐపీఎల్ ను వెర్రిగా అభిమానించినవారికి, టికెట్ల కోసం ఎంతకైనా తెగించినవారికి.. బ్లాక్ టికెట్ దందాను చూసి తీవ్ర నిరాశ తప్పటం లేదు.
ఏతావాతా ఐపీఎల్ క్యాష్ రిచ్ లీగ్ అయిందన్నా,, బీసీసీఐ క్రికెట్ ప్రపంచానికి బాస్ అయిందన్నా.. దానికి మూల కారణం అభిమానులే అనే నిష్ఠుర సత్యం మర్చిపోకూడదు. సెలబ్రిటీల హాజరు మ్యాచ్‌కు అదనపు ఆకర్షణే కానీ.. ఆయువుపట్టు ఎప్పుడూ సాధారణ అభిమానులే. అలాంటి అభిమానుల ఆదరణ దండిగా ఉన్నంతకాలమే ఐపీఎల్‌కు ఈ క్రేజ్ ఉంటుందనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతేకానీ పిచ్చిగా స్టేడియాలకు పోటెత్తే అభిమానుల్ని లైట్ తీస్కుంటే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఐపీఎల్ ను తరచి చూస్తే.. అటు బోర్డు, ఇటు ఫ్రాంఛైజీలు.. ఇంకోవైపు ఆటగాళ్లు బాగానే సంపాదించుకుంటున్నారు. కానీ ఈ సంపాదనకు ప్రధాన కారణమైన అభిమానుల ఆశలు మాత్రం స్టేడియాల సాక్షిగా మట్టికొట్టుుకుపోతున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ ఫ్రాంఛైజీలతో కలిసి సమగ్ర వ్యూహాలతో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందాను అదుపు చేయాలి. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. టికెట్ల విక్రయ నిబంధనలు మార్చాలి. లేకపోతే మాత్రం చేజేతులా అభిమానుల్ని ఐపీఎల్‌కు దూరం చేసినట్టవుతుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సగటు అభిమాని.. ఓసారి మోసపోవచ్చు. రెండు సార్లు మోసపోవచ్చు. కానీ పదే పదే అదే మోసం రిపీటైతే తట్టుకునే ఆర్థిక శక్తి ఆ ఫ్యాన్‌కు ఉండదనే సంగతిని కచ్చితంగా బీసీసీఐ, ఫ్రాంఛైజీలు గమనంలోకి తీసుకోవాలి. ఏ అ భిమాన పునాదుల మీద ఐపీఎల్ లాంటి భారీ భవంతిని నిర్మించారో.. అవే పునాదుల్ని బలహీనపరిచే పనులు చేస్తే.. చివరకు సౌధం కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించాలి.
